సీఎం కేసీఆర్‌కు కోదండరాం హెచ్చరిక.. మరో ఉద్యమానికి సిద్ధమంటూ..!

by  |
సీఎం కేసీఆర్‌కు కోదండరాం హెచ్చరిక.. మరో ఉద్యమానికి సిద్ధమంటూ..!
X

దిశ, కామారెడ్డి : రైతులకు నష్టం చేకూర్చే చర్యలను సీఎం కేసీఆర్ మానుకోవాలని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. రైతు రక్షణ యాత్రలో భాగంగా శనివారం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో ఆయన పర్యటించారు. మండలంలోని భవానీపేట్, మంథని దేవునిపల్లి గ్రామాల్లో ప్రభుత్వం వరి కొనుగోలు ప్రక్రియలో జాప్యం కారణంగా వర్షాలకు ధాన్యం తడిసిపోయి నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రవాణా సమస్య తీవ్రంగా ఉందని, ఒక రోజు 4 లారీలు రావాల్సి ఉండగా 2 కూడా రావడం లేదని, దాంతో కొనుగోళ్లలో జాప్యం జరుగుతుందని బాధిత రైతులు ఫ్రొఫెసర్ కోదండరాం దృష్టికి తీసుకువచ్చారు. జాప్యం కారణంగా అకాల వర్షానికి ధాన్యం తడిసి మొలకెత్తడం, నల్లబడటం జరుగుతుందని తెలిపారు.

అధికారుల పర్యవేక్షణ కొరవడిందని చెప్పడంతో భవానీ పేట కొనుగోలు కేంద్రం నుంచి మాచారెడ్డి తహసీల్దార్‌కు ఫోన్ చేసి మాట్లాడి, తక్షణమే రైతుల సమస్యలు పరిష్కరించాలని, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ఈ సందర్బంగా కోదండరాం మాట్లాడుతూ.. యాసంగి పంట విషయంలో ఢిల్లీకి వెళ్లి వచ్చిన కేసీఆర్ ఇప్పటికీ ఎలాంటి ప్రకటన చేయకపోవడం చాలా బాధాకరమన్నారు. యాసంగిలో వరి పంటనే వేస్తామని రైతులు చెబుతున్నారని, ప్రభుత్వం తక్షణమే పంట విషయంలో స్పష్టత ఇవ్వాలన్నారు. రైతులకు నష్టం జరిగినట్టయితే తమ పార్టీ తరఫున ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో టీజేఎస్ జిల్లా కన్వీనర్ కుంబాల లక్ష్మణ్ యాదవ్, ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జీ రమేష్, సంగారెడ్డి జిల్లా కన్వీనర్ తుల్జారెడ్డి, వినోద్, స్వామి, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed