Delhi Elections: ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ స్పందన ఇదే!

by Yella Dhawani Reddy |   (  Updated:2025-02-08 15:09:57  IST  )

దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో (Delhi Assembly Elections) భారతీయ జనతా పార్టీ (BJP) ఘన విజయం సాధించింది.

Delhi Elections: ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ స్పందన ఇదే!
X

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో (Delhi Assembly Elections) భారతీయ జనతా పార్టీ (BJP) ఘన విజయం సాధించింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న కమలనాథులు సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే ఘనమైన రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ముచ్చటగా మూడోసారి ఖాతా తెరవలేకపోయింది. ఈ ఫలితాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandi) ఎక్స్ వేదికగా స్పందించారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పును అంగీకరిస్తున్నట్లు తెలిపారు. అలాగే, కాంగ్రెస్ కార్యకర్తలకు, పార్టీకి మద్ధతుగా నిలిచిన ఓటర్లకు తన హృదయాపూర్వకంగా ధన్యవాదాలు చెప్పారు. ఢిల్లీ ప్రజల హక్కులను రక్షించేందుకు, ఢిల్లీ అభివృద్ధి కోసం, కాలుష్య నివారణకు, అవినీతి, ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ట్వీట్ చేశారు.

కాగా, ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ 48, ఆప్ 22 గెలుచుకున్నాయి. ఈ ఎన్నికల్లో మాజీ సీఎం కేజ్రీవాల్ సైతం ఓటమి పాలయ్యారు. ఇక కాంగ్రెస్ మాత్రం ఖాతా తెరవలేకపోయింది. ఢిల్లీ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తొలిసారి బీజేపీ విజయం సాధించగా, 1998లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మొదటిసారి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఆనాటి నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించింది. 2003, 2008 ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. ఇక 2013 ఎన్నికల్లో మాత్రం హస్తం పార్టీ 8 స్థానాలకు పడిపోయింది. 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ సున్నా స్థానాలకే పరిమితమైంది.

Next Story