వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీసిన సినిమానే రైతన్న : R. నారాయణమూర్తి

by  |
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీసిన సినిమానే రైతన్న : R. నారాయణమూర్తి
X

దిశ, కోదాడ : రైతు మనుగడ కోసం, ఉనికి కోసం తీసిన సినిమానే రైతన్న సినిమా అని ఆ చిత్ర నటుడు ఆర్. నారాయణ మూర్తి అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రైతన్న చిత్రాన్ని విజయవంతం చేసేందుకు సహకారం అందించాలని ఆయన ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ, విద్యుత్ చట్టాలు కార్పొరేట్ రంగానికి రెడ్ కార్పెట్ వేసే విధంగా ఉన్నాయన్నారు. ఈ చట్టాల అమలుకు భారతదేశం వంటి దేశంలో రైతు కూలీగా మారే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే దేశం, ఒకే మార్కెట్, ఒకే వ్యవసాయం అమెరికా వంటి దేశాల్లో సాధ్యమవుతుంది తప్ప.. పేద రైతులున్న భారతదేశంలో సాధ్యం కాదన్నారు. చిన్న, సన్నకారు రైతులు ఎక్కడికో వెళ్లి పంటను ఎలా అమ్ముకుంటాడు అని ప్రశ్నించారు. గత ఎనిమిది నెలలుగా రైతులు చలి, ఎండ, వానను లెక్క చేయకుండా చేస్తున్న ఉద్యమాన్ని చూసి చలించిపోయి ఈ చిత్రాన్ని తీశానని అన్నారు.

2006లో బీహార్లో ఈ చట్టాన్ని అమలు చేయడం వల్ల అక్కడ రైతులు కూలీలుగా మారారు అని తెలిపారు. ఈ చట్టాలతో దేశాన్ని కార్ఖానాగా తయారు చేస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతుకు గిట్టుబాటు ధర కోసం 2006 లో జరిగిన ఉద్యమంలో మూడు లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారని.. అప్పుడు యూపీఏ ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ వేసింది.. కానీ, ఆ ప్రభుత్వం సిఫార్సులను అమలు చేయలేదని అన్నారు.

2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వం స్వామినాథన్ సిఫార్సులను అమలు చేస్తానని హామీ ఇచ్చి అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సినిమాలో ఈ ఉద్యమాలను చూపించినట్టు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ చట్టాలను రద్దు చేయాలని కోరినట్లు తెలిపారు. సినిమా క్లైమాక్స్‌లో ఆర్టికల్ 246 ప్రకారం సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి నల్ల చట్టాలను రద్దు చేసి రైతుకు గిట్టుబాటు ధర ఇచ్చి వ్యవసాయం దండగ కాదు పండుగ అని చిత్రీకరించినట్లు తెలిపారు.

అనంతరం ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ.. రైతన్న సినిమా విజయవంతం కావాలని, కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలు కార్పొరేట్ శక్తులు అదానీ, అంబానీలకు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. రైతులను కూలీలుగా మార్చే ఈ చట్టాలను రద్దు చేయాలని నటుడు నారాయణమూర్తి తీసిన సినిమాను అందరూ ఆదరించాలని కోరారు.

నారాయణమూర్తి ప్రజాచైతన్యం కోసం, పెట్టుబడి, భూస్వామ్య వ్యవస్థల రద్దు కోసం తీసిన విప్లవాత్మక సినిమాలు విజయవంతమై ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాయని అన్నారు. చట్టాల రద్దుకు, రైతుకు లాభం కలిగించేందుకు ఈ సినిమా ఎంతో దోహదపడుతుందన్నారు. వారి వెంట యాతాకుల మధు బాబు, కూచిపూడి సర్పంచ్ శెట్టి సురేష్ నాయుడు, మామిడి రామారావు, పందిరి నాగిరెడ్డి, ఈదుల కృష్ణయ్య, ఎండి ఖాజా మొయినుద్దీన్, ముస్తఫా తదితరులు ఉన్నారు.


Next Story