‘మా’కు మూకుమ్మడి రాజీనామా.. మోహన్ బాబు రౌడీయిజంపై ఘాటు విమర్శలు

by  |
‘మా’కు మూకుమ్మడి రాజీనామా..  మోహన్ బాబు రౌడీయిజంపై ఘాటు విమర్శలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో గెలిచిన ప్రకాశ్‌రాజ్ టీమ్ సభ్యులంతా రాజీనామా చేశారు. కొత్తగా ఎన్నికైన టీమ్ స్వేచ్ఛగా పనిచేయాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. సంస్థ నిర్వహణలో తప్పులు, పొరపాట్లు జరిగినప్పుడు ప్రశ్నించకుండా ఉండలేమని, ప్రశ్నించినప్పుడు తమనే తప్పుపట్టి ఎదురుదాడికి పాల్పడే అవకాశం ఉందని, సంస్థ పురోగతి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఓటు వేయించారని, పోస్టల్ బ్యాలెట్లలో అవకతవకలు జరిగాయని, రాత్రికి రాత్రే ఓట్ల లెక్కింపు ఫలితాలు మారిపోయాయని ప్రకాశ్‌రాజ్ ఆరోపించారు. రాజీనామాలను ఆమోదించాలని కొత్త టీమ్‌ను కోరారు.

‘మా’ ఎన్నికల్లో రౌడీయిజం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనల మేరకు ఎన్నికలు జరగలేదన్నారు. క్రాస్ ఓటింగ్ జరిగిందని, రాత్రికి రాత్రే ఫలితాలను మార్చారని ఆరోపించారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుల్లోనూ అన్యాయం జరిగిందన్నారు. బెనర్జీపై మోహన్ బాబు చేయిచేసుకునే పరిస్థితి, పరుష పదజాలంతో అందరిముందు తిట్టడం, బెదిరించడం, మాజీ అధ్యక్షుడు నరేష్ ప్రవర్తన తదితరాలన్నింటిన్ని విశ్లేషించుకున్న తర్వాతానే ‘మా’లో కొనసాగలేమనే నిర్ణయానికి వచ్చామని, అందుకే మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. కొత్త అధ్యక్షుడు విష్ణుకు అడ్డుకాకుడదనే ఉద్దేశంతోనే మొత్తం 11 మంది ప్యానల్ సభ్యులు రాజీనామా చేయాలనే నిర్ణయం తీసుకున్నామని, వీటిని ఆమోదించాలని కోరారు.

షరతుకు ఒప్పుకుంటే పునరాలోచిస్తా: ప్రకాశ్ రాజ్

‘‘నేను ‘మా’ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశా. మంచు విష్ణు స్వీకరించనని అన్నారు. నేను నా రాజీనామాను వెనక్కి తీసుకుంటా. కానీ, ఒక షరతు. అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ‘మా’ నియమ, నిబంధనలు మార్చి, ‘తెలుగువాడు కాని వ్యక్తి మా ఎన్నికల్లో పోటీ చేయకూడదు’ అని మార్చకపోతే నేను సభ్యత్వానికి చేసిన రాజీనామాను వెనక్కి తీసుకుంటా. ఒకవేళ మారిస్తే, ఓటు వేయడానికో, గెలిపించడానికో సంస్థలో కొనసాగడం నాకు ఇష్టం లేదు’’ అని ప్రకాశ్‌రాజ్‌ స్పష్టం చేశారు.

‘మా’లో సభ్యులందరిది మొదటి నుంచి ఒకే ప్యానల్ అని, విష్ణు ప్యానల్‌తో కలిసి పనిచేయలేమని, ప్రశ్నించే మనోభావం ఉన్న మాకు గొడవలతో ‘మా’ సంక్షేమం ఆగిపోవద్దనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకాశ్‌ రాజ్ సహా ప్యానెల్ విజేతలు స్పష్టం చేశారు. రెండేళ్లపాటు విష్ణు మంచిగా పనిచేయాలని, ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చాలని ఆకాంక్షించారు. హామీలు అమలు చేయకపోతే ఓటర్ల తరపున ప్రశ్నిస్తామన్నారు. రాజీనామాలను ఆమోదించి అనుకూలమైనవారిని నియమించుకుని స్వేచ్ఛగా పనిచేయాలని సూచించారు. తమ ప్యానెల్‌లో గెలిచినవారంతా బయటకు వచ్చి, ‘మా’ సభ్యుల తరపున నిలబడతామని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో శ్రీకాంత్, బెనర్జీ, జీవితరాజశేఖర్, ఉత్తేజ్, తనీష్, శివారెడ్డి, అనసూయ, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

కలిసి పనిచేయలేం: శ్రీకాంత్‌

ఎన్నికల ప్రచారంలో రెండు ప్యానెళ్లు విమర్శలు చేసుకున్నాయని, ఇప్పుడు వాటిని మర్చిపోయి కలిసి పనిచేయడం సాధ్యం కాదని ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ తరఫున ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా గెలిచిన శ్రీకాంత్ వ్యాఖ్యానించారు. గతంలో ఇలాగే కలిసి పనిచేసినప్పుడు విభేదాలు తలెత్తాయని, సమస్యను ఎత్తి చూపితే పనిచేయనీయడం లేదనే ఎదురుదాడి మొదలవుతుందని అన్నారు. నరేశ్‌ ఎన్నికలను తన అనుభవంతో కృష్ణుడిలా చక్రం తిప్పి విష్ణుకు విజయం చేకూర్చేలా వ్యవహరించారని, ఆయన విష్ణు వెనుక ఉన్నప్పుడు మళ్లీ సమస్యలు మొదలవుతాయన్నారు. తప్పు జరిగితే ప్రశ్నించే ధైర్యవంతులమని, ప్రశ్నించగానే మళ్లీ గొడవలు మొదలవుతాయని, పదవులు లేకున్నా అందరికి అండగా ఉంటామన్నారు.

ఎన్నిక సందర్భంగా మోహన్‌బాబు తనను బూతులు తిట్టారని బెనర్జీ కన్నీటి పర్యంతమయ్యారు. కొట్టేందుకు వచ్చారని, మోహన్‌బాబుకు పెళ్లి కాకముందు నుంచి కుటుంబ సభ్యుడిగా, సన్నిహితంగా మెలిగానని గుర్తుచేశారు. విష్ణును, మంచు లక్ష్మిని తన చేతులతో ఆడించానని, మోహన్‌బాబు కొట్టే ప్రయత్నం చేస్తే అడ్డుకునే ప్రయత్నం చేశారని గుర్తుచేశారు. తాను ఎంతగానో ప్రేమించే తన తల్లిని దూషించడం తట్టుకోలేకపోయాయనని, ఇంత జరిగిన తర్వాత అసోసియేషన్‌లో ఉండలేనని బెనర్జీ వ్యాఖ్యానించారు. తనీష్, ఉత్తేజ్, ప్రభాకర్ తదితరులంతా విష్ణు ప్యానెల్‌తో కలిసి పనిచేయలేమనే నిస్సహాయతను వ్యక్తం చేశారు.


Next Story

Most Viewed