‘రహదారి నిర్మాణానికి నిధులు విడుదల చేయండి’

by  |
nithi-gadkari 1
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో సెంట్రల్ రోడ్డు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సీఆర్ఐఎఫ్) నిధులతో చేపట్టనున్న రోడ్ల నిర్మాణ పనులకు నిధులు విడుదల చేయాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని టీఆర్ఎస్ లోక్‌సభా పక్షనేత నామా నాగేశ్వర రావు కోరారు. టీఆర్ఎస్ ఎంపీల బృందం శుక్రవారం గడ్కరీని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా 2021 సంవత్సరానికి రాష్ట్రానికి రావాల్సిన సీఆర్ఐఎఫ్ నిధులు రూ.620 కోట్లు విడుదల చేయాలని కోరారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 3,306కి.మీ రోడ్లను రాష్ట్ర రహదారులుగా గుర్తించగా అందులో ఇప్పటి వరకు 2,168 కి.మీ రోడ్లను జాతీయ రహదారులుగా గుర్తించారని, మిగిలిన 1138 కి.మీల రోడ్డును కూడా గుర్తించాలని కోరారు.

చౌటుప్పల్-ఆమనగల్-షాద్ నగర్-కంది లను కలిపే రూ.186 కి.మీ, కరీంనగర్-సిరిసిల్ల-కామారెడ్డి-పిట్లం మధ్య 165 కి.మీ, కొత్తపేట-గూడూరు-మంత్రాలయం మధ్య 70 కి.మీ, జహీరాబాద్-బీదర్-డెగ్లూరు మధ్య 25 కి.మీ మొత్తం కలిపి 446 కి.మీల రహదారులను జాతీయ హోదా కల్పించాలని లేఖలో పేర్కొన్నారు. మిర్యాలగూడలో ప్రస్తుతం ఉన్న రెండు లైన్లను నాలుగు లైన్ల రోడ్డుగా మార్చాలని సూచించారు. అనంతరం హైదరాబాద్ చుట్టూ నిర్మించబోతున్న రీజనల్ రింగ్ రోడ్డుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల గడ్కరీ కి కృతజ్ఞతలు తెలిపారు. గడ్కరీని కలిసిన వారిలో ఎంపీలు పోతుగంటి రాములు, బండా ప్రకాష్, మాలోతు కవిత, పసునూరి దయాకర్, బడుగుల లింగయ్య యాదవ్, గడ్డం రంజిత్ రెడ్డి, కేఆర్ సురేష్ రెడ్డి, బీబీ పాటిల్ లు ఉన్నారు.


Next Story