‘ఆరెంజ్’​ జోన్​లో ఆర్టీసీ

by  |
‘ఆరెంజ్’​ జోన్​లో ఆర్టీసీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల విషయంలో అంతా అనుకున్నట్టే జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ కోసం రాచమార్గాలు తెరిచారు. ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు మూడింతలుగా రవాణా చార్జీలు పెంచారు. రవాణా అంశాలపై రెండు రాష్ట్రాలు చేతులెత్తేశాయి. అధిక ధరలను కట్టడి చేయాల్సిన అధికారులు కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రస్తుతం ఈ దసరాకు కూడా తెలంగాణ ఆర్టీసీ ఆదాయాన్ని కోల్పోనున్నది. దాదాపు పది రోజుల పాటు రూ. 6 నుంచి రూ. 8 కోట్ల ఆదాయాన్ని ఈ ఏడాది కూడా ఆర్టీసీకి రాకుండా పోయింది. అంతర్రాష్ట్ర సర్వీసులపై ప్రభుత్వ వైఖరిపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.

ముందుకు సాగని ప్రతిపాదనలు

తెలంగాణ ప్రభుత్వం అంతరాష్ట్ర సర్వీసులపై పట్టు మీదుంది. తెలంగాణ ఎన్ని బస్సులు తిప్పితే.. ఏపీ కూడా అన్నే బస్సులు తిప్పాలని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. తెలంగాణ, ఏపీ మధ్య 4 లక్షల కిలోమీటర్ల మేర సర్వీసులు నడుస్తుండగా, తెలంగాణ భూభాగంలో ఏపీ బస్సులు 2.64లక్షల కిలోమీటర్లు, ఏపీలో తెలంగాణ బస్సులు 1.61 లక్షల కిలోమీటర్లు మాత్రమే తిరుగుతున్నాయి. దీంతో ఏపీ కిలోమీటర్లు తగ్గించుకోవాలని సూచించింది.తెలంగాణలో లక్ష కిలోమీటర్లు ఎక్కువగా తిప్పుతున్నందున అందులో 50 వేల కిలోమీటర్లు తగ్గించుకుంటామని, తెలంగాణ 50వేల కిలోమీటర్లు పెంచుకోవాలని ఏపీ ప్రతిపాదించింది. దీనికి తెలంగాణ సర్కారు ఒప్పుకోలేదు. దీనిపై నాలుగుసార్లు చర్చలు జరిగినా సఫలం కాలేదు.

ప్రైవేట్ కోసమేనా..?

రెండు రాష్ట్రాలు కిలోమీటర్లను తగ్గించుకుంటే చివరకు ప్రైవేట్‌కే అప్పగించనున్నట్లు స్పష్టమవుతోంది. ఏపీ బస్సులను తగ్గిస్తే లక్ష కిలోమీటర్ల పరిధిలో దాదాపు 350 బస్సులు తగ్గిపోతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ఆర్టీసీ అన్ని బస్సులు పెంచే పరిస్థితులు లేవని ఇప్పటికే మంత్రి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ చేతికి అప్పగించేందుకు మార్గం దొరుకునున్నది. చివరకు లక్ష కిలోమీటర్లు మొత్తం ప్రైవేట్‌కు వెళ్లనున్నాయి.

ఎడాపెడా చార్జీల పెంపు..

దసరా సందర్భంగా అంతర్రాష్ట్ర సర్వీసుల విషయంలో ప్రైవేటు ఆపరేటర్లు ఇష్ట మొచ్చినట్టుగా చార్జీలు వసూలు చేస్తున్నారు. ఒక్కో టికెట్‌‌పై 350 నుంచి రూ. 700 వరకూ అదనంగా తీసుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు నాన్‌‌ ఏసీ అయితే రూ. 350 ఉంటే ఇప్పుడు రూ.650పైనే తీసుకుంటున్నారు. జనరల్‌‌ ఏసీకి రూ. 420, సెమీ స్లీపర్‌‌ అయితే రూ. 550 వరకు తీసుకునేవారు. ఇప్పుడు రూ. 900కుపైగా చార్జీ చేస్తున్నారు. వైజాగ్‌కు కూడా ఇలాగే అదనంగా తీసుకుంటున్నారు. వైజాగ్‌కు సాధారణంగా రూ. 1500 వరకు ఉండగా… ఇప్పుడు రూ. 2500కుపైగా తీసుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి రూ. 3 వేలకుపైగా చార్జీలు వేస్తున్నారు. ప్రైవేటు ట్రావెల్స్‌పై పెద్దగా నియంత్రణ ఉండకపోవడం, పండుగల సమయంలో అడ్డగోలుగా వసూళ్లు చేస్తుంటే ఎవరూ పట్టించుకోవడం లేదు.

ప్రైవేట్ కోసమే ఈ రాద్ధాంతం : అశ్వత్థామరెడ్డి

ఇప్పటికే ఆర్టీసీ నష్టాల్లో ఉంది. ఇప్పుడు అంతర్రాష్ట్ర సర్వీసులను నిలిపివేయడంతో ఆదాయం రాకుండా పోతున్నది. ప్రైవేట్‌కు అప్పగించేందుకే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు సాగనీయడం లేదు. హైదరాబాద్ నుంచి విజయవాడ, రాజమండ్రి, నెల్లూరు, విశాఖపట్నం, అనంతపురం, తిరుపతి ప్రాంతాలకు బస్సులు నడిపేందుకు ఏడాదిన్నర కిందటే మేఘా కంపెనీ ముందుకు వచ్చింది. ఇప్పుడు ఈ చర్చలు విఫలమైతే వెంటనే ప్రైవేట్ సంస్థలు లక్ష కిలోమీటర్లలో బస్సులు నడుపుతారు.


Next Story

Most Viewed