పూజారులు తొక్కితే.. పిల్లలు పుడతారా?

by  |
పూజారులు తొక్కితే.. పిల్లలు పుడతారా?
X

దిశ, వెబ్‌డెస్క్: మారుమూల పల్లె జనాలు కూడా టెక్నాలజీని ఉపయోగించుకుంటున్న రోజులివి. అక్షరాస్యతను సాధిస్తూ, అభివృద్ధి పథంలో ముందుకు పోతున్న కాలమిది. అయినా ఇప్పటికీ కొందరు ‘మూఢ నమ్మకాల’ను విశ్వసిస్తూనే ఉన్నారు. పూజారులతో తొక్కించుకుంటే పిల్లలు పుడతారనే నమ్మకంతో ఇటీవలే చత్తీస్‌గఢ్, ధంతారీ జిల్లాలోని అంగార్‌మోతి మాతా దేవాలయానికి మహిళలు పోటెత్తారు. ‘మాధై మేళా’ పేరుతో ప్రతి ఏట జరిగే జాతరకు కరోనాను కూడా లెక్కచేయకుండా భక్తులు తరలిరావడం గమనార్హం. దీంతో నెటిజన్లు ఈ మూఢనమ్మకాలపై ఫైర్ అవుతున్నారు.

దీపావళి తరువాత వచ్చే మొదటి శుక్రవారం రోజున చత్తీస్‌గ‌ఢ్ ప్రజలతో పాటు అక్కడి చుట్టుపక్కల గిరిజనులు అంగార్‌మోతి ఆలయానికి వచ్చి, అక్కడ జరిగే ‘మాధై మేళా’లో పెద్ద ఎత్తున పాల్గొంటారు. పెళ్లయ్యి పిల్లలు పుట్టని మహిళలు ఇక్కడికి ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. వీరు ఆలయం ముందు బోర్లా పడుకుంటే, ఆలయ పూజారులు తమ కాళ్లతో వారిని తొక్కుకుంటూ వెళతారు. ఇలా చేస్తే వారికి పిల్లలు పుడతారని అక్కడి భక్తుల నమ్మకం. 500 సంవత్సరాలుగా ఈ మూఢనమ్మకాన్ని వాళ్లు బలంగా విశ్వసిస్తున్నారు. ఈ ఏడాది సుమారు 200 మంది మహిళలు నేల మీద పడుకోగా పూజారులు మంత్రాలు జపిస్తూ, బ్యానర్లు పట్టుకుంటూ వారి మీద నుంచి నడుచుకుంటూ వెళ్లారు.

‘మాధైమేళాకు వచ్చిన ఎంతోమంది మహిళలు గర్భం దాల్చారు. ఇదో మిరాకిల్ ఫెస్టివల్’ అని అంగార్‌మోతి సెక్రెటరీ ఆర్‌ఎన్ ధృవ్ తెలిపాడు. ‘ఇలాంటి ఆచారాలను నేను ఆమోదించను. ఈ చర్యలు సమాజానికి హానికరం. దేవుణ్ని ప్రార్థించడం వారి వారి నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. అది వ్యక్తిగతం. కానీ ఇలాంటి మూఢనమ్మకాలు అన్ సైంటిఫిక్. మానవత్వం లేని చర్యలు. చాలామంది మహిళలకు ఈ చర్య వల్ల గాయాలయ్యాయి. ఇలాంటివి చూస్తే, మనుషులు ఇంకా మధ్యయుగంలోనే ఉన్నారనపిస్తోంది. డిస్ట్రిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా దీన్ని ఆపలేకపోయింది. పాండమిక్ టైమ్‌లోనూ ఇలాంటివి కండక్ట్ చేయడం కరెక్ట్ కాదు’ అని డాక్టర్ దినేష్ మిశ్రా చెప్పారు.

కాగా ‘పూజారులు తొక్కితే పిల్లలు పుట్టడమేంటి? ఇది ఏ డాక్టర్ బుక్‌లో ఉంది, ఇప్పటికీ ప్రజలు ఇలాంటి మూఢనమ్మకాలను నమ్ముతున్నారా? ఇదంతా అన్ హ్యుమానిటీ’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. భక్తులు నమ్మినంత కాలం మూఢ నమ్మకాలకు అంతు ఉండదు. బాబాలు కూడా భక్తుల నమ్మకాలతోనే పుట్టుకొస్తారు. ఒక్కసారి మనసుతో కాకుండా మెదడు పెట్టి ఆలోచిస్తే, అంతా అర్థమవుతుంది. పూజారులు తొక్కితే పిల్లలు పుడతారనడం అన్ సైంటిఫిక్. అందుకే ఈ విషయమనే కాదు ఏ విషయాన్ని కూడా గుడ్డిగా నమ్మకుండా, అందులో శాస్త్రీయత ఉందో లేదో చూడాలి. తెలియకపోతే, చదువుకున్న వాళ్లని అడిగి తెలుసుకోవాలి.


Next Story