గ్రూపు పాలిటిక్స్‌.. ఎమ్మెల్యే రేగా వారికి హ్యాండ్ ఇచ్చారా..?

by  |
గ్రూపు పాలిటిక్స్‌.. ఎమ్మెల్యే రేగా వారికి హ్యాండ్ ఇచ్చారా..?
X

దిశ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు విషయం నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. రేగాను నమ్ముకున్న కొందరు సీనియర్ నాయకులు, తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన వ్యక్తులు ఎక్కడ ఉన్నారనే చర్చ ప్రజలలో జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన రేగా ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. అయితే రేగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అతనితో సన్నిహితంగా ఉన్న నాయకులు, ఉద్యమ నేతలను ప్రస్తుతం రేగా చెందిన ఓ వర్గం ఇబ్బందులకు గురిచేస్తోందన్న చర్చ ప్రారంభమైంది. ఆనాడు రేగాను నమ్ముకున్న కొందరు వ్యక్తులు ఇప్పడు ఎక్కడ ఉన్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఉద్యమ నాయకులను రేగా మరచిపోయారా..

ఎమ్మెల్యే రేగా కాంతారావు వ్యక్తిగతంగా సూపర్ మ్యాన్ అని కొందరు సీనియర్ నాయకుల వాదన. కానీ, ఇప్పుడు రేగా చుట్టూ ఉన్న ఒక వర్గం రేగాతో సన్నిహితంగా ఉన్న వ్యక్తులను దూరం పెట్టించారని కొందరు నాయకులు మాట్లాడుతున్నారు. ఒక వర్గం ఎప్పుడూ రేగాతో ఉంటూ ఏ ఒక్కరినీ రేగా దగ్గరకు రానివ్వడం లేదని సీనియర్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్గమే రేగా పరువును బజారుకీడుస్తున్నారని, అంతేగాక రాజకీయ జీవితాన్ని నవ్వులపాలు చేస్తున్నారని కొందరు సీనియర్లు అంటున్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాడు రేగాతో కలిసి ఉద్యమం చేసిన వ్యక్తులు ఇప్పుడు ఎందుకు లేరంటూ రేగాను ప్రశిస్తున్నారు. రేగా తనతో పాటు ఉద్యమం చేసిన వ్యక్తులను మరచిపోయారా లేక కావాలనే దూరం పెట్టారా అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే రేగా వారిని మర్చిపోలేదు కానీ.. ఓ వర్గమే రేగాకు తప్పుడు సమాచారం ఇచ్చి ఉద్యమకారులను దగ్గరకు రానివ్వకుండా చేస్తున్నారని కొందరు సీనియర్ నాయకుల ద్వారా తెలుస్తోంది.

ఉద్యమం వారిది.. పెత్తనం వీరిది..

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కోసం ఆనాడు ఎమ్మెల్యే రేగా కాంతారావుతో కలసి కొందరు నాయకులు అహర్నిశలు కృషి చేశారు. ఆనాడు ఉద్యమంలో పాల్గొనకుండా ఇప్పుడు కొంత మంది వారిపై పెత్తనం చెలాయిస్తున్నారని నాయకులు మాట్లాడుకుంటున్నారు. ఉద్యమ నేపథ్యం లేని కొంత మంది రేగా పక్కనచేరి జల్సాలు చేస్తూ పార్టీ పరువు, రేగా పరువు తీస్తున్నారనే చర్చ జరుగుతోంది. అంతేకాకుండా వారు రేగా పక్కనచేరి రేగా.. ఆయన పేరు చెప్పి కొన్ని దందాలకు పాల్పడుతున్నారని సీనియర్ నాయకులు వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా రేగా ఎందుకు మౌనంగా ఉన్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికైనా రేగా ఉద్యమకారులను తన వద్దకు పిలుచుకుంటారా లేదా అనేది వేచిచూడాల్సిందే.

వారు రేగా పక్కన చేరారా..

ఎక్స్ ఎమ్మెల్యే చుట్టూ ఉన్న కొందరు నాయకులు రేగా పక్కన చేరారనే వాదన సీనియర్ నాయకుల మాటల ద్వారా తెలుస్తోంది. ఎక్స్ ఎమ్మెల్యే చుట్టూ ఉన్న కొందరు నాయకులు ఆనాడు రేగాను ఎంతగానో దూషించారు, అవమానించారు. కానీ, ఇప్పుడు వాళ్లే రేగా పక్కనచేరి దందాలకు పాల్పడుతున్నారని సీనియర్ నాయకులు చర్చించుకుంటున్నారు. రేగా నిజానికి ప్రజల నాయకుడు, ప్రజా సమస్యలకు తోడుగా ఉండే వ్యక్తి.. అలాంటి వ్యక్తిని కొందరు తప్పు దోవపట్టించి, తప్పుడు మాటలు చెప్పి.. రేగాతో సన్నిహితంగా ఉన్న వ్యక్తులను దూరం చేస్తున్నారనే వాదన కూడా లేకపోలేదు. ఇప్పటికైనా రేగా ఆ వ్యక్తులను దూరం పెట్టకపోతే తన రాజకీయ జీవితానికి పెద్ద ఎదురు దెబ్బ తగిలే ఛాన్స్ ఉందని సీనియర్ అంటున్నారు.

ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ పార్టీ నుంచి రేగాతో కలిసి నడిచిన కొందరు నాయకులను ఆయన దూరం పెట్టడంతో వారు ఆవేదన చెందుతున్నారని సమాచారం. రేగా చుట్టూ ఉన్న కొందరు వ్యక్తుల వల్లే ఉద్యమ నాయకులు, సీనియర్ నేతలు ఆయనకు దూరమయ్యారనే టాక్ వినిపిస్తోంది. రేగా చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు గ్రూపు రాజకీయాలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఆ గ్రూపులోని వ్యక్తులే రేగా దగ్గరికి సీనియర్ నాయకులను రానివ్వడంలేదనే చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా రేగా ఉద్యమకారులను గుర్తించి పార్టీలో వారికి స్థానం కల్పించాలని సీనియర్ నాయకులు కోరుతున్నారు.



Next Story