Shashi Tharoor: వారి వాగ్దానాలను మనం ఎలా విశ్వసించగలం?-పాక్ పై శశిథరూర్ విమర్శలు

by Shamantha N |

భారత్‌-పాక్‌ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించినప్పటికీ.. దాయాది దేశం తన తీరు మార్చుకోలేదు.

Shashi Tharoor: వారి వాగ్దానాలను మనం ఎలా విశ్వసించగలం?-పాక్ పై శశిథరూర్ విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌-పాక్‌ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించినప్పటికీ.. దాయాది దేశం తన తీరు మార్చుకోలేదు. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ (Ceasefire Violation).. సరిహద్దుల వద్ద మళ్లీ కాల్పులకు తెగబడింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశి థరూర్‌ (Shashi Tharoor) పాక్‌ తీరుపై మండిపడ్డారు. సోషల్ మీడియాలో హిందీలో ఓ పోస్టు పెట్టారు. “ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోవడం, మాట మీద నిలబడకపోవడం వారి స్వభావం. అలాంటప్పుడు వారి వాగ్దానాలను మనం ఎలా విశ్వసించగలం?” అని ప్రశ్నించారు. భారత్‌ ఎప్పుడూ దీర్ఘకాలిక యుద్ధాన్ని కోరుకోదని ఈ ఒప్పందంతో ప్రపంచ దేశాలకు తెలిసేలా చేసిందని థరూర్‌ అన్నారు. కానీ.. ముష్కరులు మన దేశం జోలికి వస్తే ఎలా ఉంటుందో వారికి తెలిసేలా చేశామన్నారు. దీని నుంచైనా దాయాది దేశం గుణపాఠం నేర్చుకొని ఉగ్రమూకలను పెంచి పోషించడం మానుకోవాలని హెచ్చరించారు. కేంద్రం ఇటీవల అమలు చేసిన ఆపరేషన్‌ సిందూర్‌ను ప్రశంసించారు. దీంతో భారత్‌ తన శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిందని అన్నారు.

కాల్పుల విరమణ ఉల్లంఘన

భారత్‌- పాక్‌ శాంతికి అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సోషల్ మీడియాలో ప్రకటించారు. ఆ తర్వాత భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రం మిస్రీ మాట్లాడుతూ.. ఇరు దేశాలు చేసుకున్న ఒప్పందం ప్రకారం అన్నిరకాల కాల్పులు, సైనిక చర్యలను భారత్‌-పాక్‌ నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అందుకు పాక్ అంగీకరించినట్లు పేర్కొన్నారు. రెండు దేశాల డీజీఎంవోలు శనివారం సాయంత్రం 3.35 గంటల సమయంలో నేరుగా మాట్లాడుకున్నారని.. ఇరువైపులా అన్నిరకాల సైనిక కార్యకలాపాలను నిలిపేయాలని నిర్ణయించారని అన్నారు. అయితే, ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ..జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాలపైకి పాకిస్థాన్‌ డ్రోన్లు ప్రయోగించింది. దీంతో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని వాడి భారత్‌ వాటిని కూల్చేసింది.

Next Story