- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హామీలన్నీ అలాగే.. గెలుపెట్లా..?
<p>సహకార ఎన్నికలపై ఎమ్మెల్యేల ఆందోళన ఎక్స్ అఫీషియో ఓట్లతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పుర పీఠాలను దక్కించుకుని పరువు కాపాడుకున్న గులాబీ ఎమ్మెల్యేలకు సహకార ఎన్నికల దిగులు పట్టుకుంది. గత మున్సిపాలిటీ ఎన్నికల్లో అన్ని స్థానాలను కచ్చితంగా గెలుచుకుని రావాలని సీఎం కేసీఆర్ ఆదేశించినా.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 18 మున్సిపాలిటీల్లో సింగిల్ మెజార్టీతో గెలిచినవి 8 స్థానాలు మాత్రమే. జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత ప్రాతినిథ్యం […]</p>

సహకార ఎన్నికలపై ఎమ్మెల్యేల ఆందోళన
ఎక్స్ అఫీషియో ఓట్లతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పుర పీఠాలను దక్కించుకుని పరువు కాపాడుకున్న గులాబీ ఎమ్మెల్యేలకు సహకార ఎన్నికల దిగులు పట్టుకుంది. గత మున్సిపాలిటీ ఎన్నికల్లో అన్ని స్థానాలను కచ్చితంగా గెలుచుకుని రావాలని సీఎం కేసీఆర్ ఆదేశించినా.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 18 మున్సిపాలిటీల్లో సింగిల్ మెజార్టీతో గెలిచినవి 8 స్థానాలు మాత్రమే. జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత ప్రాతినిథ్యం వహిస్తున్న సూర్యాపేట, యాదగిరిగుట్టలో వేల కోట్ల అభివృద్ధి చేస్తున్నామని గొప్పగా ప్రచారం చేసినా.. గులాబీ దళానికి ఎదురుగాలే వీచింది. దొడ్డిదారిన స్వతంత్రులను కొనుగోలు చేసి, ఎక్స్ అఫీషియో ఓట్ల ద్వారా ఆ పురపీఠాలను టీఆర్ఎస్ అధిష్టానం చేజిక్కించుకొంది. ప్రస్తుత సహకార ఎన్నికల్లోనూ రైతు ఓటర్ల సహకారం టీఆర్ఎస్‌కు దక్కేలా లేదు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు హామీనిచ్చిన రుణమాఫీ, నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగు నీరు, రైతు బంధు, గిట్టుబాటు ధర కోసం రైతు సమన్వయ సమితిలకు రూ.500 కోట్ల కేటాయింపులు వంటివేవీ అమలుకు నోచుకోలేదు. దీంతో సర్కార్‌పై రైతులు గుర్రుగా ఉన్నట్టు స్పష్టమవుతున్నది. అయినా జిల్లాలోని 109 పీఏసీఎస్‌లను గెలుచుకుంటామని ఎమ్మెల్యేలు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుండటం గమనార్హం.
గులాబీ బాస్‌కు తామేమీ తక్కువ కాదన్నట్టుగా గత అసెంబ్లీ ఎన్నికల్లో.. జిల్లా మంత్రితో పాటు ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యేలు సైతం అమలు సాధ్యంకాని అనేక హామీలను గుప్పించారు. ఇలా రెండోసారి అధికారంలోకొచ్చినా.. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చిన దాఖాలాలు లేవు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేస్తున్న రూ.65 కోట్ల ‘ఆసరా’ పింఛన్లు తప్ప గొప్పగా చెప్పుకునేందుకు ఇంకేమీ కనబడడం లేదు. పోనీ గెలవకుంటే అధిష్టానం వద్ద పరువు పోతుందన్న భయం. ఈ నేపథ్యంలో గెలుపు అవకాశాలున్న బలమైన కాంగ్రెస్ అభ్యర్థులకు ఎర వేస్తున్నారు. వీరి వలలో పడ్డ కాంగ్రెస్ అభ్యర్థులకు గులాబీ కండువా కప్పి నేరుగా ఎన్నుకునేందుకు సొంత పార్టీ అభ్యర్థిని ఎన్నికల రంగం నుంచి తప్పిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సొంత పార్టీ అభ్యర్థులు తిరుగుబావుట ఎగురవేయడంతో ఏం చేయాలో తెలియక ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత పరిస్థితే ఇందుకు ఉదాహరణ. యాదగిరిగుట్ట పీఏసీఎస్‌కు చైర్మెన్ అభ్యర్థిగా కాంగ్రెస్ రాంరెడ్డిని బలపరిచింది. టీఆర్ఎస్ చైర్మెన్ పదవితో పాటు ఎన్నికల ఖర్చులు కూడా భరిస్తామని ఆఫర్ ఇవ్వడంతో రాంరెడ్డి కారెక్కారు. తెలంగాణ ఉద్యమ నేత ఏలేందర్‌రెడ్డి మాసాయిపేట నుంచి ఏకగ్రీవంగా ఎన్నికై చైర్మెన్ ఆశలు పెట్టుకున్నాడు. అయితే తనకు చైర్మెన్ పదవి దక్కదన్న సంకేతాలతో ఆయన టీఆర్ఎస్ క్యాంపు నుంచి వైదొలిగి ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చాడు.
