కరోనా ఆందోళనకరంగా మారింది.. జాగ్రత్త పడండి: మోడీ

39

న్యూఢిల్లీ : దేశంలో కరోనా పరిస్థితి నానాటికీ ఆందోళనకరంగా మారుతున్నదని ప్రధాని మోడీ అన్నారు. కొవిడ్‌పై ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగిపోగా.. ప్రభుత్వాలు అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నాయని ఆయన అసహనం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ స్వైర విహారం చేస్తుండటంతో ప్రధాని గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కొవిడ్ సెకండ్ వేవ్ తొలి దశ కంటే ఆందోళనకరంగా పరిణమిస్తున్నదని దానిని అలక్ష్యం చేయకూడదని అన్నారు. దేశం కఠినమైన సవాల్‌ను ఎదుర్కొంటున్నదని, ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అది పెను ప్రమాదానికి దారి తీసే అవకాశం లేకపోలేదని హెచ్చరించారు. దేశంలో నానాటికీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నా.. టెస్టుల సంఖ్యనూ విస్తృతంగా పెంచాలని మోడీ నొక్కి చెప్పారు. ఒక వ్యక్తికి కరోనా సోకితే కనీసం 30 మందినైనా పరీక్షించాలని తెలిపారు. గతంలో తాను చెప్పిన విధంగా పంచముఖ వ్యూహాన్ని అమలు చేసి కరోనాను కట్టడి చేయాలని అన్నారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్, కొవిడ్ నిబంధనలపై అవగాహన, వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడం వంటివి పాటించాలని స్పష్టం చేశారు.

కరోనాపై మరోసారి యుద్ధప్రాతిపదికన పోరాడాల్సిన అవసరం ఉన్నదని పునరుద్ఘాటించారు. గతంలో కంటే ఇప్పుడు మనకు (దేశానికి) వ్యాక్సిన్, వనరులు, అనుభవం వంటివి పుష్కలంగా ఉన్నాయని వివరించారు. కొవిడ్ పరీక్షలపై ప్రత్యేక దృష్టిసారించాలని, 70 శాతం ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు లక్ష్యంగా పెట్టుకోవాలని ముఖ్యమంత్రులకు పిలుపునిచ్చారు. శాంపిల్స్ సేకరణను తప్పనిసరిగా చేపట్టాలని సూచించారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, పంజాబ్ వంటి రాష్ట్రాలలో వైరస్ తొలి దశ కంటే ఎక్కువ స్థాయిలో విజృంభిస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. యాక్టివ్ కేసులను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని, గతేడాది పది లక్షలున్న క్రియాశీలక కేసులను లక్షకు తీసుకొచ్చామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వ్యాక్సినేషన్ పై దృష్టి సారించి టెస్టులను పట్టించుకోకపోవడం వల్లే దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడానికి కారణమైందని మోడీ అన్నారు.

లాక్‌డౌన్ అవసరం లేదు : కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్ విధించనున్నారని వస్తున్న వార్తలపై మోడీ స్పందించారు. దేశంలో మరో లాక్‌డౌన్ విధించే ఉద్దేశమేమీ లేదని అన్నారు. వాటి కంటే రాత్రి పూట కర్ఫ్యూలు, ఆంక్షలను పెంచడం వంటివి చేపట్టాలని అన్నారు. అన్నింటికంటే ముఖ్యంగా మైక్రో కంటైన్‌మెంట్ జోన్ల ఏర్పాటుపై దృష్టి సారించాలని సీఎంలకు సూచించారు. నైట్ కర్ఫ్యూలను ప్రపంచం ఆమోదించిందని.. దానిని ‘కరోనా కర్ఫ్యూ’గా విధించాలని తెలిపారు. దాని వల్ల నష్టం కూడా పెద్దగా ఉండబోదని మోడీ వివరించారు.

టీకా రాజకీయాలకు చురక : కరోనా వ్యాక్సిన్ల కొరతపై మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాలు చేస్తున్న ఆరోపణలపై మోడీ పరోక్షంగా ప్రస్తావించారు. ‘కొంతమంది కొవిడ్-19 పరిస్థితి, వ్యాక్సినేషన్ మీద రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయాలు చేసే వారు చేసుకోనివ్వండి. నేను వాటిపై కామెంట్ చేయను. కానీ అందరు ముఖ్యమంత్రులు, మన ప్రభుత్వాలు కలిసి ఈ మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడదాం..’ అంటూ చురకలంటించారు.

ఏప్రిల్ 11 నుంచి 14 వరకు ఉత్సవ్ టీకా : దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని బావిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు మరో కీలక అడుగు వేసింది. ఈ నెల 11 నుంచి 14 దాకా టీకా ఉత్సవ్‌ను చేపట్టాలని సూచించింది. ఈ మేరకు ప్రధాని మాట్లాడుతూ.. ఈ మూడు రోజులు 45 ఏళ్లు దాటిన వారిలో వీలైనంత ఎక్కువ మందికి టీకాలు వేయాలని సూచించారు. ఆ మేరకు అందరికీ అవగాహన కల్పించాలని మోడీ తెలిపారు.

దీదీ డుమ్మా : గత కొద్దికాలంగా ఎదురెదురుగా ఉన్నా ఎడమొహం పెడమొహంగా ఉంటున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమె ప్రచారంలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సీఎం తరఫున ఈ కార్యక్రమానికి బెంగాల్ చీఫ్ సెక్రెటరీ ఎ.బందోపాధ్యాయ పాల్గొన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..