’యునెస్కో’ ఎఫెక్ట్ : వీకెండ్ టూరిజం స్పాట్‌గా ‘రామప్ప’..

by  |
ramappa-12
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా కుదుటపడటంతో పర్యాటకులతో టూరిస్ట్ స్పాట్లు కలకలలాడుతున్నాయి. హైదరాబాద్‌లో కొవిడ్ ఇంకా పూర్తిస్థాయిలో తగ్గకపోవడంతో పర్యాటకులు సిటీకి దూరంగా కొత్త ప్రదేశాలకు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. ఇటీవలే ప్రపంచ వారసత్వ కట్టడాల్లో చోటు దక్కించుకున్న రామప్ప ఆలయానికి పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. ఈ కట్టడ విశేషాలను చూసేందుకు, వారాంతంలో కుటుంబంతో గడిపేందుకు రామప్పకు క్యూ కడుతున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో రామప్ప కట్టడం ఉండటం మరింత పర్యాటకులను ఆకర్షించే విషయం.

రామప్ప ఆలయానికి ఆదివారం ఒక్క రోజే 15వేల మంది పర్యాటకులు వచ్చారు. ఇలా రామప్పకి ఇంతమంది రావడం చాలా అరుదు. యునెస్కో గుర్తింపుతో అందరి దృష్టి రామప్ప పై పడింది. అంతేకాకుండా ప్రధాని మోదీ కూడా అందరూ వెళ్లి చూడాల్సిన గొప్ప కట్టడంగా అభివర్ణించడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. కొవిడ్ మహమ్మారి పూర్తిగా అంతమవుతే దేశ, విదేశాల నుంచి టూరిస్టులు వస్తారు. ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్ప ఆలయాన్ని గుర్తించి ఇప్పటికే పది రోజులు కావొస్తోంది. పర్యాటకులూ పెరుగుతూనే ఉన్నారు. కానీ టూరిజం శాఖ ద్వారా పర్యాటకులకు కల్పించాల్సిన సదుపాయాలు, హోటల్ ఇండస్ట్రీ తదితర చర్యలు ఇంకా తీసుకోనేలేదు. దీంతో ఒక్కసారిగా పెరిగిన పర్యాటకులతో ప్రస్తుతం అక్కడున్న సదుపాయాలతోనే నెట్టుకొచ్చేస్తున్నారు. ఇదిలా ఉండగా రామప్ప చుట్టూ ఉన్న పచ్చటి పొలాలను ప్లాట్లుగా చేసేందుకు రియల్టర్లు ముందుకొచ్చేస్తున్నారు. అక్కడున్న రైతులకు ఎక్కువ మొత్తంలో డబ్బు ఇచ్చి పొలాలను కొనేందుకు సిద్ధమవుతున్నారు.ఇప్పటికే రియల్ సంస్థలు రామప్ప సమీపంలో ప్లాట్లు ఉన్నాయంటూ నగరవాసులకు ఫోన్లు చేస్తున్నారు.

అధికారులతో సమీక్షించనున్న మంత్రి..

రామప్ప యునెస్కో గుర్తింపు అనంతరం తీసుకోవాల్సిన అంశాలపై మంగళవారం పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో పాటు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా, హెరిటేజ్ తెలంగాణ అధికారులతో రామప్పలో సమీక్షించనున్నారు. టూరిజం శాఖ ద్వారా అభివృద్ధి చేయాల్సిన అంశాలపై, రామప్ప పరిసర ప్రాంతాల్లో చేయనున్న అభివృద్ధిపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.



Next Story

Most Viewed