సచిన్ తప్పు చేసేదాక ఎదురు చూసేవాళ్లం : పొలాక్

by  |
సచిన్ తప్పు చేసేదాక ఎదురు చూసేవాళ్లం : పొలాక్
X

గతంలో టీమిండియా మ్యాచ్ ఆడుతుందంటే చాలు.. క్రికెట్ అభిమానులంతా టీవీల ముందు కూర్చుని ‘దేవుడా.. దేవుడా ఈ రోజు సచిన్ సెంచరీ చేయాలి’ అని కోరుకునేది. ఇప్పటి జనరేషన్‌కు ఒక వికెట్ పడితే ఇంకో బ్యాట్స్‌మన్ ఉన్నాడనే ధీమా ఉంటుంది. కానీ ఒకప్పుడు సచిన్ ఔటైతే ఇండియా పనైపోయిందనేంత బాధ పడేది. అందుకే సచిన్ ‘క్రికెట్ లెజెండ్’ అయ్యాడు. ‘క్రికెట్ మతమైతే.. సచిన్‌ను దేవుడు’ అనేది అందుకే. సచిన్ క్రీజులో ఉంటే అతడిని ఎలా అవుట్ చేయాలా అని ప్రత్యర్థులు వ్యూహాలు రచిస్తుంటారు. అతడి వికెట్ తీస్తే బౌలర్‌కు పండగే. మరి అలాంటి సచిన్ గురించి దక్షిణాఫ్రికా మాజీ పేసర్ షాన్ పొలాక్ ఏమంటున్నాడో తెలుసా ? ‘సచిన్ వికెట్ తీసేందుకు తాము ప్రత్యేకంగా ఎలాంటి ప్రణాళికలు రచించే వాళ్లం కాదు. కానీ సచిన్ ఎప్పుడు తప్పు చేస్తాడా అని ఎదురు చూసేవాళ్లం’ అని చెప్పాడు.

ఇటీవల స్కైస్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రికెట్ గురించి చాలా విషయాలు వెల్లడించాడు. ‘పరిస్థితులకు తగినట్లు ఆడటంలో సచిన్‌ను మించిన వారు ఎవరూ లేరని, ఆటను చాలా త్వరగా అర్థం చేసుకుంటాడని’ పొలాక్ అన్నాడు. వన్డే మ్యాచుల్లో సచిన్‌ను తొమ్మిది సార్లు ఔట్ చేసిన పొలాక్.. ఓవరాల్‌గా సచిన్‌ను అత్యధిక సార్లు అవుట్ చేసిన బౌలర్లలో నాలుగో స్థానంలో నిలిచాడు. ఎంతటి దిగ్గజ బ్యాట్స్‌మన్ అయినా ఎప్పుడో ఒకసారి తప్పు చేయక మానడు. అలా ఎప్పుడు తప్పు చేసినా సచిన్ తనకు దొరికిపోయేవాడని పొలాక్ చెప్పుకొచ్చాడు.

Tags: Sachin, Shaun Pollock, South Africa, Legendary Batsman

Next Story