‘ఆఫర్ల’ రియల్ ఎస్టేట్.. ఉత్త మోసం!

by  |
‘ఆఫర్ల’ రియల్ ఎస్టేట్.. ఉత్త మోసం!
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా, లాక్ డౌన్ తో రియల్ ఎస్టేట్ కొంత నీరసించినా.. ఇప్పుడిప్పుడే మళ్లీ పుంజుకుంటోంది. ఐతే ఇన్నేండ్లుగా కోల్పోయిన ఆదాయాన్ని త్వరగా తిరిగి పొందేందుకు బడా బిల్డర్లు కూడా పక్కదారి పడుతున్నట్లు తెలిసింది. అందుకే ‘ఫ్లాట్ల కొనుగోలుకు ఇది సరైన సమయం.. ఇప్పుడైతే తక్కువ ధరకే సొంతిల్లు వస్తుంది. కరోనా కాలంలో ధరలు తగ్గించారంటూ..’ విస్తృతంగానే ప్రచారం చేస్తున్నారు. అందమైన బ్రోచర్లు కనువిందు చేస్తున్నాయి. బిల్డర్లు కల్పించే సదుపాయాలు చదువుతుంటే గృహం స్వర్గసీమగానే ఊహల్లోకి వెళ్తున్నారు. నగర శివార్లలో ఎప్పుడో ప్రారంభించిన ప్రాజెక్టులు కొన్నయితే, ఇప్పుడిప్పుడే కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. కరోనా నష్టాలను పూడ్చుకునేందుకు బిల్డర్లు ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ప్రీ లాంచ్ సేల్స్.. సాఫ్ట్ లాంచ్ సేల్స్.. యూడీఎస్ స్కీమ్.. ఫిఫ్టీ పర్సెంట్ పేమెంట్.. ఇలా హైదరాబాద్లో పలు రియల్ సంస్థలు అమాయక ప్రజల జేబులకు చిల్లు పెడుతున్నాయి. తక్కువ రేటుకే ఫ్లాట్ అంటూ మోసం చేస్తున్నట్లు సమాచారం. కాకపోతే వంద శాతం సొమ్ము ముందే కడితే ఈ ప్రయోజనం అంటున్నారు. యాభై శాతం సొమ్ము కడితే మరో రేటు అని చెబుతున్నారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ, స్థానిక మున్సిపాలిటీల నుంచి అనుమతులు తీసుకోకుండా.. తెలంగాణ రెరా అథారిటీ ఫైనల్ అప్రూవల్ లేకుండానే ఈ మోసానికి పాల్పడుతున్నట్లు తెలిసింది. మరి, హైదరాబాద్లో మూడు సంవత్సరాల నుంచి ఏయే నిర్మాణ సంస్థలు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నాయో తెలిస్తే ఎవరైనా ముక్కుమీద వేలు వేసుకోవాల్సిందే. రెరా అనుమతి లేకుండానే విక్రయాలను మొదలు పెట్టిన వాటిల్లో బడా బడా సంస్థలే ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎలాగూ ఆయా సంస్థలకు విస్తృత ప్రచారం ఉంది. చాలా పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ అన్న పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. దాంతో వినియోగదారులు కూడా వారి ఆకర్షణీయమైన ప్రకటనలకు మోసపోతున్నట్లు రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు.

మరెక్కడ సమస్య..?

రెరా అథారిటీ వద్ద అనుమతి తీసుకోవాలనే నిబంధనను పలు నిర్మాణ సంస్థలు తుంగలో తొక్కడం ఆరంభించాయి. స్థానిక సంస్థల వద్దకు వెళ్లకుండా, రెరా నుంచి అనుమతి తీసుకోకముందే యూడీఎస్ విధానంలో ఫ్లాట్లు అమ్మడం ఆరంభించాయి. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, చిన్న కంపెనీల కంటే బడా నిర్మాణ సంస్థలే ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నాయి. మార్కెట్ రేటు కంటే తక్కువకు వస్తున్నాయనే ఉద్దేశంతో అధిక శాతం కొనుగోలుదారులు వీటి పట్ల ఆకర్షితులవుతున్నారు. ప్రధానంగా, మార్కెట్లో కాస్తోకూస్తో పేరున్న నిర్మాణ సంస్థల వద్ద వీరు కొంటున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి ప్రధాన కేంద్రంగా కార్యకలాపాల్ని నిర్వహించే పలువురు డెవలపర్లు అక్రమ పద్ధతుల్లో ఫ్లాట్లను విక్రయిస్తున్నారు. గత రెండు, మూడేళ్ల నుంచి ఇలాంటి అక్రమాలు జరుపుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తకుండా వ్యవహరిస్తోంది.

