AP News: నీతికి అవినీతికి మధ్య ఎన్నికల యుద్దం.. ఆ నియోజకవర్గంలో గెలుపెవరిది..?

by Indraja |   (  Updated:2024-05-12 04:10:27  IST  )

హోరాహోరీ తలపడుతున్న ఇద్దరు రాజులు. 2019లోనూ తలపడ్డారు.

AP News: నీతికి అవినీతికి మధ్య ఎన్నికల యుద్దం.. ఆ నియోజకవర్గంలో గెలుపెవరిది..?
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: హోరాహోరీ తలపడుతున్న ఇద్దరు రాజులు. 2019లోనూ తలపడ్డారు. అయితే అప్పుడు ఇద్దరూ ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో తిరిగి బరిలోకి దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. విశాఖ నగరానికి నడిబొడ్డు లాంటి ఉత్తర నియోజక వర్గంనుంచి వైసీపీ అభ్యర్థిగా కేకే రాజు, కూటమి అభ్యర్థిగా బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్ రాజు తలపడుతున్నారు.

2019లో తెలుగుదేశం అభ్యర్థి గంటా శ్రీనివాసరావు చేతిలో ఓటమి చెందిన వీరిద్దరిలో కేకే రాజు రాష్ర్టంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నకారణంగా అనధికార ఎమ్మెల్యేగా చెలామణి అయిపోయారు. ఇప్పుడు అదే ఆయనకు శాపంగా మారుతోంది. దుందుడుకు స్వభావం, వైసీపీ నేతల మితిమీరిన అవినీతి కేకే రాజుకు ఇబ్బందికరంగా మారగా, పైసా అవినీతి లేకపోవడం విష్ణుకుమార్ రాజుకు కలిసివస్తోంది.

చంద్రబాబు, పవన్‌లపై కేకే రాజు దాడి

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ వచ్చినప్పుడు కే కే రాజు నేతృత్వంలో వైసీపీ కార్యకర్తలు విమానాశ్రయం బయట వారి కార్లను అడ్డగించి దాడికి పాల్పడ్డారు. మూడు రాజధానులు వద్దన్నారంటూ చంద్రబాబును, విశాఖలో అడుగుపెట్టవద్దంటూ పవన్‌ను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. వారి కార్ల మీద రాళ్లు , కర్రలతో జరిగిన దాడిలో కే కే రాజు పాల్గొనడం ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. ప్రశాంతతను కోరుకొనే విశాఖ వాసులు కేకే రాజు నేతృత్వంలో జరిగిన దాడులను ఎన్నికల సమయంలో గుర్తు చేసుకొంటున్నారు.

బలవంతపు వసూళ్లు, అవినీతి

నియోజక వర్గ ఇన్చార్జి హోదాలో కేకే రాజు పూర్తిగా అధికారులపై పెత్తనం చేశారు. తన వెంట వున్న కొందరు అత్యంత అవినీతి పరులైన కార్పొరేటర్ల కారణంగా కే కే రాజు కార్యాలయం వసూళ్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. నియోజక వర్గంలోనే గాక నగరంలోని పలు రేషన్ షాపులను కేకే రాజు పేరు చెప్పి ఒక ముఠా తమ ఆధీనంలోకి తెచ్చుకొంది. బదిలీలు, పోస్టింగ్‌లకు, సిఫార్సులకు పెద్ద ఎత్తున వసూళ్లు చేశారనే ఆరోపణలు ఆయన కార్యాలయంపై వున్నాయి.

పార్టీలో సయోధ్య అంతంత మాత్రమే

విశాఖ ఉత్తర నియోజక వర్గం పరిధిలో వైసీపీలో ఎమ్మె్ల్యే ఆశావహులు, గతంలో పోటీ చేసిన వారు ఎక్కువగానే వున్నారు. వీరంతా పార్టీలో యాక్టివ్ గానేవున్నారు. పైకి కే కే రాజుకు మద్దతుగా పనిచేస్తున్నప్పటికీ లోలోన వ్యతిరేకంగా చేస్తున్నారు. కే కే రాజు ఓడిపోతేనే తమకు రాజకీయ భవిష్యత్ అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఈ కారణంగానే రెండు రోజుల క్రితం కే కే రాజు పంపిణీకి సిద్ధం చేసిన నగదు పెద్ద మొత్తంలో ఎన్నికల సంఘం అధికారులకు పట్టుపడిందని చెబుతున్నారు.

అవినీతి లేకుండా.. అందరికీ అందుబాటులో..

మరో వైపు కూటమి నుంచి పోటీ చేస్తున్న విష్ణుకుమార్ రాజు అవినీతి, వసూళ్లకు దూరం. పైగా నిత్యం జనానికి అందుబాటులో వుంటారు. 2014-19 మధ్య బీజేపీ పక్ష నేతగా వ్యవహరించిన ఆయన ఉత్తర నియోజక వర్గంలో ధీర్ఝకాలంగా పెండింగ్ లో వున్న కేంద్ర ప్రభుత్వంతో ముడిపడివున్న రైల్వే, పోర్టు భూముల సమస్యలను పరిష్కరించడం ప్లస్ అవుతోంది

Next Story