ఫ్లోర్ టెస్టులో ఫెయిల్.. నారాయణ సామి సంచలన కామెంట్స్

80

చెన్నై: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయింది. అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోలేకపోయింది. సీఎం నారాయణసామి ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానానికి మెజార్టీ సభ్యుల ఓట్లు లభించలేదు. తీర్మానం వీగిపోయిన తర్వాత తన ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించి నారాయణసామి ఏకరువు పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ శాయశక్తులా ప్రయత్నించిందని ఆరోపించారు. అనంతరం, కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసిన బీజేపీ ఎమ్మెల్యేల ఓటు హక్కు గురించి సభలో గందరగోళం చెలరేగింది. ఈ వాగ్వాదాలు జరుగుతుండగానే కాంగ్రెస్, డీఎంకే నేతలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అక్కడి నుంచి నారాయణసామి నేరుగా రాజ్‌నివాస్ వెళ్లి లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి సీఎం, మంత్రివర్గం రాజీనామాలను అందజేశారు. బలపరీక్షలో నెగ్గకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం మెజార్టీ కోల్పోయినట్టు అసెంబ్లీ స్పీకర్ శివకొఝుండు ప్రకటించారు.

వారంతా అవకాశవాదులు: నారాయణసామి

ఫ్లోర్ టెస్టు అనంతరం నారాయణసామి మాట్లాడుతూ… ‘డీఎంకే, ఇతర స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో మేం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. మేం మూడు ఎన్నికల్లో పోటీ చేసి, గెలిచాం. ప్రజలు మాపై నమ్మకాన్ని ఉంచారు. పుదుచ్చేరి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమిది. ప్రతిపక్షాలు ఎన్నికల్లో తమను ఎదుర్కోలేకపోయాయి. అందుకే కుయుక్తులకు పాల్పడ్డాయి. ఇప్పుడిలా ప్రభుత్వాన్నే కూల్చడానికి ఎత్తులు వేసింది. కొందరు అధికార కూటమి ఎమ్మెల్యేలు అవకాశవాదంతో రాజీనామా చేశారు. వారు ప్రజలతో నేరుగా కలిసే నైతిక విలువను కోల్పోయారు’ అని అన్నారు. ‘తమ ప్రభుత్వం పుదుచ్చేరివాసుల కోసం ఎన్నో సంక్షేమపథకాలు తెచ్చింది. మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ, కేంద్ర ప్రభుత్వం ఎన్నిసార్లు ఆటంకాలు కల్పించినా ప్రజల సంక్షేమాన్ని విస్మరించలేదు. సరిపడా నిధులు పంపించకుండా కేంద్ర ప్రభుత్వం పుదుచ్చేరి యోగక్షేమాలను మరిచింది’ అని విమర్శించారు. అసెంబ్లీ కాంప్లెక్స్‌ను వీడుతూ బీజేపీపై ఘాటు విమర్శలు చేశారు. ‘బీజేపీ శృతిమించి ప్రవర్తిస్తున్నది. పుదుచ్చేరిలో ఆ పార్టీ రాజకీయ వ్యభిచారం చేసింది’ అని వ్యాఖ్యానించారు. తమ రాజీనామాలను సమర్పించిన తర్వాత మాట్లాడుతూ, పుదుచ్చేరి ప్రజలు వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష శిబిరానికి తప్పకుండా గుణపాఠాన్ని నేర్పుతారని అన్నారు.

అధికార, విపక్షాల బలాలు

జనవరి నెల నుంచి అధికార కూటమిలో ఎమ్మెల్యేల రాజీనామాల పర్వం మొదలైంది. ఆరుగురు ఎమ్మెల్యేలు అధికార కూటమి పార్టీలకు రాజీనామాలు చేశారు. ఆరుగురు ఎమ్మెల్యేల రాజీనామా తర్వాత కాంగ్రెస్-డీఎంకే కూటమి బలం 12(స్పీకర్ సహా)కు పడిపోయింది. కాగా, ప్రతిపక్ష కూటమి బలం 14గా ఉన్నది. పుదుచ్చేరి అసెంబ్లీలో మొత్తం స్థానాలు 33. ఇందులో మూడు సీట్లు నామినేటెడ్. కాంగ్రెస్, డీఎంకే ఎమ్మెల్యేల రాజీనామాతో అసెంబ్లీ బలం 26కు పడిపోయింది.

‘నామినేటెడ్ ఎమ్మెల్యే’ల వివాదం

బలపరీక్షలో నామినేటెడ్ ఎమ్మెల్యేలకు ఓటు హక్కు ఉండదని అధికారపక్షం అసెంబ్లీలో వాదనలు చేసింది. ఒకవేళ నామినేటెడ్ ఎమ్మెల్యేలకు హక్కు ఉండకుంటే ప్రతిపక్షాల బలమూ 11కు చేరేది. కేంద్ర ప్రభుత్వం ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. అలాగైతే, ఇరువైపులా సమాన బలాలున్నప్పుడు స్పీకర్ విచక్షణతో ఓటేసే వీలు ఏర్పడి ప్రభుత్వం విశ్వాసాన్ని నిలుపుకునేదని కాంగ్రెస్ అనుయాయుల వాదన. కానీ, కాంగ్రెస్ వాదనను తప్పుబడుతూ పలువిశ్లేషణలు వచ్చాయి. ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను కేంద్రం నామినేట్ చేసినప్పుడు పుదుచ్చేరి ప్రభుత్వాన్ని సంప్రదించలేదని సర్కారు 2018లో మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఇందులో చట్ట అతిక్రమణలు మద్రాస్ హైకోర్టుకు కనిపించలేదు. వ్యవహారం సుప్రీంకోర్టుకు వెళ్లింది. 1963లో వచ్చిన కేంద్రపాలిత ప్రాంతాల చట్టం ప్రకారం, ఎమ్మెల్యేల నామినేషన్ కోసం యూటీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాల్సిన అవసరంలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో పాటు మరో కీలక రూలింగ్ ఇచ్చింది. అదే చట్టం ప్రకారం, నామినేట్, ఎన్నికైన ఎమ్మెల్యేలకు మధ్య తేడాలేమీ ఉండవని, బడ్జెట్, విశ్వాస పరీక్ష, బలపరీక్ష సహా అన్నింటిలోనూ ఎన్నికైన ఎమ్మెల్యేలతో సరిసమానంగా నామినేటెడ్ ఎమ్మెల్యేలకూ హక్కులుంటాయని తీర్పునిచ్చింది. ఈ రూలింగ్ ప్రకారం, కాంగ్రెస్ ప్రస్తుత వాదనలు చెల్లవు.

ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు: ఎన్ రంగస్వామి

సీఎం నారాయణసామి రాజీనామాపై మాజీ సీఎం, ఏఎన్ఆర్-కాంగ్రెస్ నేత ఎన్ రంగస్వామి స్పందించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలం కావటం వల్లే నారాయణసామి సీఎం పదవికి రాజీనామా చేశారని ఆరోపించారు. ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు ప్రారంభిస్తామని అన్నారు. తమ మిత్రపక్ష నేతలతో చర్చలు జరుపుతామని తెలిపారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..