'BJP vs MIM.. పగలు గుద్దులాట రాత్రి ముద్దులాట'

by Disha Web Desk 2 |
BJP vs MIM.. పగలు గుద్దులాట రాత్రి ముద్దులాట
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని సీపీఐ నారాయణ మండిపడ్డారు. నిజాం రాజుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని హిందూ ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ చిత్రీకరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో సీపీఐ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు బహిరంగ సభలో మాట్లాడిన నారాయణ.. సాయుధ పోరాటంలో ఎలాంటి కృషి లేని వారు ఇప్పుడు వక్ర భాష్యాలు చెబుతున్నారని అన్నారు. ఎర్ర నెమళ్లు నాపంల్లి గ్రౌండ్‌లో నాట్యం ఆడుతుంటే బయట కాకులు ఇకిలిస్తున్నాయని ఎద్దేవా చేశారు. బీజేపీ రకరకాల విగ్రహాలు పెడుతూ రాజకీయం చేస్తోందని అయితే గాంధీని చంపిన గాడ్సే, గుజరాత్‌లో రక్తపాతం సృష్టించిన నరేంద్ర మోడీ, నెంబర్ వన్ క్రిమినల్‌గా తేలిన అమిత్ షా విగ్రహాలను పెట్టి వాటికి బీజేపీ నేతలు పూజలు చేయాలని ఘాటు విమర్శలు చేశారు. వీళ్లా సాయుధ పోరాటం గురించి మాట్లాడేదని మండిపడ్డారు. ఈ గడ్డపై మొదట భూ సమస్య కోసం బందగి నేలకొరిగారని ఆ తర్వాత కొమురయ్య ఆ తర్వాత తెలంగాణ రైతాంగమంతా దండై కదలిందని గుర్తుచేశారు.

తెలంగాణ భారతదేశంలో విలీనం జరిగిందా లేదా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వమే జోక్యం చేసుకోకుంటే ఇక్కడ రాచరిక వ్యవస్థ పూర్తిగా ధ్వంసం చేసి సోషలిస్టు రాజ్యం ఏర్పడేదన్నారు. గతంలో ఉన్న కాంగ్రెస్ ఏనాడు తెలంగాణ సాయుధ పోరాటాన్ని గుర్తించలేదని అన్నారు. ఉద్యమ సమయంలో సాయుధ పోరాటాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఆ సంగతి మర్చిపోయారని విమర్శించారు. బీజేపీ, ఎంఐఎం ఒకటేనని ఈ దేశంలో ఏదైనా అమ్ముడు పోయే పార్టీ ఉందా అంటే అది ఒక్క ఎంఐఎం మాత్రమేనని ఆరోపించారు. ఎంఐఎం పార్టీ మూలాలు కాశీం రజ్వీ నుండి వచ్చాయని అన్నారు. ముస్లింలను కాపాడుతామని చెబుతూనే ఆ వర్గాన్ని టోకుగా అమ్మే ప్రయత్నం ఎంఐఎం చేస్తోందన్నారు. ఎంఐఎం చరిత్ర అంతా బ్లాక్ మెయిలింగేనన్నారు. దేశంలో నరేంద్ర మోడీకి నిజమైన మిత్రుడు ఎవరైనా ఉంటే అది ఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. పగలు గుద్దులాట రాత్రి ముద్దులాటలా వీరి వ్యవహారం సాగుతోందని ఎద్దేవా చేశారు. బీజేపీని గెలిపించేందుకు ఓవైసీ దేశమంతటా తిరుగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని బీజేపీ హైజాక్ చేయాలని ప్రయత్నిస్తోందని అన్నారు. దేశంలో ప్రస్తుతం రాజ్యంగాన్ని ధ్వంసం చేయాలని చూస్తున్నారని ఓ వైపు ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేస్తూనే మరో వైపు జార్ఖండ్‌లో ఆదివాసీ ముఖ్యమంత్రిపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.


Next Story