అక్కడ 'ధరణి' కంటే మేలైన పోర్టల్స్

by  |
అక్కడ ధరణి కంటే మేలైన పోర్టల్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ధరణి లాంటి సేవలు మన పొరుగు రాష్ట్రాలలోనూ అక్కడి రైతులకు అందుతున్నాయి. మన అధికారులు చెబుతున్నట్టుగా ఇలాంటి సత్వర సేవలు అక్కడ అందుబాటులో లేవనడం మాత్రం అబద్ధం. కొన్ని రాష్ట్రాలు భూమి హక్కులకు టైటిల్ గ్యారంటీ ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నాయి. భూమి హక్కులకు ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చేటట్లుగా కేంద్రం మార్గదర్శకాలను రూపొందించింది. తెలంగాణ ప్రభుత్వం భూ రికార్డులను కంప్యూటీకరించేందుకే ఆపసోపాలు పడింది. పెద్ద రాష్ట్రాలలో ఏనాడో రికార్డుల డిజిటలైజేషన్ పూర్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం సులభతర వాణిజ్య పరంగానే విధి విధానాలను రూపొందిస్తోంది. త్వరితగతిన సేవలందించేందుకు మొగ్గు చూపుతోంది. వివాదాల పరిష్కారానికి వేగవంతమైన మెకానిజాన్ని మాత్రం ఏర్పాటు చేయడం లేదు. కేంద్రం రూపొందించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఫార్ములాలోని కొన్ని అంశాలను అనుసరిస్తోంది. అవి కూడా సరైన మార్గంలో కాదని భూ చట్టాల నిపుణుడు, ప్రొఫెసర్ ఎం. సునీల్ కుమార్ చెబుతున్నారు. రైతుల కోసం కాకుండా వాణిజ్యపరంగానే ఆలోచించడం వలన భవిష్యత్తులో అనేక చిక్కులు ఎదురయ్యే అవకాశాలున్నాయంటున్నారు. భూ పరిపాలనను ఆదాయం కోసమే చూస్తున్నారని, హక్కులు కల్పించేందుకు సరైన విధానాలను అనుసరించినప్పుడే సక్సెస్ అవుతామని అంటున్నారు. సత్వర రిజిస్ట్రేషన్, ఆటోమెటిక్ మ్యూటేషన్ మాత్రమే గొప్ప సంస్కరణ కాదని, హక్కులు పక్కాగా ఉంటేనే మంచి సంస్కరణ అంటున్నారు.

అక్కడ ఇలా చేస్తున్నారు

చాలా రాష్ట్రాలలో భూ రికార్డుల కంప్యూటరీకరణ పూర్తయ్యింది. ఇంకొన్ని రాష్ట్రాలు తెలంగాణతో సమానంగా ఉన్నాయి. ధరణి మాదిరిగా కర్నాటకలో ‘భూమి.. కావేరి’నడుస్తోంది. భూమిలో రికార్డులు, కావేరిలో రిజిస్ట్రేషన్లు ఉంటాయి. రిజిస్ట్రేషన్ చేయగానే ఆటోమెటిక్ మ్యూటేషన్ అయిపోతుంది. రెండింటినీ అనుసంధానం చేశారు. మ్యూటేషన్ కోసం మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సిన పని లేదు. అదనపు ఫీజు కూడా లేదు. అక్కడ కొత్త లావాదేవీలతో పాటే సర్వే ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేయాలంటే తప్పనిసరిగా ల్యాండ్ మ్యాపు జత చేయాలి. అది కూడా లైసెన్డ్ సర్వేయర్ చేత చేయించాలి. ఆ కాపీని స్కాన్ చేస్తున్నారు. రికార్డులతో అనుసంధానం చేస్తున్నారు. ప్రైవేటు సర్వేయర్లకు లైసెన్సులు ఇచ్చారు. వారు నామమాత్రపు ఫీజుతో క్షేత్ర స్థాయిలో కొలతలు వేసి మ్యాపును రూపొందిస్తారు. ఈ ప్రక్రియ 2002 నుంచి అంటే 18 ఏండ్లుగా అమలవుతోంది.

టైటిల్ గ్యారంటీ దిశగా

గోవా, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఆన్ లైన్ లావాదేవీలను అమలు చేస్తున్నాయి. అక్కడా ఆటోమెటిక్ మ్యూటేషన్ ప్రక్రియ నడుస్తోంది. టైటిల్ గ్యారంటీ దిశగా అడుగులు వేస్తున్నారు. మహారాష్ట్రంలో ఇప్పటికే యజమాని దగ్గర స్వల్ప యూజర్ చార్జీలు తీసుకుని ఇంటి స్థలాల సర్వే చేస్తున్నారు. టైటిల్ గ్యారంటీ సర్టిఫికేట్ ను జారీ చేస్తున్నారు. ఇది నీతి అయోగ్ ప్రశంసలు అందుకుంది. పలు రాష్ట్రాలలో ఆన్ లైన్ విధానాన్ని ఎలాంటి అవరోధాలు లేకుండా అమలు చేస్తున్నారు. దేశంలో భూ పరిపాలనలో అనేక బెస్ట్ ప్రాక్టీసెస్ ను కేంద్రం ప్రభుత్వం ఆమోదించింది. వాటిలో అనుకూలమైనవి అమలు చేయాలంటూ రాష్ట్రాలకు కూడా పంపింది.

