‘ప్రైవేట్’కు రెడ్ కార్పెట్.. ఆర్టీసీకి కోలుకోలేని దెబ్బ

by  |
TS RTC
X

దిశ, తెలంగాణ బ్యూరో : నిర్ణయాలేమైనా.. ఆర్టీసీకి మాత్రం అన్యాయం చేస్తున్నారు. ఇప్పటికే వేల కోట్ల అప్పుల్లో నెట్టుకువస్తున్న తెలంగాణ ఆర్టీసీకి కేంద్రం తీసుకువచ్చిన కొత్త పర్మిట్​ విధానం మరింత ప్రమాదకరంగా మారింది. సరిపడ బస్సులు లేక అంతరాష్ట్ర సర్వీసులను ఆంక్షలతో నడుపుకుంటున్న రాష్ట్ర ఆర్టీసీ ఇప్పుడు చేతులెత్తేయాల్సిన పరిస్థితి వస్తోంది. ఆర్టీసీ పతనానికి కారణమయ్యే కొత్త విధానానికి కేంద్రం ఆమోదం చెప్పింది. ఇప్పటి వరకు పట్టుకుంటే జరిమానాలు చెల్లించాల్సి వస్తుందంటూ భయపడుతూ తిరిగిన ప్రైవేట్​ ట్రావెల్స్​కు ఎర్ర తివాచీ పరుస్తున్నారు. నిబంధనలకు బ్రేకులే తీసేసి స్టేజీ క్యారియర్లుగా ప్రయాణికులను తరలిస్తూ ఆర్టీసీని నష్టాల్లోకి తోస్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులు ఇక పట్టాపగ్గాలు లేకుండా దూసుకుపోనున్నాయి. ఇప్పటి వరకు టూరిస్ట్‌ పర్మిట్లకే పరిమితమవుతూ వచ్చిన బస్సులు ఇక సమూహాలతోనే కాకుండా వ్యక్తులుగా కూడా తరలించుకునేందుకు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. కేంద్రం గతంలోనే చేసిన సవరణ ఈ నెల 1 నుంచే అమల్లోకి వచ్చింది.

ఇక మీ ఇష్టం

గత నెల వరకు టూరిస్టు పర్మిట్లతో కేవలం నిర్ధారిత ప్రాంతం నుంచి గమ్యస్థానం వరకు తీసుకున్న అనుమతి ప్రకారం సమూహాలుగా తరలించే అవకాశం ఉండేది. దీనిలో ఆయా రాష్ట్రాల మీదుగా ఆ బస్సు తిరిగితే ఆ రాష్ట్రాలకు పర్మిట్‌ ఫీజు చెల్లించాలి. కానీ కేంద్రం తాజాగా పర్యాటకానికి ప్రోత్సాహం అంటూ ఆల్​ ఇండియా టూరిస్ట్‌ పర్మిట్‌ నిబంధనలను మార్చేసింది. కొత్త పర్మిట్‌ విధానంలో ప్రయాణికుల తరలింపునకు నూతన విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది.

గతంలో పెళ్లి బృందాలు, యాత్రలు, ఇతర అవసరాలకు సంబంధించి ఒక ప్రాంతం నుంచి నిర్ధారించిన ప్రాంతం వరకు కేవలం ఒకే బృందంగా రవాణా ఉండేది. కానీ కొత్త పర్మిట్​ విధానంతో ఎవరికి ఎవరు తెలియకున్నా… బృందంతో అవసరం లేకుండా ఎవరికి వారుగా టూరిస్టు బస్సుల్లో ప్రయాణాలు చేసుకునే విధంగా పర్మిట్​ మార్పు చేశారు. అసలే ఇష్టారాజ్యంగా బస్సులు తిప్పుకునే ప్రైవేట్​కు ఇది మంచి పరిణామంగా మారుతోంది. అంటే హైదరాబాద్​ నుంచి వెళ్లే టూరిస్టు బస్సు ఇక ఎక్కడైనా… ఆర్టీసీ మాదిరిగా ఎక్కడైనా ప్రయాణీకులను తరలించుకోవచ్చు. దీనికి తోడుగా ప్రస్తుతం దేశం మొత్తం ఒకే పర్మిట్‌ ఫీజు ఉంటుంది. మొత్తం వసూళ్ల నుంచి కేంద్రం.. రాష్ట్రాలకు వాటాలిస్తుంది.

ఏ వాహనం ఎంత పర్మిట్‌ ఫీజు చెల్లించాలి?

డ్రైవర్‌ కాకుండా తొమ్మిది మంది లోపు ప్రయాణికులుండే ఏసీ వాహనాలకు రూ.25 వేలు, నాన్‌ ఏసీ వాహనాలకు రూ.15 వేలు, పది అంతకంటే ఎక్కువ, 23 కంటే తక్కువ మంది ప్రయాణించే వాహనాలలో ఏసీకి రూ.75 వేలు, నాన్‌ ఏసీకి రూ.50వేలు, 23 మంది ప్రయాణికులపై మేర సామర్ధ్యం ఉన్న వాహనాలకు ఏసీకి రూ.3 లక్షలు, నాన్‌ ఏసీ రూ.2 లక్షల చొప్పున వార్షిక పర్మిట్‌ ఫీజు చెల్లించాలి.

ఇక ప్రైవేట్​ హవా

రాష్ట్రంలో ప్రైవేట్​ వాహనాల హవా పెరగనుంది. ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం రాష్ట్రంలో 4,585 ప్రైవేట్​ ట్రావెల్స్​ ఉండగా, 1,600 వరకు టూరిస్టు బస్సులుగా చూపిస్తున్నారు. ఇప్పటి వరకు అంతరాష్ట్ర సర్వీసులు, ఇతర పర్యాటక ప్రాంతాలతో ఆర్టీసీకి ప్రతిఏటా రూ. 2 వేల నుంచి రూ.3 వేల కోట్లు సమకూరుతున్నట్లు ఆర్టీసీ నివేదికల్లో పేర్కొంది. కానీ ఇక నుంచి ప్రైవేట్​ ట్రావెల్స్​బస్సులకు పరిమితి ఉండదు. బృందాలుగా కాకుండా ఒక్కో ప్రయాణికుడిని చూపిస్తూ అన్ని ప్రాంతాల్లకు బస్సులను తిప్పనుంది. ఫలితంగా డొక్కు ఆర్టీసీ బస్సులకు ప్రయాణీకులు తగ్గిపోతారు. ఏసీలు, సూపర్​ లగ్జరీ బస్సులను స్టేజీ కారియర్లుగా తిప్పితే ఆర్టీసీ బస్సుల వైపు చూసే వారుండరు. ఫలితంగా ఆర్టీసీకీ ఈ ఆదాయం పోయినట్టే.


Next Story