ఫలించిన మంత్రాంగం.. మనసుల్లో మలినాలు తొలగించి..

by  |
KMM-Meeting1
X

దిశ, భద్రాచలం: కేడర్ పదవుల కోసం పంతాలకు పోకుండా పట్టువీడి పార్టీ కోసం కలసికట్టుగా పనిచేద్దామని చర్ల మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు సోయం రాజారావు, కార్యదర్శి నక్కినబోయిన శ్రీనివాసయాదవ్ నిర్ణయించుకున్నారు. చర్ల మండలంలో ఉప్పునిప్పుగా పనిచేస్తున్న ఆ ఇద్దరు ప్రధాన నాయకులతో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్లం వెంకట్రావులు ప్రత్యేకంగా చర్చించారు. కార్యకర్తలకు పదవుల పంపిణీ విషయంలో ఇద్దరి నడుమ అభిప్రాయ బేధాలు ఉంటే ఇద్దరు ఒకటికి రెండుసార్లు కూర్చొని చర్చించుకుంటే ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం దొరుకుతుందని వారు మండల నాయకత్వానికి హితబోధ చేసినట్లు సమాచారం. వ్యక్తుల కంటే పార్టీ ప్రయోజనం ముఖ్యమని నాయకులు గ్రహించాలని, తమ స్వార్థం కోసం పార్టీకి నష్టం చేయాలనుకునే వారు ఎంతటివారైనా పార్టీ క్షమించబోదని తెలిపారు. అలాంటి వారిని పక్కనబెట్టాలని, సాధ్యమైనంతవరకు వాళ్లకు దూరంగా ఉంటే మంచిదని, అప్పుడే వారిలో మార్పు వస్తుందని వారు చెప్పినట్లుగా సమాచారం.

పార్టీ విజయగర్జన సభకి జనసమీకరణ నిమిత్తం చర్లలో ఏర్పాటు చేసిన సన్నాహక సభకి పార్టీ శ్రేణులు హాజరుకాకుండా ఆపి మీటింగ్ విఫలయత్నం చేయడానికి ప్రయత్నించినవారిపై బాలసాని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పంతం నెగ్గించుకోవడానికి పార్టీకి కీడు చేస్తున్నవారిపై పార్టీ నిఘావర్గాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాయని, అదృశ్యశక్తుల ఆట కట్టిస్తాయని, గొడవలు సృష్టించి వ్యక్తిగతంగా లాభపడాలని డ్రామాలు చేసేవారి రోజులు పోయాయని బాలసాని ఘాటుగా చెప్పినట్లు సమాచారం. పార్టీ శ్రేణులు గొడవలు చేసుకోవొద్దని హితబోధ చేసినట్లుగా తెలిసింది.

వ్యతిరేక వార్తలు వచ్చినప్పుడు లోపాలు ఉంటే సరిచేసుకొని మీడియాకి వివరణ ఇస్తే సరిపోతుందని, మీడియాపై సోషల్ మీడియా వేదికగా ఎదురుదాడి కూడా పార్టీకి మంచిదికాదని నాయకులకు చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. ఇద్దరు నాయకులు కలిసి పనిచేసి చర్ల మండలంలో టీఆర్ఎస్‌ని అగ్రస్థానంలో నిలపాలని సూచించినట్లు తెలిసింది. ఆ మేరకు అధ్యక్ష, కార్యదర్శుల మనసుల్లో మలినాలు తొలగించి ఒకేమాట, ఒకేబాటగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో మూతపడిన చర్ల టీఆర్ఎస్ ఆఫీస్ త్వరలో తెరుచుకుంటుందని, కార్యకర్తల పదవుల విషయంలో రాజీకుదిరి పార్టీకి మంచిరోజులు వస్తాయని గులాబీ శ్రేణులు భావిస్తున్నారు. బాలసాని భరోసాతో మండల పార్టీకి మంచిరోజులు వస్తాయని కేడర్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.


Next Story

Most Viewed