రెరా అనుమతి తప్పనిసరి..

రియల్ సంస్థల మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం రెరా అథారిటీని ఏర్పాటు చేసింది. కేంద్రంలో బీజేపీ వచ్చాక ఇది కార్యరూపం దాల్చింది. తెలంగాణలో కూడా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా మాసబ్ ట్యాంకులోని డీటీసీపీ భవనంలో రెరా అథారిటీ ఏర్పాటైంది. తెలంగాణ రెరా అథారిటీ ప్రకారం 500 గజాలు లేదా ఆపై విస్తీర్ణంలో ఎనిమిది కంటే అధిక సంఖ్యలో ఫ్లాట్లు కట్టేవారు విధిగా రెరా నుంచి అనుమతి తీసుకోవాలి. మంత్రి కేటీఆర్ ఆదేశాల్ని అందుకున్న పలు నిర్మాణ సంస్థలు రెరా అథారిటీ వద్ద తమ ప్రాజెక్టులు నమోదు చేసుకున్నాయి. కానీ ఇంకొందరు ప్రాజెక్టుకు తుది రూపం ఇవ్వకుండానే, అనుమతులు పొందకుండానే అమ్మకాల ప్రక్రియను ఆఫర్ల పేరిట కొనసాగిస్తున్నారు. వీటిలో నగర శివార్లలో ఎత్తయిన భవనాలు నిర్మించిన సంస్థలు కూడా ఉన్నట్లు సమాచారం. ఏదైనా ఆ సంస్థ తమను మోసం చేసిందని చెప్పుకోవడానికి కూడా సాహసించలేరు. ఎక్కడైనా ఫిర్యాదు చేసి నెగ్గడం కూడా కష్టమే. అలాంటి సంస్థల వలలో చిక్కుకుంటే ప్రాజెక్టు పూర్తయ్యే సరికి ఎంత కాలం పడుతుందో కూడా అడిగే అవకాశం లేదు.

కరోనా దెబ్బకు విలవిల..

సగం ధరకే ఫ్లాటు వస్తుందని ఆశ పడే అమాయక కొనుగోలుదారులు పీఎఫ్ సొమ్మును మొత్తం ఊడ్చేసి, తల్లిదండ్రులు, అత్తమామల నుంచి చేబదులు తీసుకుని, మిత్రుల నుంచి అప్పు తీసుకుని మరీ ఈ డెవలపర్ల చేతిలో సొమ్ము పోశారు. ఇలాంటి వారిలో కొందరు కరోనా వల్ల తమ డబ్బు వెనక్కి ఇచ్చేయమని పలు నిర్మాణ సంస్థల మీద ఒత్తిడి తెస్తున్నారు. అదే కరోనా వల్ల దారుణంగా దెబ్బతిన్న కొందరు డెవలపర్లు సొమ్ము ఇవ్వలేకపోతున్నారు. దీంతో చాలామంది కొనుగోలుదారుల్లో ఆందోళన మొదలైంది. తమ సొమ్ముకు భద్రత ఉంటుందా అనే సందేహం మొదలైంది. నిర్మాణ పనులు ఆరంభం కాకపోవడంతో బయ్యర్లు టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికైనా తెలంగాణ రెరా అథారిటీ కళ్లు తెరుచుకుని.. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రాంలో ప్రీ లాంఛ్ సేల్స్ చేస్తే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలకు పాల్పడకుండా ఉండేలా భారీ జరిమానాలు విధించాలని పలువురు డెవలపర్లు కోరుతున్నారు.



Next Story

Most Viewed