మధ్యాహ్న భోజనం... చారిత్రాత్మక నిర్ణయం

by velandi.Saikiran |   (  Updated:2026-03-25 00:22:56  IST  )

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్నం భోజనం పెట్టాలని తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనది.

మధ్యాహ్న భోజనం... చారిత్రాత్మక నిర్ణయం
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్నం భోజనం పెట్టాలని తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేయబోతున్నామని గత శుక్రవారం అసెంబ్లీలో బడ్జెట్ సమావేశం సందర్బంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించడం చారిత్రాత్మకమైన నిర్ణయమే కాదు.. ఎంతో హర్షించదగినది కూడా.

అలాగే నర్సరీ నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు నూతనంగా బ్రేక్ ఫాస్ట్ పథకం కూడా అమలు చేస్తామని, ఈ పథకంలో ప్రతి విద్యార్థికి వారంలో మూడు రోజులు పాలు, మూడు రోజులు రాగిజావ అందిస్తామని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడ ఒక సరికొత్త అధ్యాయానికి నాంది. ముఖ్యంగా ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు అందరు కౌమారదశకు చెందినవారు. ఈ దశ అనేది ఎంతో కీలకమైన దశ. ఈ వయసులో వారికి అందించే పోషకాహారమే వారి నేర్చుకునే సామర్థ్యాన్ని, దీర్ఘకాలిక ఆయుష్షుని నిర్ణయిస్తుంది.

అమ్మాయిలకు వరమీపథకం

ప్రభుత్వం తీసుకున్న మధ్యాహ్నం భోజనం, బ్రేక్ ఫాస్ట్ అమలు నిర్ణయం వలన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే దాదాపు రెండు లక్షల మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు నేరుగా లబ్ధి చేకూరనుంది. అంతేకాకుండా దీన్ని 436 ప్రభుత్వ జూనియర్ కళాశాలల బలోపేతానికి దోహదపడే ముఖ్యమైన చర్యగా చెప్పవచ్చును. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఎక్కువ సంఖ్య మండల కేంద్రాలలో ఉంటాయి. వీటిలో మారుమూల గ్రామీణ ప్రాంతాలకు, పేద, బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు విద్యను అభ్యసిస్తారు. వీరిలో ఎక్కువగా అమ్మాయిలు ఉంటారు. వీరందరు యుక్త వయస్సుకు చెందినవారు ఉంటారు. వీరు తమ గ్రామాల నుండి పొద్దున ఆర్టీసీ మరియు ప్రైవేటు వాహనాలలో కళాశాలలకు వస్తుపోతుంటారు.

చదువును చంపేసే ఆకలి

వీరి తల్లిదండ్రులు ఎక్కువగా వ్యవసాయ పనులు, కూలీ పనులు వెళ్లడం వలన కళాశాల సమయానికి ఇంట్లో వంట చేయడం కుదరదు. అందువలన వీరు సరిగా తినరు. అదేవిధంగా వీరు కళాశాలకు క్యారియర్ తెచ్చుకోరు. చాలా మంది విద్యార్థులు కాలికడుపుతో, క్యారియర్ లేకుండానే కళాశాలకు వస్తారు. వీరు లంచ్ మానేస్తారు. కొందరు విద్యార్థులు కళాశాల లంచ్ సమయంలో బయట ప్రదేశంలో దొరికే ఆహార పదార్దాలు తిని రోగాల పాలైవుతున్నారు. ఎక్కువ మంది విద్యార్థులు మధ్యాహ్నం తర్వాత జరిగే తరగతులకు నీళ్లు మాత్రమే తాగి హాజరు అవుతారు. వీరిలో అమ్మాయిలు, అబ్బాయిలు అని తేడా లేకుండా కళ్ళు తిరిగి పడిపోయే వారి సంఖ్య అధికం. వీరు ఉదయం నుండి సాయంత్రం వరకు అర్థాకాలితో ఉండటం వలన అధ్యాపకులు చెప్పే పాఠాలను సరిగ్గా అర్ధం చేసుకోలేక, ఒత్తిడితో అనారోగ్యానికి గురవుతారు. ఆకలి సమస్య వలన చదువు మీద సరిగా దృష్టి పెట్టలేక, చదువులో వెనుకబడి, మానసిక ఒత్తిడిలోనై చదువు మధ్యలో ఆపివేస్తున్నారు. దీనితో గ్రామీణ పేద బడుగు, బలహీన విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ప్రభుత్వ కళాశాలల బలోపేతం

ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించాలనే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది. వాటిలో ముఖ్యమైనవి. ప్రభుత్వ కళాశాలల బలోపేతం. ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయం, బ్రేక్ ఫాస్ట్ సరిగా అమలు చేసినట్లయితే డ్రాపవుట్స్ సంఖ్య తగ్గి, కళాశాలలకు హాజరు అయ్యే విద్యార్థుల సంఖ్య పెరిగి, ఉత్తీర్ణత శాతం అధికంగా రావడం వలన ప్రభుత్వ కళాశాలలపై తల్లిదండ్రులకు, విద్యార్థులకు నమ్మకం పెరుగుతుంది. దీనితో ప్రభుత్వ కళాశాలలో విద్యార్థుల ప్రవేశాల సంఖ్య పెరిగి, వాటి బలోపేతానికి దోహదపడుతుంది.

శారీరక, మానసిక అభివృద్ధి

ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్యను చదివే విద్యార్థులు యుక్తవయసులో ఉంటారు. వీరికి మధ్యాహ్న భోజనం, బ్రేక్ ఫాస్ట్ ద్వారా పౌష్టికాహారం అందించినట్లయితే వారి శారీరక, మానసిక అభివృద్ధికి దోహదపడుతుంది. అభ్యసన నైపుణ్యాలు మెరుగుదల. ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం, బ్రేక్ ఫాస్ట్ సదుపాయం వలన విద్యార్థుల అర్ధాకలి సమస్య తీరి, చదువులపై ఏకాగ్రత పెరిగి, వారిలో అభ్యసన నైపుణ్యాలు మెరుగుపడే అవకాశం ఉంది.

సామాజిక సమభావం

ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం, బ్రేక్ ఫాస్ట్ చేసే సమయంలో విద్యార్థులు ప్లేట్లు, చేతులు కడుక్కోవడం వలన వ్యక్తిగత పరిశుభ్రత, వరుసలో నిలబడడం వలన క్రమశిక్షణ, కలిసి తినడం వలన వారిలో తారతమ్యాలు తగ్గి, తామంతా ఒకటే అనే సామాజిక సమభావం పెంపొందుతుంది. ఇది యువతలో ఐక్యత భావంకు దారితీస్తుంది. దీనితో ప్రజాస్వామ్యం విద్య లక్ష్యం నెరవేరుతుంది.

కొన్ని దశాబ్దాలుగా పేద, వెనుకబడిన వర్గాల పిల్లలు తిండి సమస్యను ఎదుర్కోలేక స్కూళ్లకు, కాలేజీలకు దూరమవుతూ వచ్చారు. బాల్య కౌమారాల్లో పనులు చేయక తప్పని దుస్థితిలో కూరుకుపోయారు. వీరి నిరంతర సమస్యకు పరిష్కారం మధ్యాహ్న భోజన పథకం. ఇకపై కొన్ని తరాల పిల్లలు ఈ పథకం ద్వారా శారీరక, మానసిక దారుఢ్యాన్ని సంతరించుకుని ప్రగతి పథంలో పయనిస్తారనడంలో సందేహం లేదు.

అభినందనల వర్షంలో ప్రభుత్వం

ప్రభుత్వం విద్యార్థుల శారీరక, మానసిక అభివృద్ధికి, దీర్ఘకాలిక ఆయుష్షు కోసం మధ్యాహ్నం భోజనం, బ్రేక్ ఫాస్ట్ అమలు చేయడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేధావులు అభినందిస్తున్నారు. అలాగే విద్యార్థులకు నైతిక విలువలతో కూడిన విద్యను అందించడం కోసం నర్సరీ నుండి ఇంటర్మీడియట్ వరకు చరిత్ర పాఠ్యంశం తప్పనిసరిగా అమలు చేయాలని విద్యావేత్తలు, మేధావులు ఆకాంక్షిస్తున్నారు.

డా. పోతరవేణి తిరుపతి

రాష్ట్ర అధ్యక్షులు,

చరిత్ర పరిరక్షణ సమితి,

99631 17456

Next Story