కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం.. నారా లోకేష్

by Dishafeatures2 |
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం.. నారా లోకేష్
X

దిశ, కర్నూలు ప్రతినిధి : కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని, కోర్టులకు సొంత భవనాలు నిర్మిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. మంగళవారం ఆళ్లగడ్డలో శివారు క్యాంప్ సైట్‌ నుంచి ప్రారంభమైన యువగళం పాదయాత్ర భూమా బాలిరెడ్డి నగర్, గవర్నమెంట్ కళాశాల, పాతబస్టాండ్ మీదుగా చిన్న కందుకూరు మీదుగా సాగింది. రహదారి పొడవునా వివిధ వర్గాల ప్రజలను కలుస్తూ ఆప్యాయంగా పలకిస్తూ ముందుకు సాగారు. ఈ క్రమంలో న్యాయవాదులు యువనేత లోకేష్‌ను కలిసి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. శ్రీబాగ్ ఒడంబడికను గౌరవిస్తూ కర్నూలులో హైకోర్టు బెంచి ఏర్పాటు చేయాలన్నారు. ఆళ్లగడ్డలో 5వ అడిషనల్ జిల్లా జడ్జి కోర్టు భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని లోకేష్‌నుకోరారు. అలాగే ఆళ్లగడ్డలో ఉన్న జడ్జిల నివాస భవనాలకు నిధులు మంజూరు చేయాలన్నారు. ఆళ్లగడ్డ కోర్టు ఆవరణలో కక్షిదారులకు టాయ్ లెట్ల నిర్మాణం చేపట్టాలన్నారు. ఆళ్లగడ్డలో బార్అసోసియేషన్ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు.

ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేయాలని, జూనియర్ న్యాయవాదుల వృత్తి నైపుణ్యతకు శిక్షణా కేంద్రాలు, గ్రంథాలయం ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే జూనియర్ న్యాయవాదులు వృత్తిలో స్థిరపడే వరకు ఆర్థికసాయం అందించాలన్నారు. న్యాయవాదులపై దాడుల నివారణకు ప్రత్యేక రక్షణ చట్టం రూపొందించాలన్నారు. న్యాయవాదుల సంక్షేమ నిధి అర్హతల్లో 35 సంవత్సరాల వయసు నిబంధనను సడలించి, న్యాయవాదు లందరికీ ఉపకరించేలా చర్యలు తీసుకోవాలని లోకేష్‌తో చెప్పుకున్నారు. అలాగే న్యాయవాదుల ఆరోగ్య భద్రతకు పరిమితి లేని హెల్త్ కార్డులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అందుకు నారా లోకేష్ మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీకి న్యాయవాదులు, న్యాయ వ్యవస్థపై అపారమైన గౌరవ మర్యాదలు ఉన్నాయన్నారు. జగన్మోహన్ రెడ్డి మాదిరి సుప్రీం కోర్టులో ఒకమాట, బయట మరొక మాట చెప్పమన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచి ఏర్పాటు చేసి తీరుతామని పునరుద్ఘటించారు.

తమకు వ్యతిరేకంగా తీర్పులిచ్చిన న్యాయమూర్తులపై ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్నవారే సోషల్ మీడియాలో విషం చిమ్మడం దారుణమన్నారు. రాష్ట్ర హైకోర్టులో కనీసం కప్పు కాఫీ దొరకడం లేదని ఒక న్యాయమూర్తి వ్యాఖ్యానించడం ప్రభుత్వానికి ఈ వ్యవస్థపై ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమౌతోందన్నారు. న్యాయమూర్తులు, న్యాయవాదులపై అమర్యాదగా ప్రవర్తించిన వారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. అలాగే టీడీపీ అధికారంలోకి రాగానే అద్దె భవనాల్లో నడుస్తున్న కోర్టులన్నింటికీ సొంత భవనాల నిర్మాణం చేపడతామన్నారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన న్యాయవాదులకు ఇళ్లస్థలాలు మంజూరు చేస్తామని, జూనియర్ న్యావాదులకు నైపుణ్య శిక్షణాకేంద్రాలు, గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తామని హామిచ్చారు. అనంతరం సుద్దపల్లె శివారు ప్రాంతంలో బస చేయనున్నారు. కార్యక్రమంలో భూమా నాగిరెడ్డి తనయుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.



Next Story