అమరజీవి పొట్టి శ్రీరాములుకు అరుదైన గౌరవం

80
postal Stamp

దిశ, ఏపీ బ్యూరో: దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమరజీవి పొట్టి శ్రీరాములు పేరుతో పోస్టల్ స్టాంపును తపాలా శాఖ ఆవిష్కరించింది. నెల్లూరు జిల్లా సంతపేటలోని పొట్టి శ్రీరాములు అవార్డు గ్రహీత కేవీ చలమయ్య నివాసంలో పోస్టల్ స్టాంపును ఆవిష్కరించినట్లు పోస్టల్ సూపరింటెండెంట్ కరుణాకర్ బాబు వెల్లడించారు.

ఈ సందర్భంగా కరుణాకర్ బాబు మాట్లాడుతూ ఆజాద్ కా అమృత్ మహోత్సవంలో భాగంగా భారతీయ తపాలా శాఖ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుల సేవలకు గుర్తుగా ” మై స్టాంపు” పేరుతో వారి బంధువుల, మిత్రుల సమక్షంలో స్టాంపులను ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా విజయవాడ రీజియన్ పరిధిలో మచిలీపట్నంలో స్వాతంత్ర్య సమర యోధుడు పింగళి వెంకయ్య పేరుతో, నెల్లూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు పేరుతో స్టాంపులను ఆవిష్కరించినట్లు స్పష్టం చేశారు. నెల్లూరులో పొట్టి శ్రీరాములుతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కేవీ చలమయ్య సమక్షంలో ఈ స్టాంపును ఆవిష్కరించామన్నారు.

Postal stamp33

అనంతరం కేవీ చలమయ్య మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన పేరుతో తపాలా శాఖ స్టాంపును తన సమక్షంలో ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. తాను 1945-52 సంవత్సరాల మధ్యకాలంలో పొట్టి శ్రీరాములుతో కలిసి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు గుర్తు చేశారు. పొట్టి శ్రీరాములు అప్పట్లో తన నివాసంలోనే ఉండేవారని గుర్తు చేశారు. భారత పార్లమెంట్‌లో, అసెంబ్లీలో పొట్టి శ్రీరాములు విగ్రహాలను ఏర్పాటు చేయాల కేవీ చలమయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్లు ఎల్వీ మురళీకుమార్, ప్రసాద్, పబ్లిక్ రిలేషన్ ఇన్‌స్పెక్టర్ మువ్వా రమేష్ తదితరులు పాల్గొన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..