- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సముద్రతీరంలో సాంకేతిక అద్భుతం..
కృత్రిమ మేధస్సు (ఏఐ) ప్రపంచాన్ని చాలా వేగంగా మారుస్తోంది. మనిషిలా ఆలోచించి నేర్చుకోవడమే కాదు.. మనిషిలానే తర్కించడం, సామర్థ్యం పెంచుకోవడం వంటి ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది.

కృత్రిమ మేధస్సు (ఏఐ) ప్రపంచాన్ని చాలా వేగంగా మారుస్తోంది. మనిషిలా ఆలోచించి నేర్చుకోవడమే కాదు.. మనిషిలానే తర్కించడం, సామర్థ్యం పెంచుకోవడం వంటి ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది. అలుపు, విరామం అన్నది లేకుండా పనిచేసే ఈ సాంకేతిక పరిజ్ఞానం మనిషి సృష్టించిన మరో అద్భుతం. ఈ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేయడంలో, వినియోగంలో భారతదేశం కూడా దూసుకెళుతోంది.
ప్రస్తుతం కృత్రిమ మేధస్సు వినియోగం అన్ని రంగాల్లోనూ తప్పనిసరి అవసరంగా మారిపోయింది. ఇప్పటికే దేశంలోని కీలక రంగాల్లో దాదాపు 48 శాతం పని కృత్రిమ మేధతోనే నిర్వహిస్తున్నారు. ఇది 55 శాతానికి పెరుగుతుందని అంచనా. చాలా రంగాలు 75 శాతం పైగా కార్యకలాపాలు ఏఐ సాయంతోనే నిర్వహిస్తున్నారని సమాచార సాంకేతిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కృత్రిమ మేధస్సు వినియోగంలో ప్రస్తుతం భారతదేశం అభివృద్ధి చెందుతున్న దశలో ఉంది. అనేక రంగాలు ఇప్పుడిప్పుడే ఏఐ సామర్థ్యాన్ని వినియోగించుకునే మార్గాలను అన్వేషించడం ప్రారంభించాయి.
విశాఖకు ప్రపంచ స్థాయి గుర్తింపు..
రోబోటిక్స్, మెషిన్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ ఫ్లాట్‌ఫారాలు రోజురోజుకూ వేగంగా అభి వృద్ధి చెందుతున్నాయి. పెరుగుతున్న వినియోగం.. అవగాహన ఓ పక్క ఆరోగ్య సంరక్షణ, విద్య, బ్యాంకింగ్, వ్యవసాయంతో సహా అనేక పరిశ్రమలలో ఏఐ ఉపయోగిస్తుంటే ప్రపంచం నేడు నాలుగో పారిశ్రామిక విప్లవ దశలో ప్రవేశించింది. ఈ దశకు వెన్నుదన్నుగా నిలవడంలో కృత్రిమ మేధస్సు కీలక పాత్ర పోషిస్తోంది. విశాఖ ఈ సాంకేతిక విజ్ఞాన వికాసానికి వేదికై కృత్రిమ మేధస్సుకు పట్టం కట్టే విశాఖపట్నం ఇప్పుడు ప్రపంచ యవనికపై ఓ ప్రముఖ పాత్ర పోషించనుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం, ఈ సాంకేతిక విప్ల వానికి ప్రధాన కేంద్రంగా ఎదగబోతోంది. గూగుల్ సంస్థ ఇక్కడ భారీ పెట్టుబడితో కృత్రిమ మేధస్సు కేంద్రాన్ని నిర్మించబోతుంది.
అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి..
ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 10 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడితో దేశంలో ఇప్పటి వరకు వచ్చిన అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ప్రాజెక్ట్‌గా నిలబడనుంది. దీని ఫలితంగా రాష్ట్రానికి భారీ ఆర్థిక లాభాలు, సుమారు 1.88 లక్షల ఉద్యోగావకాశాలు కలుగనున్నాయి. విశాఖపట్నం కేవలం ఒక తీరప్రాంత నగరం మాత్రమే కాకుండా, గూగుల్ గ్లోబల్ నెట్‌వర్క్‌తో అనుసంధానమైన అంత ర్జాతీయ కృత్రిమ మేధస్సు, సాంకేతిక పరిజ్ఞానం కేంద్రంగా ఎదగబోతోంది. సముద్రగర్భ సబ్‌సీ కేబుల్స్ ద్వారా సింగపూర్, మలేసియా, ఆస్ట్రేలియా వంటి దేశాలతో ఈ కేంద్రం నేరుగా సముద్ర గర్భం నుంచి అనుసంధానించ బడుతుంది. ఇది అంతర్జాతీయ డిజిటల్ మార్కెట్లో స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది.
నైపుణ్య వికాసానికి వేదిక..
ఈ కృత్రిమ మేధస్సు కేంద్రం ద్వారా విశాఖ, సమీప ప్రాంత యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నేర్చుకునే, కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే విస్తృత అవకాశాలు లభిస్తాయి. కృత్రిమ మేధస్సు, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో నైపుణ్యాలు సాధించడం ద్వారా యువత ప్రపంచవ్యాప్తంగా సాంకే తిక రంగంలో పోటీ పడగలుగుతుంది. ప్రాంతీయ విద్యాసంస్థలతో భాగస్వామ్యం చేసి, వర్క్‌షాప్‌లు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఈ కేంద్రం నైపుణ్య అభివృద్ధికి దోహదపడుతుంది. చిన్న మధ్య తరహా ఐటీ సంస్థలు అదనంగా, స్థానిక అంకుర సంస్థలు కూడా కృత్రిమ మేధస్సు సేవలను ఉపయోగించి తమ వ్యాపారాలను విస్తరించుకోవచ్చు.
ఏపీ భవిష్యత్తు మార్గం..
కృత్రిమ మేధస్సు కేంద్రం ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాంకేతిక పరిజ్ఞాన రంగంలో ముందంజ వేసి, దేశ ఆర్థికాభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తుంది. విశాఖపట్నం క్షేత్రంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణలో సృష్టించే ఉద్యోగాలు, నైపుణ్యాల అభివృద్ధి రాష్ట్ర యువతకు సుదీర్ఘ ప్రయోజనాలు కలిగిస్తాయి. సముద్ర తీర నగరం కావడంతో విశాఖ ప్రత్యేకతను సంతరించుకుంది. కేంద్ర రాష్ట్ర విధానాల వల్ల ఇప్పటికే ప్రముఖ దిగ్గజ సంస్థలు విశాఖను పెట్టుబడుల గమ్యస్థానంగా ఎంచుకున్నారు. పర్యావరణహిత ఆధారంగా రూపొం దిన ఈ కేంద్రం పర్యావరణ పరిరక్షణకు కూడా ముఖ్య భాగస్వామ్యం అవుతుంది. దేశం అంతటా డిజిటల్ వృద్ధిని ప్రేరేపించడంతోపాటు, విశాఖను ప్రపంచ కృత్రిమ మేధస్సు మ్యాప్‌లో కీలక కేంద్రంగా నిలబెట్టడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. మొత్తం మీద, విశాఖలో ఏర్పడనున్న ఈ కృత్రిమ మేధస్సు కేంద్రం రాష్ట్ర యువతకు నైపుణ్య వికాసానికి వేదికగా నిలవడం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్తును కొత్త తీరాలకు తీసుకెళ్తుంది.
- వాడవల్లి శ్రీధర్
99898 55445






