ఆ జిల్లాలో రైతుబంధు కట్.. కంటతడి పెట్టిస్తున్న ‘ధరణి’..

by  |
farmers
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రజా, సామాజిక అవసరాలకు భూములు సేకరించగా.. ఎంతో పెద్ద మనసుతో త్యాగం చేసిన రైతులకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. సేకరించిన భూములకు గాను రైతుల పట్టాదారు పాసుపుస్తకాలను ధరణి నుంచి తొలగించినా.. తాజాగా సేకరించని భూములకు కూడా రైతుబంధు సాయం నిలిపేశారు. భూసేకరణలో కొద్దిగా భూమి పోయినా.. పూర్తి సర్వే నెంబరుకు పెట్టుబడి సాయం ఆపేయటంతో అన్నదాతకు అవస్థలు తప్పటం లేదు. భూములిచ్చి త్యాగాలు చేస్తే.. సాంకేతిక సమస్యల పేరుతో సాయం అందించకుండా సతాయిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

లోకేశ్వరం మండలం పంచగుడిలో నిర్మల్-నిజామాబాద్ జిల్లా మధ్య గోదావరిపై వంతెన నిర్మాణం చేశారు. వంతెన నుంచి డబుల్ రోడ్డు నిర్మాణం చేస్తున్నారు. ఇందుకోసం సుమారు 100 మంది రైతుల నుంచి భూసేకరణ చేశారు. ఒక్కో రైతు గుంట నుంచి రెండు గుంట భూమి ఇవ్వగా.. సేకరించిన భూమి కాకుండా మిగతా భూమికి రైతుబంధు సాయం అందింది. తాజాగా ఈ ఏడాది వానాకాలంలో 100 మంది రైతుల సర్వే నెంబరులోని పూర్తి భూములకు రైతుబంధు సాయం రాలేదు. మండలంలో సుమారు 120 రైతుల నుంచి సేకరించిన భూముల పరిస్థితి ఇలాగే ఉంది. ఇక తానూరు, ముధోల్, భైంసా, కుంటాల, నర్సాపూర్(జి), దిలావర్పూర్, సారంగాపూర్ మండలాల్లో కాళేశ్వరం ప్యాకేజీ 27, 28 పనులకు భూములు సేకరించగా.. ఇక్కడ కూడా అలాంటి పరిస్థితే ఉంది. మామడ మండలంలో నిర్మిస్తున్న సదర్మాట్ బ్యారేజీలో పోగా.. మిగతా భూములకు కూడా రైతుబంధు సాయం అందలేదు. ఒక్క నిర్మల్ జిల్లాలోనే సుమారు 780 మంది రైతులకు రైతుబంధు సాయం ఆపేశారు.

వివిధ ప్రాజెక్టులు, చెరువులు, రోడ్లు, రహదారులు, కాలువల నిర్మాణం లాంటి ప్రజా, సామాజిక అవసరాల కోసం ప్రభుత్వం రైతుల నుంచి భూములను సేకరిస్తుంటుంది. ఇందుకు నిర్ధారించిన ప్రకారం పరిహారం చెల్లిస్తుంటారు. ఏయే సర్వే నెంబరు నుంచి భూములను సేకరిస్తారో.. ఆ సర్వే నెంబరు నుంచి సేకరించిన భూమి తొలగిస్తారు. అటు ఆన్లైన్ (ధరణి)తో రైతు పట్టాదారు పాసు పుస్తకం నుంచి కూడా తీసేస్తారు. సదరు సర్వే నెంబరులో భూసేకరణ తర్వాత మిగిలిన భూముల వివరాలు మాత్రమే ఉంటాయి. ఈ భూములకు మాత్రమే బ్యాంకు పంట రుణాలు, మార్టగేజ్, ఇతర రుణాలు, రైతుబంధు సాయం అందుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ.5 వేల చొప్పున రెండు సీజన్లలో కలిపి రూ.10వేల చొప్పున రైతుబంధు సాయం అందిస్తోంది. భూసేకరణలో పోగా మిగతా భూములకు ఇప్పటి రైతుబంధు సాయం ఇస్తున్నారు. ధరణి అందుబాటులోకి వచ్చాక కొత్త చిక్కులు మొదలయ్యాయి.

గత ఏడాది ధరణి అందుబాటులోకి తీసుకురాగా.. సాఫ్ట్‌వేర్ సమస్య రావటంతో రైతులకు కొత్త ఇబ్బందులు మొదలయ్యాయి. రైతుబంధు సాయం కోసం రెవెన్యూ శాఖ నుంచి ఎన్ఐసీకి జాబితా పంపుతారు. అందులో సాగునీటి ప్రాజెక్టులు, కాలువలు, రహదారుల నిర్మాణం కోసం సేకరించిన భూముల సర్వే నెంబర్లలోని భూములకు పూర్తిగా రైతుబంధు సాయం నిలిపేశారు. భూసేకరణ తర్వాత మిగిలి ఉన్న భూములకు ఇప్పటివరకు రైతుబంధు సాయం అందగా.. తాజాగా ఈ ఏడాది వానాకాలంలో మాత్రం రైతుబంధు సాయం రాలేదు. ఇప్పటి ఈ వివరాలను తహసీల్దార్లు జిల్లా కలెక్టరుకు పంపించారు. భూములు సేకరించాక.. మిగిలిన భూములు బ్యాలెన్సు ఉన్నాయని నివేదిక పంపారు. వీటికి డిజిటల్ సైన్ లేకపోవటంతో పెండింగ్ చూపుతోంది. త్వరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని అధికారులు చెబుతుండగా.. ఈ సారి రైతుబంధు సాయం కోల్పోయినట్టేననే ఆందోళన రైతుల్లో నెలకొంది. ఈ జాబితా ప్రకారం ప్రత్యేకంగా రైతుబంధు సాయం అందించాలని వారు కోరుతున్నారు.


Next Story

Most Viewed