ప్రతిపక్షమంటేనే మోడీకి భయం.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని

by Javid Pasha |

ప్రతిపక్షమంటే ప్రధాని మోడీ వణికిపోతున్నాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు.

ప్రతిపక్షమంటేనే మోడీకి భయం.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రతిపక్షమంటే ప్రధాని మోడీ వణికిపోతున్నాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం మోడీ ప్రభుత్వ ఫాసిస్టు, నిరంకుశ చర్యకు నిదర్శనమన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలో నియంత పాలన సాగుతోందని, ప్రతిపక్షాలు లేకుండా పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని హతమార్చే విధంగా బీజేపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మోడీని ఉద్దేశించి ఎన్నికల ప్రచారంలో రాహుల్ వ్యాఖ్యలపై సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించినప్పటికీ, అప్పీలుకు నెల రోజుల సమయం ఇచ్చిందని, అయినప్పటికీ హడావుడిగా ఎంపీ పదవికి అనర్హునిగా ప్రకటించడం వెనుక కుట్ర దాగి ఉందన్నారు. గతంలో అసోం సీఎం, అలాగే ప్రధాని మోడీ సైతం రాహుల్ గాంధీని, ఆయన కుటుంబం గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేయలేదా? అని ప్రశ్నించారు.

అదానీ కుంభకోణం నుంచి మోడీ బయటపడటానికి రాహుల్‌ గాంధీని లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. అందుకే ఆయనపై వేటు వేశారని పేర్కొన్నారు. రాహుల్ కేరళలో వయనాడ్ నుంచి సీపీఐ అభ్యర్థి మీదనే గెలుపొంది లోక్ సభ సభ్యుడయ్యారని, అయినప్పటికీ ఆయనను అనర్హుడిగా ప్రకటించడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నియంతృత్వ బీజేపీ, మోడీ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని, వారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజులు ఎంతో దూరం లేదన్నారు. ఒక నియంత ప్రజాస్వామ్యం ముసుగులో పరిపాలన సాగిస్తూ, అన్ని వ్యవస్థలను తన ఆధీనంలోకి తీసుకుని ప్రశ్నించే గొంతుకలను లేకుండా చేస్తున్నారని, చరిత్ర గతిలో కాలగర్భంలో కలిసిపోయిన గతే మోడీకి పడుతుందని హెచ్చరించారు.

Next Story