ఈటల ఎఫెక్ట్‌: చిక్కుల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పదవులు

by  |
Minister Etela Rajender
X

దిశ ప్రతినిధి, మెదక్ : ప్రస్తుతం హుజురాబాద్ ఎఫెక్ట్ కొనసాగుతోంది. హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈటెలను ఓడించేందుకు సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేయడంతో పాటు పెండింగ్ సమస్యలన్నింటిని పరిష్కరిస్తున్నారు. ఇది గ్రహించిన ప్రజలు మా ప్రాంత ఎమ్మెల్యేలు సైతం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ ఒకట్రెండు చోట్ల ప్రతిపక్ష నాయకులు ఈ స్వరాన్ని వినిపించడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేల వెన్నులో వణుకు మొదలైంది. ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న దానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఎమ్మెల్యేలకు పదవుల గండం ….

ఉమ్మడి మెదక్ జిల్లాలో 11 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. ఇందులో సంగారెడ్డి, దుబ్బాక మినహా మిగిలిన తొమ్మిది నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇందులోనూ ఒకరు ముఖ్యమంత్రి కాగా, మరొకరు ఆర్ధిక మంత్రి తన్నీరు హరీశ్ రావు. ప్రస్తుతం గజ్వేల్ ఎమ్మెల్యేగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కొనసాగుతున్నారు. రాష్ట్ర ఆర్ధిక మంత్రిగా సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు, హుస్నాబాద్ కు వొడితల సతీశ్ కుమార్, మెదక్ పద్మాదేవేందర్ రెడ్డి, నర్సాపూర్ కు మదన్ రెడ్డి, ఆందోల్ కు చంటి క్రాంతి కిరణ్, పటాన్ చెరుకు గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాదు మానిక్ రావు, నారాయణఖేడ్ కు భూపాల్ రెడ్డిలు అధికార పార్టీ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఇక దుబ్బాక ఎమ్మెల్యేగా ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ నుండి రఘునందన్‌రావు, సంగారెడ్డి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుండి జగ్గారెడ్డిలు గెలుపొందారు. అయితే వీరిద్దరూ మినహాయించి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల పదవులకు గండం వాటిల్లింది. హుజురాబాద్ మాదిరిగా మీరంతా రాజీనామా చేయాలని పలువురు ప్రతిపక్ష నాయకులు, సామాన్య ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పలుచోట్ల ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని బహిరంగంగానే ఆరోపించారు. ఇటీవల జరిగిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలోనూ మంత్రి హరీశ్ రావును, ఇతర ఎమ్మెల్యేలను అడ్డుకొని నిరసన తెలిపిన విషయం తెలిసిందే.

ఉప ఎన్నిక వస్తేనే అభివృద్ధి…

రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ఎన్నికలు ఎక్కడ ఉంటే అక్కడ వరాల జల్లు కురిపిస్తున్నారు. పెండింగ్ సమస్యలను త్వరగా పరిష్కరిస్తున్నారు. ఇటీవలి కాలంలో జరిగిన హుజుర్ నగర్, దుబ్బాక ఉప ఎన్నికల సమయంలోనూ ఆ ప్రాంతానికి పెద్దయెత్తున నిధుల వర్షం కురిపించారు. తాజాగా కేసీఆర్ తన కుడి భుజమైన ఈటల రాజేందర్‌ను ఓడించేందుకు సైతం పెద్దఎత్తున వ్యూహాన్ని రచిస్తున్నారు. ఈటలను ఓడగొట్టేందుకు దళిత బంధు, కొత్త రేషన్ కార్డులు, డబుల్ బెడ్ రూంలు, గొర్రెల పంపిణీ, 57 ఏళ్లకే పెన్షన్, చేనేత బీమా, కమ్యూనిటీ భవనాలు, మహిళా భవనాలు, ఇలా అనేక స్కీములు ప్రవేశపెడుతున్నారు.

దీంతో ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఎమ్మెల్యేలు సైతం రాజీనామా చేయండి … మళ్లీ ఎన్నికలు వస్తాయి … అప్పుడు ముఖ్యమంత్రి మన ప్రాంతానికి అత్యధిక నిధులు అందిస్తారు.. ఫలితంగా మన ప్రాంతమంతా అభివృద్ధి చెందుతుందంటూ పలువురు ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు, ఇతర వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. కొందరు సీనియర్ నాయకులు నేరుగా మీడియా సమావేశంలోనూ అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల హుస్నాబాద్ ఎమ్మెల్యేపై ఆ ప్రాంత ప్రతిపక్ష నాయకులు హుస్నాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయని ఎమ్మెల్యే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాజాగా టీపీసీసీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దేవులపల్లి యాదగిరి సైతం అభివృద్ధిలో వెనుకబడుతున్న సిద్దిపేటను అభివృద్ధి చేసుకునేందుకు సిద్దిపేట ఎమ్మెల్యే రాజీనామా చేయాలంటూ మీడియాతో మాట్లాడారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో అనేకం చోటు చేసుకుంటున్నాయి. వీటిపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎలా స్పందిస్తారో చూడాలి.

సిద్దిపేట మంత్రి రాజీనామా చేయాలి…

-దేవులపల్లి యాదగిరి, టీపీసీసీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి
సిద్దిపేట ప్రాంత దళితుల ఆర్థికాభివృద్ధి కోసం రాష్ట్ర ఆర్ధిక మంత్రి రాజీనామా చేయాలి. రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నిక జరిగిన అక్కడ నిధులు వెచ్చించడం సీఎంకు అలవాటైంది. అందుకే ఇప్పుడు హుజురాబాద్ లో రూ. 2 వేల కోట్లతో దళిత బంధు పథకం ప్రవేశపెట్టిండు. ఇతర అభివృద్ధి పనులకు వందల కోట్లు ఖర్చు చేస్తుండు. సిద్దిపేటకు కూడా అన్ని కోట్ల నిధులు రావాలంటే సిద్దిపేటలో ఉప ఎన్నిక జరగాలని, ఇందుకు జన నేత అని చెప్పుకొనే హరీశ్ రావు జనం బాగు కోసం రాజీనామా చేసి ఉప ఎన్నిక తీసుకొచ్చి ఇరవై ఏండ్లుగా ఓట్లేసి గెలిపిస్తున్న సిద్దిపేట ప్రాంత ప్రజల కోసం సహకరించాలి.


Next Story

Most Viewed