సమస్యల వలయంలో కమలం

79

దిశ, హైదరాబాద్: రాష్ట్రంలో అధికారంలో ఉన్న గులాబీ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని కమలం పార్టీ వేసిన ఎత్తుగడలన్నీ చిత్తవతున్నాయి. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో తీసుకువచ్చిన సిటిజన్ అమెండ్‌‌‌మెంట్ యాక్ట్(సీఏఏ)కు వ్యతిరేకంగా యావత్ ప్రజానీకం చేస్తున్న నిరసనలు రాష్ట్రంలో బీజేపీకి మింగడపడడంలేదు. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వలేదన్న విమర్శలను తిప్పికొట్టే సమయంలో ఆ పార్టీ అగ్రనాయకులు చేసిన వ్యాఖ్యలు కమలం పార్టీని ‘‘కుడితిలో పడ్డ ఎలుకల’’ మరింత ఇరకాటంలో పడేశాయి. అగ్రనాయకుల వ్యాఖ్యలు ‘‘చిగురించే మొగ్గను తుంచినట్లు’’ ఉన్నాయని కమలం నాయకులు లోలోపల మథనపడుతున్నారు..
కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లేయకుంటే తెలంగాణను తీస్కపోయి మళ్లీ ఆంధ్రాల కలుపుతం అన్న వివాదాస్పద వ్యాఖ్యలు కాంగ్రెస్‌ నేతలే సరి అనుకున్న సమయంలో… పువ్వు గుర్తు పార్టీ తాము తక్కువేమీకాదంటూనే.. వారు కూడా వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు విసురుతున్నారు. ఇందుకు తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి చేసిన ‘ఎర్రబస్సు’ వ్యాఖ్యలే నిదర్శనం. తెలంగాణ ప్రజలన్నా.. ఇక్కడి ప్రజల మనోభావాలన్నా.. గౌరవంలేని ఢిల్లీ పార్టీలకు ఇదో ఆనవాయితీగా మారిందన్న వాదనాలు రాజకీయ విశ్లేషకులు నుంచి గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇటీవల ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ రాష్ర్టానికి వచ్చినప్పుడు ఎంపీలు అర్వింద్‌, బాపూరావుతోపాటు కొత్తగా బీజేపీలో చేరిన కొందరు నేతలు ఆరెస్సెస్‌ యూనిఫాంలో హల్‌చల్‌ చేయడం వివాదాస్పదంగా మారింది. దీంతో ఆ పార్టీలో విభేదాలు సైతం తలెత్తిన పరిస్థితి. తాజాగా కేంద్ర బడ్జెట్‌, రైల్వేకు కేటాయింపులు వంటి అంశాల్లో రాష్ర్టాన్ని బద్నాం చేసేందుకు ప్రయత్నించిన బీజేపీ బొక్కాబోర్లాపడిన పరిస్థితి నెలకొంది. ఈ వరుస పరిణామాలు కమలనాథుల్లో కలకలం రేపుతున్నాయి. తెలంగాణ సమాజానికి వివరణ ఇచ్చుకోలేని స్థితిలోకి బీజేపీ నాయకులు నెట్టబడ్డారు. ఇలాంటి పరిణామాలు ఆ పార్టీని కలవరానికి గురిచేస్తున్నాయి. అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయం అంటూ ప్రకటనలు చేసే నేతలేనా ఇలాంటి వ్యాఖ్యలు చేసేది? అంటూ సొంతగూటిలో మంటలు రేగుతున్నాయి.

డైలమాలో బీజేపీ నాయకులు

బీజేపీ నేతలంతా ఇప్పుడు డైలమాలో పడ్డారు. ప్రభుత్వాన్ని విమర్శించేందుకు కాచుకొని కూర్చున్న నేతలే తప్పటడుగులు వేస్తుంటే పార్టీని గట్టేక్కించే పరిస్థితి ఉందా! అన్న అనుమానాలు కమలం నేతలను ఆలోచింపచేస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ పార్లమెంట్‌ మినహా వరుస ఎన్నికల్లో ‘చావు తప్పి కన్నులొట్టబోయినట్టు’ ఎంతో కొంత ఓట్లు రాబట్టుకున్నప్పటికీ ఎక్కడా కనీసం పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని కార్యకర్తలు భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో అగ్రనాయకుల వ్యాఖ్యలు పార్టీని మరింత ఇరకాటంలో పడేసినట్టుందని నాయకులు మథనపడుతున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..