ఇలాంటి ఆస్పత్రి రాష్ట్రంలో మరెక్కడా లేదేమో..? సీఎం కేసీఆర్ కు ఈ విషయం తెలిస్తే..

by  |
Govt-hospital-1
X

దిశ, గోదావరిఖని: గోదావరిఖని ప్రభుత్వాస్పత్రిలో రోజురోజుకు అవుట్ పేషెంట్ల(ఓపీ) సంఖ్య పెరుగుతూనే ఉంది. గోదావరిఖని రామగుండం పారిశ్రామిక ప్రాంతం నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాలు చెన్నూరు, చెట్టుపెల్లి, పాలకుర్తి, అంతర్గం, మంథని, ముత్తారం తదితర ప్రాంతాల నుంచి నిత్యం ఎంతోమంది పేషెంట్లు గోదావరిఖని ప్రభుత్వాసుపత్రికి వైద్య చికిత్స కోసం వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత కొన్ని నెలలుగా ప్రభుత్వాసుపత్రిలో డెలివరీల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిని మెడికల్ కాలేజీగా మంజూరు చేయడంతో ఇప్పటికే ఉన్నత అధికారులు పూర్తిస్థాయి వైద్య సిబ్బందిని నియమిస్తున్నారు. దీంతో ప్రసవాల సంఖ్య పెరుగుతుంది. నిత్యం ఆస్పత్రిలో గర్భిణీ మహిళలకు గైనకాలజిస్ట్ సేవలు అందుబాటులో ఉండటంతో మరింత మెరుగైన వైద్యసేవలు అందుతుండటంతో ప్రతి నెలా 250కి పైగా డెలివరీలు అవుతుండడంతో ఆసుపత్రి పేషెంట్లతో కిక్కిరిసి పోతుంది.

ఇప్పటికే నూతనంగా చేరిన వైద్యులతో ప్రభుత్వాసుపత్రి కళకళలాడుతుంది. ప్రజలకు అన్ని రకాల వైద్యసేవలను అందించడానికి ఇప్పటికే నూతన వైద్యులను నియమించి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల పర్యవేక్షణతో 24 గంటలు ఆస్పత్రిలో వైద్య సేవలను అందిస్తున్నారు. అలాగే పుట్టిన శిశువులకు అత్యాధునికమైన పరికరాలు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉండడంతో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లకుండా ప్రభుత్వ ఆస్పత్రిలోనే పిల్లలకు వైద్య సేవలను అందిస్తున్నారు. నూతన ఇంక్యుబేటర్లతో పాటు ఫొటో థెరపీ వంటి పరికరాలు ఉండటంతో పిల్లలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. దీంతో డెలివరీ అయిన మహిళలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పిల్లల వైద్యులు సైతం అందుబాటులో ఉంటూ వైద్య సేవలను అందిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక అక్టోబర్ నెలలోనే 306 డెలివరీలు జరగగా ఆర్థోపెడిక్ సర్జరీలు 18, జనరల్ సర్జరీలు 08, Tubectomies సర్జరీలు 86 జరిగాయి. దీంతో రోజురోజుకు పేషెంట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తుండటంతో మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ఉన్నతాధికారులు దృష్టి సారిస్తూ ఇప్పుడు ఉన్న 100 పడకలతోపాటు అదనంగా మరో 85 పడకలకు అనుమతి రావడంతో పనులను పూర్తి చేసేందుకు అధికారులు శరవేగంగా పావులు కదుపుతున్నారు. 85 పడకలను త్వరితగతిన పూర్తి చేస్తే ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందే అవకాశాలు ఉన్నాయి.

వైద్య సిబ్బంది సమిష్టి కృషితోనే సాధ్యం: డాక్టర్ కంది శ్రీనివాస్ రెడ్డి (ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్)

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆస్పత్రిలో వైద్య సిబ్బంది సమిష్టి కృషితోనే నెలకు 300లకు పైగా డెలివరీలు చేయగలుగుతున్నామని గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు తమ వైద్య సిబ్బందితో కలిసి కృషి చేస్తామని, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తిన 24 గంటలు ఆస్పత్రిలో వైద్యులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. అదనంగా మరో 85 పడకలకు అనుమతి రావడంతో పారిశ్రామిక ప్రాంత ప్రజలకు మరింత మెరుగైన వైద్యం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిరంతర వైద్య సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందిని అభినందించారు. ప్రతి ఒక్కరూ సమయపాలన పాటిస్తూ వైద్య సేవలు అందించాలని వైద్యులు సూచించారు.

Superendent1


Next Story

Most Viewed