మహిళా సంఘాల సర్వేపై సడలింపు

by  |
survey
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని మహిళా సంఘాల సర్వేపై గ్రామీణాభివృద్ధి శాఖ కొంత వెనక్కి తగ్గింది. కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై విమర్శలు రావడం, సెర్ప్​ ఉద్యోగ జేఏసీ కూడా ఉన్నతాధికారులు, మంత్రులకు ఫిర్యాదు చేయడంతో సోమవారం సాయంత్రం కొంత సడలింపులిచ్చారు. వాస్తవంగా మంగళవారం నాటికి ఇంటింటా సర్వే పూర్తి చేసి, మహిళల ఫొటోలతో సహా వివరాలు సమర్పించాలని సెర్ప్​ ఆదేశాలివ్వగా… ప్రస్తుతం ఆఖరు తేదిని ఎత్తివేశారు. మంగళవారంతో పూర్తి చేసి వివరాలు సమర్పించాలనే నిబంధనలను తొలగించారు.

కరోనా పరిస్థితులను అంచనా వేస్తూ పరిస్థితులు అనుకూలంగా ఉండని ప్రాంతాల్లో తాత్కాలికంగా నిలిపివేయాలని, కరోనా జాగ్రత్తలు పాటిస్తూ సర్వే చేయాలంటూ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్​ కుమార్​ సుల్తానియి మౌఖిక ఆదేశాలు జారీ చేశారని సెర్ప్​ జేఏసీ ప్రతినిధులు కుంట గంగారెడ్డి, ఏపూరి నర్సయ్య, సుభాష్​, మహేందర్​రెడ్డి, సుదర్శన్​ తెలిపారు. అయితే ఇంకా సర్వే చేయాలని చెప్పుతున్నారని, కరోనా సెకండ్​ వేవ్​ సమయంలో మొత్తం నిలిపివేయాలని వారు కోరారు. ప్రస్తుతం కొంత గడువును పెంచారని, గడువు పెంచినా సర్వే చేయాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా కరోనాతో సెర్ప్​ మరో ఉద్యోగి మరణించాడు. కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లాలో సీసీగా పని చేస్తున్న కాశీరాం కరోనాతో సోమవారం రాత్రి మృతి చెందాడు. ఇప్పటికే సెర్ప్​ సిబ్బంది దాదాపు 500 మందికిపైగా కరోనా బారిన పడ్డారు. ఒక ఏపీఎం, ఇద్దరు సీసీలు మృతి చెందారు.


Next Story