వంగరలో ‘పీవీ విజ్ఞాన వేదిక’

by  |
వంగరలో ‘పీవీ విజ్ఞాన వేదిక’
X

దిశ, తెలంగాణ బ్యూరో : దివంగత ప్రధాని పీవీ నర్సింహారావు శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆయన స్వగ్రామమైన వంగరలో ‘పీవీ విజ్ఞాన వేదిక’ను నిర్మించాలనుకుంటోంది. దీనితో పాటు ఆయన నివాసాన్ని మ్యూజియంగా తీర్చిదిద్దాలనుకుంటోంది. ఇందుకోసం రూ.11 కోట్ల మేరకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. పీవీ విజ్ఞాన వేదిక డిజైన్‌ను మంత్రి శ్రీనివాసగౌడ్ హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో సోమవారం ఆవిష్కరించారు. దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం జ్ఞాపకాలను సజీవంగా ఉంచేలా ‘స్మృతివనం’ను నిర్మించినట్టుగానే పీవీకి సైతం చరిత్రలో నిల్చిపోయే తరహాలో విజ్ఞాన వేదిక ఉంటుందన్నారు.

8 ఎకరాల విస్తీర్ణంలో ఈ విజ్ఞాన వేదిక రూపొందుతున్నట్టు మంత్రి తెలిపారు. మొదటి దశలో రూ.7 కోట్లతో పీవీ విగ్రహానికి ఫౌంటైన్, లైటింగ్, విజయగాధల చిత్రాలు, ఫొటో గ్యాలరీ, మెడిటేషన్ సెంటర్, సైన్స్ మ్యూజియం, ఇమేజ్ గార్డెన్, చిల్డ్రన్ ఆట స్థలాలు, స్వాతంత్ర సమరయోధుల శిల్పాలు, యాంఫి థియేటర్, ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయనున్నామని, ఇందుకు రూ.6.86 కోట్లను ఇప్పటికే కేటాయించామన్నారు. పీవీ నివాసం ఉన్న ఇంటిని ‘స్మారక మ్యూజియం’గా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఆయన వాడిన వస్తువులన్నింటినీ ఈ మ్యూజియంలో భద్రపర్చనున్నట్టు తెలిపారు. పీవీ విగ్రహం, ల్యాండ్‌స్కేపింగ్‌తో సిట్టింగ్ బెంచీలు, మంచీనీటి వసతి, పాత్ వేలను రూ. 75 లక్షలతో అభివృద్ధి చేస్తున్నట్టు వెల్లడించారు.


Next Story

Most Viewed