- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పార్టీ మార్పు వార్తలపై కుండబద్దలు కొట్టిన మాజీ మంత్రి
రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరం ఊహించలేం. ఏ నాయకుడు ఎప్పుడు పార్టీ మారుతాడో కూడా చెప్పలేం. ఇప్పుడు ఏపీలో వైసీపీ పరిస్థితి కూడా అలాగే తయారైంది.

దిశ, వెబ్‌డెస్క్: రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరం ఊహించలేం. ఏ నాయకుడు ఎప్పుడు పార్టీ మారుతాడో కూడా చెప్పలేం. ఇప్పుడు ఏపీలో వైసీపీ పరిస్థితి కూడా అలాగే తయారైంది. ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో అధిష్టానం అయోమయంలో పడింది. విజయసాయి రెడ్డి తర్వాత మరో కీలక నేత పార్టీ మారబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఆ పార్టీ మార్పు వార్తలపై మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్(Adimulapu Suresh) స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం వైఎస్ జగన్‌తోనే తన ప్రయాణం ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు. గతంలోనూ నాపై ఈ తరహా ప్రచారం చేశారని మండిపడ్డారు. ఎన్ని ఒడిదుడుకులైనా ఎదుర్కుంటాను కానీ.. వైసీపీని మాత్రం వీడే ప్రసక్తే లేదని అన్నారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ప్రజల్లో ఆదరణ కోల్పోయిందని విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా.. కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న విధానాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
కాగా, వైసీపీకి ఈ మధ్య కాలంలో వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఒక్కొక్కరుగా నేతలు తమ దారి తాము వెతుక్కుంటున్నారు. అధినేతకు ఆప్తులు, సన్నిహితులుగా, నమ్మిన బంటుగా పేరున్న నేతలు వైసీపీకి గుడ్‌బై చెప్తున్నారు. ఇటీవలే ఆ పార్టీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి ఏకంగా రాజకీయాల నుంచే తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. రాజకీయ సన్యాసం ప్రకటన నేపథ్యంలో విజయసాయి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు చంద్రబాబుతో రాజకీయ వైరం తప్ప వ్యక్తిగతంగా ఎలాంటి గొడవలు లేవని అన్నారు. పవన్ కల్యాణ్ కూడా తనకు చిరకాల స్నేహితుడు అని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోనే విజయసాయి టీడీపీ(TDP)లో చేరబోతున్నారని.. ఆయన వెంట ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ సైతం టీడీపీ గూటికి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వినిపించాయి. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన నేతగా ఉన్న ఆదిమూలపు సురేష్.. టీడీపీలోని తన సామాజిక వర్గం నేతలతో లాబీయింగ్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. సాధ్యమైనంత త్వరగా టీడీపీలో చేరాలని మంతనాలు జరిపారని, ఆ పార్టీ పెద్దల నుంచి కూడా గ్రీన్‌సిగ్నల్ పొందినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో సురేష్ స్పందించి పార్టీ మార్పు వార్తలపై కుండబద్దలు కొట్టారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం జగన్ వెంటే నడుస్తున్నానని స్పష్టం చేయడంతో ఆ వార్తలకు పుల్‌స్టాప్ పడినట్లయింది.






