దశలవారీగా డిజిటల్ కరెన్సీ అమలు యోచనలో ఆర్‌బీఐ!

by  |
దశలవారీగా డిజిటల్ కరెన్సీ అమలు యోచనలో ఆర్‌బీఐ!
X

దిశ, వెబ్‌డెస్క్ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) తన సొంత డిజిటల్ కరెన్సీని దశలవారీగా అమలు చేసే వ్యూహంపై కసరత్తు చేస్తోందని, త్వరలో హోల్‌సేల్, రిటైల్ విభాగాల్లో దీన్ని ప్రారంభించే పనిలో ఉన్నట్టు ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ టి రబి శంకర్ అన్నారు. దేశీయ డిజిటల్ కరెన్సీని పైలట్ ప్రాజెక్ట్‌గా ఆర్‌బీఐ నిర్వహిస్తుందని, దీనిపై పురోగతి సాధిస్తున్నామని ఆయన తెలిపారు. ఆటంకాలు లేకుండా అమలు చేసేందుకు, భౌతిక కరెన్సీనికి దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత నిబంధనల్లో చట్టపరమైన మార్పులు అవసరమని ఆయన వెల్లడించారు.

గురువారం ‘సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీలు-భవిష్యత్తు కరెన్సీ’ అంశంపై మాట్లాడిన ఆయన.. పూర్తిస్థాయిలో డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టడం ద్వారా బ్యాంకింగ్ రంగం, ద్రవ్య విధానంపై తీవ్ర ప్రభావం ఉంటుందని, ఎక్కువ ప్రభావం లేని విధంగా పైలెట్ ప్రాజెక్ట్ రూపంలో దీన్ని ప్రారంభించాలనే ఆలోచన ఉందని వివరించారు. ఆర్‌బీఐ కొంతకాలంగా డిజిటల్ కరెన్సీకి సంబంధించి లాభ, నష్టాలను అన్వేషిస్తోంది. ఉన్నత స్థాయి ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ విధానం, చట్టపరమైన అంశాలను పరిశీలించి డిజిటల్ కరెన్సీని ప్రారంభించాలని సిఫార్సు చేసినట్టు రబి శంకర్ పేర్కొన్నారు. ఈ పరిణామాలను అధ్యయనం చేసిన తర్వాత డిజిటల్ కరెన్సీని ప్రారంబించవచ్చన్నారు.


Next Story

Most Viewed