సీనియర్ ఎన్టీఆర్ తర్వాత.. ఆ ఘనత విజయ్‌దే..!

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-05-04 08:58:43  IST  )

సినిమాల్లో అగ్రహీరోగా రాణించి.. రాజకీయాల్లోకి వచ్చి సొంతంగా పార్టీ పెట్టిన తొలి ప్రయత్నంలోనే అధికారంలోకి రావడమనేది సాధారణ విషయం కాదు.

సీనియర్ ఎన్టీఆర్ తర్వాత.. ఆ ఘనత విజయ్‌దే..!
X

దిశ, వెబ్‌డెస్క్: సినిమాల్లో అగ్రహీరోగా రాణించి.. రాజకీయాల్లోకి వచ్చి సొంతంగా పార్టీ పెట్టిన తొలి ప్రయత్నంలోనే అధికారంలోకి రావడమనేది సాధారణ విషయం కాదు. ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉండి తలపండిన నేతలకు ధీటుగా నిలబడి.. ప్రచారాలు చేసి, పార్టీని అధికారంలో నిలబెట్టిన ఘనత ఆనాటి నందమూరి తారకరామారావుకే చెందుతుంది. ఆయన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రభంజనం.

భారత రాజకీయ చరిత్రలో సినీ గ్లామర్‌కు, రాజకీయ పీఠానికి విడదీయలేని అనుబంధం ఉంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో వెండితెర వేల్పులు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాకపోయినా, అడుగుపెట్టిన తొలి ప్రయత్నంలోనే అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడం అనేది మాత్రం ఒక అద్భుతం. నాడు ఆంధ్రప్రదేశ్‌లో స్వర్గీయ నందమూరి తారక రామారావు (NTR) సృష్టించిన ఆ ప్రభంజనాన్ని, నాలుగు దశాబ్దాల తర్వాత నేడు తమిళనాడులో నటుడు విజయ్ పునరావృతం చేయబోతున్నారనే చర్చ దేశవ్యాప్తంగా సాగుతోంది.

ఎన్టీఆర్ సృష్టించిన ఆ చరిత్ర ఏంటి?

1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు. అప్పట్లో ఎంజీఆర్ వంటి వారు కూడా ఎన్టీఆర్‌కు స్ఫూర్తిగా నిలిచారు. ఆ తర్వాత ఎందరో స్టార్ హీరోలు రాజకీయాల్లోకి వచ్చినా.. పార్టీ పెట్టిన మొదటి ఎన్నికల్లోనే సీఎం కుర్చీని అందుకోవడం ఎవరికీ సాధ్యం కాలేదు.

అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్న విజయ్

తమిళ తలపతి విజయ్ తన 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీని స్థాపించి రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. ప్రస్తుత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా బరిలోకి దిగారు. దశాబ్దాలుగా తమిళనాడును పాలిస్తున్న డీఎంకే, ఏఐడీఎంకే వంటి దిగ్గజ పార్టీలను వెనక్కి నెట్టి, విజయ్ మ్యాజిక్ ఫిగర్ 118కి చేరువలో ఉండటం రాజకీయ విశ్లేషకులను విస్మయానికి గురిచేస్తోంది. నేటి ట్రెండ్స్ గమనిస్తే.. ఎన్టీఆర్ తర్వాత మళ్లీ ఆ స్థాయి విజయాన్ని అందుకుంటున్న ఏకైక హీరోగా విజయ్ నిలవబోతున్నారు.

రాజకీయాల్లో విఫలమైన స్టార్ హీరోలు

విజయ్ సాధిస్తున్న ఈ విజయం ఎంత గొప్పదో అర్థం కావాలంటే, గతంలో రాజకీయాల్లోకి వచ్చిన ఇతర స్టార్ హీరోల ఫలితాలను గమనించాలి.

విజయకాంత్ (DMDK): 2005లో పార్టీ పెట్టి 2006 ఎన్నికల్లో పోటీ చేయగా, ఆయన ఒక్కరే గెలిచారు. 2011లో ప్రతిపక్ష నేత స్థాయికి ఎదిగినా అధికారానికి దూరంగానే ఉండిపోయారు.

చిరంజీవి (PRP): 2009లో భారీ అంచనాలతో ప్రజా రాజ్యం పార్టీని స్థాపించి 18 సీట్లు గెలుచుకున్నారు. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి చేరుకోలేక చివరకు పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు.

పవన్ కళ్యాణ్ (JSP): 2014లో పార్టీ పెట్టి, 2019లో తొలిసారి పోటీ చేస్తే కేవలం ఒక్క సీటుకే పరిమితమయ్యారు. అయితే పట్టువదలకుండా పోరాడి 2024లో 100% స్ట్రైక్ రేట్‌తో గెలిచి ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

కమల్ హాసన్ (MNM): 2018లో పార్టీ పెట్టినా, ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయారు.

కొత్త చరిత్రకు నాంది

చిరంజీవి, విజయకాంత్ వంటి వారు మొదటి ప్రయత్నంలో ప్రభావం చూపినా అధికారాన్ని మాత్రం అందుకోలేకపోయారు. కానీ, నేటి ఫలితాల్లో విజయ్ 109 పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉండటం చూస్తుంటే, తమిళనాడు ప్రజలు దశాబ్దాల ద్రవిడ రాజకీయాలకు స్వస్తి పలికి 'దళపతి'కి పట్టం కట్టాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ఇదే ఫలితం ఖరారైతే, ఎన్టీఆర్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ముఖ్యమంత్రి కాబోతున్న స్టార్ హీరోగా విజయ్ చరిత్ర పుటల్లో నిలిచిపోతారు.

విరుగంబక్కం లో సత్తా చాటుతున్న విజయ్ డ్రైవర్ కుమారుడు!

Next Story