ములుగు జిల్లాలో దారుణం.. మహిళపై గ్యాంగ్ రేప్

343

దిశ, మంగపేట : ములుగు జిల్లాలోని ఎస్ఎస్ తాడ్వాయి మండలం అటవీ ప్రాంతంలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మార్చి 30న బైక్‌‌పై వచ్చిన జంటను బెదిరించిన కామాంధులు యువతిని ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ములుగు జిల్లాలోని తాడ్వాయి అటవీ అందాలను వీక్షించేందుకు బైక్‌పై వెళ్లిన ఆ జంటకు జీవితంలో మరిచిపోలేని చేదు అనుభవం ఎదురైంది.

ఎవరూలేని సమయాన్ని ఆసరా చేసుకున్న ఇద్దరు వ్యక్తులు యువకుడిని బెదిరించి ఫోన్ లాక్కోవడమే కాకుండా యువతిని ఎత్తుకెళ్లారు. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడి అనంతరం ఇంటికి సమీపంలో వదిలేసి వెళ్లిపోయారు. బాధితురాలి స్నేహితుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి గుట్టుగా రిమాండ్‌కు తరలించినట్లు తెలిసింది.

వివరాల ప్రకారం.. తాడ్వాయి మండలంలోని పర్యాటక స్థలమైన బ్లాక్‌బెర్రీ ఐలాండ్‌ అటవీ ప్రాంతానికి మార్చి 30న ఓ జంట బైక్‌పై వచ్చారు. వీరిని గమనించిన బుట్టాయిగూడెంకు చెందిన ఇద్దరు యువకులు వారిని అడ్డగించి.. యువకుడిని కొట్టి మొబైల్ లాక్కున్నారు. బైక్‌ టైర్లలో గాలి తీసేశారు. అనంతరం యువతిని బెదిరించి తమ బైక్‌పై బలవంతంగా తీసుకెళ్లారు.

అడివిలో ఓ చోట యువతిని బెదిరించి.. ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడగా మరో యువకుడు సహకరించాడు. యువతికి తీవ్ర రక్తస్రావం కావడంతో భయపడిన నిందితులు ఆమెను స్వగ్రామంలో వదిలేసి వెళ్లిపోయారు. అత్యాచారం చేస్తుండగా వీడియో తీశామని, ఈ విషయం ఎవరికైనా చెబితే దాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తామని యువతిని బెదిరించడంతో భయపడ్డ ఆమె ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. అనంతరం తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమె.. చివరికి తన స్నేహితులకు చెప్పి ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుల వివరాలను సేకరించి శనివారం ఉదయం కాటాపూర్‌ క్రాస్‌ వద్ద వారిద్దరిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..