సీఎం జగన్‌ను కేసీఆర్ పక్కన పెట్టడానికి కారణం అదేనా..?

by Disha Web Desk |
సీఎం జగన్‌ను కేసీఆర్ పక్కన పెట్టడానికి కారణం అదేనా..?
X

దిశ,తెలంగాణ బ్యూరో : ఇంట్లో ఏదైనా శుభకార్యం చేసుకుంటేనే ఇరుగు పొరుగును పిలుస్తాం. ఇక స్నేహంగా ఉంటే ఇంటికి వెళ్లి మరి ప్రత్యేకంగా ఆహ్వానిస్తాం. తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే నెలలో వైభవంగా ఓపెన్ చేస్తుండగా.. వేడుకకు దూరపు రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానాలు అందాయి. కానీ.. పక్క రాష్ట్రమైన ఏపీ సీఎం జగన్ కు మాత్రం ఇన్విటేషన్ వెళ్లలేదు. ఆయనను కేసీఆర్ ఎందుకు పిలవడం లేదు? పిలిచే ప్రయత్నం చేశారా? లేక పిలిచినా రాడని తెలిసే ఆహ్వానించ లేదా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తున్నది. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేసీఆర్‌తో సన్నిహితంగానే ఉంటున్నారు. 2019లో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి కూడా జగన్ హాజరయ్యారు. ఆ తర్వాత రెండు మూడుసార్లు ప్రగతిభవన్‌కు వచ్చి పలు అంశాలపైనా కేసీఆర్‌తో చర్చించారు. కానీ.. ఈ మధ్యే ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య మీటింగ్ లేవు. ఎలాంటి చర్చలూ లేవు. కనీసం పలకరింపులు కూడా లేవు.

స్నేహమా..? వైరమా?

బీఆర్ఎస్2కు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ పలు రాష్ట్రాల సీఎంల మద్దతుకు ప్రయత్నించారు. ఉత్తరాది రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు, పార్టీల లీడర్లతో మంతనాలు జరిపారు. కానీ పొరుగున ఏపీ సీఎంతో మాత్రం ఇంతవరకు మాట్లాడినట్టు ఎక్కడ కూడా బీఆర్ఎస్ లీడర్లు చెప్పలేదు. దీంతో జగన్, కేసీఆర్ మధ్య విబేధాలు వచ్చాయా ? లేక ఇంటర్నల్‌గా ఏదైనా అవగాహన ఉందా? అనే అనుమానాలు రేకెత్తాయి. వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందోననే క్లారిటీ రాలేదు. దానిపై ఇప్పటికే పలు కథనాలు వినిపిస్తున్నాయి. ఓ వైపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌తో కలిసి పోటీ చేస్తుందని ఊహగానాలతో పాటు విడిగా పోటీ చేస్తుందనే టాక్ కూడా ఉంది. ఏపీ రాజకీయాల్లో బీజేపీ నిర్ణయం ప్రకటించిన తర్వాతే జగన్, కేసీఆర్ మధ్య రాజకీయ సంబంధాలపై క్లారిటీ వస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

షర్మిల తీరే కారణమా?

జగన్‌తో విబేధించిన అతని చెల్లెలు షర్మిల తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. దీనిపై సీఎం అసహనంగా ఉండడమే కాకుండా.. గత నెలలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో షర్మిల యాత్రలో మాట్లాడిన భాషపైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆ తర్వాతే ఆమె పాదయాత్రను గులాబీ కార్యకర్తలు అడ్డుకున్నారనే ప్రచారంలో ఉంది. షర్మిలను కట్టడి చేయడంలో జగన్ విఫలం అయ్యారని, అందుకే కేసీఆర్ కోపంతో ఉన్నట్టు తెలిసింది. మొదట్లోనే ఆమెను కంట్రోల్ చేసి ఉంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదనే అభిప్రాయంలో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం.

బీఆర్ఎస్‌పై మౌనంగా జగన్

బీఆర్ఎస్ ఆవిర్భావంపై టీడీపీతో పాటు ఏపీ మంత్రులు స్పందించారు. ఏపీలో ఆ పార్టీ ప్రభావం జీరో అని కామెంట్ కూడా చేశారు. కానీ జగన్ మాత్రం ఇంతవరకు నోరు విప్పలేదు. బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిని ప్రకటించినా పట్టించుకోలేదు. ఖమ్మం సభకు ఏపీ నుంచి ప్రజలను తరలించినా చూడనట్టుగా వ్యవహరించారు. దీంతో బీఆర్ఎస్ పై జగన్ ఆలోచన ఏంటీ? అని ఆ పార్టీ లీడర్లకు కూడా అంతు పట్టడం లేదనే టాక్ ఉంది. ఖమ్మం సభకు ఢిల్లీ, పంజాబ్, కేరళ సీఎంలు, యూపీ మాజీ సీఎంను ఆహ్వానించారు. అదేవిధంగా వచ్చే నెల 17న సెక్రటేరియట్ ఓపెనింగ్ కు తమిళనాడు సీఎం స్టాలిన్, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్విని యాదవ్, బీహార్ సీఎం నితీష్ తరుపున జేడీయూ నేత లలన్ సింగ్ ను ఆహ్వానించారు. కానీ.. పక్క రాష్ట్ర సీఎం జగన్‌ను మాత్రం పిలవలేదని తెలిసింది.

Also Read...

న్యాయ వ్యవస్థపై ముప్పేట దాడి...కేంద్రానికీ ఏపీనే ఆదర్శమా?



Next Story