స్టైలీష్ స్టార్‌తో రాజమౌళి భారీ బడ్డెట్ మూవీ!

by  |
స్టైలీష్ స్టార్‌తో రాజమౌళి భారీ బడ్డెట్ మూవీ!
X

దిశ, వెబ్‌డెస్క్: బాహుబలి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగేలా చేసిన దర్శకధీరుడు రాజమౌళి భారతీయ సినిమా చరిత్రలోనే ఒక సంచలనం. అపజయం ఎరుగని దర్శకుడిగా టాలీవుడ్‌లో కొనసాగుతున్నాడు. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు శిష్యుడిగా స్టూడెంట్ నెం.1 చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన జక్కన్న, ఇప్పటి వరకూ ఒక్క పరాజయం కూడా చవిచూడకపోవడం గమనార్హం. ఆయన తీసిన ప్రతీ సినిమా అద్భుతమైన విజయాలు సాధించడమేగాకుండా అంతకంతకూ అంచనాలను రెట్టింపు చేస్తుంది. కాగా, ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఇకపోతే.. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయినా… తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అద్భుతమైన నటన, డ్యాన్స్, స్టైల్‌తో కేవలం టాలీవుడ్‌లోనే కాకుండా సౌత్ ఇండియాలోనే ప్రత్యేక స్థానం సంపాదించాడు. సినిమా సినిమాకు తన లుక్‌ను కొత్తగా కనిపించడం బన్నీ ప్రత్యేకత. ఎప్పుడూ ఒకేలా స్క్రీన్‌పై కనిపించడం ఆయనకి ఇష్టం ఉండదు. పాత్ర కోసం ఎలాంటి లుక్‌లో కనిపించడానికైనా వెనుకాడడు. అంతేగాకుండా బన్నీ సైతం సినిమా సినిమాతో తన స్థాయిని పెంచుకుంటూ.. సౌత్ ఇండస్ట్రీ టాప్‌ హీరోల్లో ఒకరిగా ఎదిగాడు. ఆయన సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంత ఎదురుచూస్తారో మళయాలం, తమిళం, కన్నడ ప్రేక్షకులు కూడా అంతే ఆసక్తిగా ఎదరుచూస్తారు. కాగా, ప్రస్తుతం బన్నీ, సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమాలో చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే… ప్రస్తుతం ఫిలింనగర్‌లో ఓ ఆసక్తికర వార్త హల్‌చల్ చేస్తోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత జక్కన్న అల్లు అర్జున్‌తో ఓ భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కిస్తున్నట్టు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే భారత చలనచిత్ర రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి, సౌత్ ఇండస్ట్రీలో అద్భుతంగా దూసుకుపోతున్న అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఓ మూవీ పట్టాలెక్కబోతోందని వినికిడి. ఆర్ఆర్ఆర్ తర్వాత మహేశ్ బాబుతో ఓ సినిమా ఉంటుందని జక్కన్న ప్రకటించిన విషయం తెలిసిందే. దానికి సంబంధించి ఇంకా ఎలాంటి ప్రకటన లేదు. అటు మహేశ్ బాబు నుంచి కానీ, ఇటు రాజమౌళి నుంచి గానీ ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఈ సినిమా ఆగిపోయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో జక్కన్న బన్నీని లైన్‌లోకి తీసుకున్నాడని, బన్నీతో ఓ భారీ చిత్రం ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ సినిమాను బాహుబలిని మించి పోతోందని టాలీవుడ్‌లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా, రాజమౌళి ఆర్ఆర్ఆర్, బన్నీ పుష్ప తర్వాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్టు తెలుస్తోంది. దీంతో అల్లు అర్జున్ అభిమానులే కాకుండా, తెలుగు ప్రేక్షలందరూ ఈ సినిమా అప్‌డేట్‌ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇదే నిజం అయితే బన్నీ అభిమానులకు ఇక పండగే.



Next Story

Most Viewed