తెలంగాణలో కరోనా తీవ్రరూపం.. పదివేల మార్క్‌దాటిన కేసులు

by  |
telangana corona sticker
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఊహకు అందని విధంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో తొలిసారిగా కరోనా కొత్త పాజిటివ్ కేసులు పది వేల మార్కు దాటింది. టెస్టులు చేయించుకున్న ప్రతీ పది మందిలో ఒకరు పాజిటివ్‌గా తేలుతున్నారు. కొద్దిమందికి నెగెటివ్ రిపోర్టు వచ్చినా లక్షణాలు మాత్రం కనిపిస్తున్నాయి. టెస్టుల్లో ‘ఫాల్స్’ రిపోర్టులు వస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ అధికారులే చెప్తున్నారు. నైట్ కర్ఫ్యూతో కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేయవచ్చని భావించిన ప్రభుత్వానికి ప్రతికూల ఫలితాలే ఎదురవుతున్నాయి. దహనం చేయడానికి కూడా టైమ్ లేనంతగా శ్మశానాల్లో 24 గంటలూ శవాలు కాలుతూనే ఉన్నాయి. ఈ నెలలోనే దాదాపు 400 మంది కరోనాతో చనిపోయారు (అధికారిక లెక్కల ప్రకారం). కానీ ఇంతకు నాలుగైదు రెట్ల మంది చనిపోయినట్లు ఆసుపత్రుల వర్గాలు, శ్మశానాల నిర్వాహకులు చెప్తున్నారు.

గడచిన 24 గంటల్లో రాష్ట్రం మొత్తం మీద 10,122 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజుతో పోలిస్తే దాదాపు రెట్టింపైంది. స్థానిక ఎన్నికలు జరిగే వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఒక్క రోజులోనే కేసులు రెట్టింపయ్యాయి. నాయకులు, ప్రజలు ఎన్నికల ప్రచారంలో తలమునకలు కావడంతో అక్కడ వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉంది. నాగార్జునసాగర్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా కరోనా నిబంధనలను గాలికి వదిలేయడంతో ఇప్పుడు వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు పుట్టుకొస్తున్నాయి. పది శాతం కంటే ఎక్కువ పాజిటివ్ రేటు ఉంటే కంటైన్‌మెంట్ జోన్లను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసినా తెలంగాణలో, హైదరాబాద్ నగరంలో అది బుట్టదాఖలా అయింది. పేరుకే జోన్లు ఉన్నాయిగానీ అవి ఉన్నట్లుగా స్థానిక అధికారులకే తెలియడంలేదు.

గడచిన 24 గంటల్లో కొత్తగా నమోదైన కరోనా కేసులు

జిల్లా నిన్న నేడు
ఖమ్మం 118 424
వరంగల్ అర్బన్ 329 653
వరంగల్ రూరల్ 113 233
కామారెడ్డి 110 279
నిర్మల్ 26 129
నల్లగొండ 90 469
సూర్యాపేట 69 303
యాదాద్రి 51 278
సిరిసిల్ల 121 255
పెద్దపల్లి 52 169


Next Story

Most Viewed