ఇక్కడేమో అన్నీ సమస్యలే

తెలంగాణలో ధరణి ఓ కొలిక్కి రావడం లేదు. సమస్యలన్నీ అలాగే ఉంచారు. 99 శాతం పక్కాగా ఉందంటూ గొప్పలు చెబుతున్నారు. బాధితుల సంఖ్య భారీగా ఉంది. సాగు భూముల రిజిస్ట్రేషన్లలో ఆటోమెటిక్ మ్యూటేషన్ బాగానే అమలవుతోంది. సేల్, గిఫ్ట్, పార్టిషన్ డీడ్ లతో సరి పెట్టారు. మిగతా సర్వీసులను పునరుద్దరించలేదు. పెండింగు ఫైళ్లను బుట్టదాఖలు చేస్తున్నారు. దరఖాస్తుదారులను రోజూ ఆఫీసు చుట్టూ తిప్పుకుంటున్నారు. కొత్త ఆర్వోఆర్ చట్టం ప్రకారం తహసీల్దార్లకు సమస్యను పరిష్కరించే అధికారాలను కట్టబెట్టారు. వాటిని అమలు చేసేందుకు ఆప్షన్లు ఇవ్వడం లేదు. భూ సమస్యలను జటిలం చేస్తున్నారు. దరఖాస్తుదారుల పొరపాట్లు లేకపోయినా ధరణి విధివిధానాలతో లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారు. ఆర్వోఆర్ డాక్యుమెంట్లకు ఆధార్ లింకు చేయడంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ముందున్నాయి. 94 శాతం, 91 శాతం వంతున పూర్తి చేశాయి. దేశంలో మరే రాష్ట్రం ఈ ప్రక్రియను ప్రారంభించలేదని చెప్పొచ్చు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడిప్పుడే మొదలు పెట్టాయి. అసోం, గుజరాత్, హర్యానా, కేరళ, మణిపూర్, సిక్కిం, తమిళనాడు, పశ్చిమబెంగాల్ ఆధునిక రికార్డుల గదులను ఏర్పాటు చేయడంలోచాలా ముందున్నాయి. తెలంగాణలో మాత్రం 24.64 శాతం పూర్తయ్యింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 61.54 శాతం పూర్తి చేశారు.

వివిధ రాష్ట్రాలలో కంప్యూటరీకరణ

క్రమ సం. రాష్ట్రం గ్రామాలు పూర్తి
1 దాద్రానగర్ హవేలీ 45,437 100 శాతం
2 గోవా 425 100 శాతం
3 అండమాన్ 205 99.5 శాతం
4 హిమాచల్ ప్రదేశ్ 20,951 98.86 శాతం
5 జార్ఖండ్ 32,945 99.53 శాతం
6 కర్నాటక 29,527 99.63 శాతం
7 మధ్యప్రదేశ్ 55,070 99.42 శాతం
8 మహారాష్ట్ర 44,855 98.83 శాతం
9 ఒడిశా 51,706 99.99 శాతం
10 సిక్కిం 417 100 శాతం
11 తమిళనాడు 16,795 99.73 శాతం
12 తెలంగాణ 10,768 99.44 శాతం
13 పశ్చిమబెంగాల్ 42,191 98.68 శాతం

మ్యాపుల డిజిటలైజేషన్

క్ర.సం రాష్ట్రం మొత్తం పూర్తయినవి
1 ఆంధ్రప్రదేశ్ 43,91,343 93 శాతం
2 బీహార్ 70,321 99.89 శాతం
3 గోవా 14,854 100 శాతం
4 గుజరాత్ 24,967 100 శాతం
5 హర్యానా 51,697 93.27 శాతం
6 కర్నాటక 29,522 100 శాతం
7 కేరళ 1,03,917 100 శాతం
8 మధ్యప్రదేశ్ 1,14,194 97.8 శాతం
9 మహారాష్ట్ర 49,06,221 87.93 శాతం
10 ఒడిశా 1,15,232 100 శాతం
11 పంజాబ్ 18,445 97.3 శాతం
12 సిక్కిం 2,549 100 శాతం
13 తమిళనాడు 53,32,529 99.08 శాతం
14 తెలంగాణ 18,040 97.25 శాతం


Next Story

Most Viewed