"చంద్రబాబుగారూ ఇది గుర్తుంచుకోండి" : జగన్ సంచలన ట్వీట్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-02-01 15:28:36  IST  )

తప్పుల్ని ప్రశ్నిస్తుంటే కూటమి ప్రభుత్వం జీర్ణించుకోలేక తమ పార్టీ నేతలపై, వారి ఇళ్లపై దాడులు చేయిస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఫైరయ్యారు.

చంద్రబాబుగారూ ఇది గుర్తుంచుకోండి : జగన్ సంచలన ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: తప్పుల్ని ప్రశ్నిస్తుంటే కూటమి ప్రభుత్వం జీర్ణించుకోలేక తమ పార్టీ నేతలపై, వారి ఇళ్లపై దాడులు చేయిస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఫైరయ్యారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో చంద్రబాబుకు సున్నితమైన హెచ్చరిక చేశారు. ప్రజాస్వామ్యంలో, మీరు చేసిన తప్పుడు ఆరోపణలు తప్పు అని, ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ల్యాబులు NDDB, NDRI నిర్ధారణ చేసిన తర్వాత, మీరుచేసిన ఆ తప్పులకు మిమ్మల్ని ప్రశ్నిస్తే, జీర్ణించుకోలేక అంబటి రాంబాబు, జోగి ర‌మేశ్ ఇళ్లకు మీరు నిప్పు పెట్టడం, ఆ దుశ్చర్యలతో భయాన్ని కలిగించానని మీరు అనుకోవడం మీ భ్రమేనన్నారు. ఆ ఇద్దరి ఇళ్లకు పెట్టిన నిప్పు.. మీరు మీ ప్రభుత్వానికి పెట్టుకున్నట్లేనని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.

అంబటి రాంబాబు, జోగి ర‌మేశ్ ఇళ్లకు పెట్టిన నిప్పు అరాచకానికి, ఆటవిక పాలనకు, “జంగిల్‌రాజ్‌’’కు ప్రతీక అని తెలిపారు. కానీ ఈ నిప్పు ద్వారా ప్రజాస్వామ్యంపై రగిల్చిన మంటలతో పుట్టిన వేడి, చంద్రబాబు స‌ర్కార్‌ను ద‌హించివేస్తుందని జోస్యం చెప్పారు. రానున్న కాలంలో మీకు వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఎగిసే ప్రజాగ్రహ జ్వాలలు, మీ ప్రభుత్వాన్ని పూర్తిగా దహనంచేసి, బూడిద చేయడం తథ్యమని ఎక్స్ పోస్టులో రాసుకొచ్చారు. "చంద్రబాబుగారూ గుర్తుంచుకోండి.. ప్రజాస్వామ్యంలో హింసా జ్వాలలను రేపే చేయి కాలక తప్పదు, అరాచక, ఆటవిక పాలన అంతం కాక తప్పదు. మీరు సృష్టించిన “జంగిల్‌ రాజ్‌’’ భూస్థాపితం కాక తప్పదు. చరిత్ర చెప్పే సత్యం ఇది" అని జగన్ చేసిన ట్వీట్ లో తెలిపారు.

Next Story