నెరవేరని హామీలు..
ఈ యాసంగి పంటకు యాదాద్రి భువనగిరి జిల్లాలోని 2.20 లక్షల ఎకరాలకు గోదావరి నీళ్లు అందిస్తామని భువనగిరి ఎన్నికల సభలో కేసీఆర్ హామీ ఇచ్చిండు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 15లో నిర్మించాల్సిన గందమల్ల రిజర్వాయర్ పనులు భూసేకరణ వద్దే ఆగిపోయాయి. 16వ ప్యాకేజి కింద నిర్మిస్తున్న 11.29 టీఎంసీల బస్వాపురం రిజర్వాయర్ పనులు నిధులు లేక నీరసించాయి. జిల్లాలోని మూసీ కాలువల విస్తరణ కోసం 2016లో రూ.284 కోట్లు కేటాయించారు. చేసిన పనులకు నిధులు ఇవ్వడం లేదని కాంట్రాక్టర్ అర్ధాంతరంగా పనులు నిలిపేయడంతో నాలుగేండ్లు కావస్తున్నా పూర్తి కాలేదు. తుంగతుర్తి నియోజకవర్గంలోని రుద్రమదేవి, వెంపటి చెరువులను రిజర్వాయర్లుగా మారుస్తామని చేసిన ప్రకటన గాలికొదిలేశారు. చందంపేట మండలం కోగిళ్ల, పీఏపల్లి మండలం నందాపురం లిఫ్టు నిర్మాణాలను చేపట్టి సాగర్ బ్యాక్ వాటర్ మళ్లిస్తానని వాగ్ధానం చేసి వదిలేశారు. రెండేండ్లలో ఎస్ఎల్‌బీసి సొరంగం పూర్తి చేయిస్తానని నేటి వరకు టీబీఎంను బిగించలేదు. 43.930 కిలోమీటర్ల సొరంగం తవ్వాల్సి ఉండగా 32.420 కిలోమీటర్లు తవ్వారు. టన్నెల్-2, నక్కలగండి, పెండ్లిపాకల రిజర్వాయర్ల పనులు నత్తనడకన సాగుతున్నాయి. డిండి ఎత్తిపోతలలో ఐదు రిజర్వాయర్ల నిర్మాణానికి భూసేకరణ కోసం నిధుల సమస్య వెంటాడుతోంది. నాగర్జున్‌సాగర్ నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లో ప్రారంభిస్తానని చెప్పిన కేసీఆర్ ఏడాదిన్నరగా పట్టించుకోవడం లేదు. డీ-8, డీ-9 కాలువల ద్వారా సాగు నీరు అందిస్తానని చెప్పిన మాటలు నీటి మూటలైనాయి.
నత్తనడకన రైతు బంధు..
యాదాద్రి జిల్లాలో 1.45 లక్షల మంది అర్హులైన రైతులు ఉండగా, ఇప్పటి వరకు 2775 మందికి మాత్రమే రూ.46 లక్షలు జమ చేశారు. ఇంక రూ.161.75 కోట్లు రావాల్సి ఉన్నది. గత ఖరీఫ్, రబీకి సంబంధించి 74 వేల మంది రైతులకు రూ.96.54 కోట్ల బకాయిలు అలాగే పేరుకుపోయాయి. వాటిని ఇస్తరా.. లేదా అన్నది అధికారులు సైతం స్పష్టంగా చెప్పకపోవడంతో అన్నదాతలు ఆశలు వదిలించుకున్నారు. సూర్యాపేట, నల్లగొండ జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. రుణమాఫీకి బడ్జెట్‌లో నిధులు కేటాయించి సర్కార్ చేతులు దులుపుకొంది. ఈ కారణంగా బ్యాంకులు కొత్తగా రుణాలు ఇవ్వడంలేదు. అలాగే రెండేండ్ల ముందు సూర్యాపేటలో మినహా ఎక్కడా నియోజకవర్గానికి వెయ్యి చొప్పున నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం పూర్తి కాలేదు. నిరుద్యోగ భృతి ఊసేలేదు. ఉద్యోగాల కల్పన మరిచిపోయిండ్రు. రెండేండ్లుగా స్వయం ఉపాధి కోసం కార్పోరేషన్ల ద్వారా రుణాల పంపిణీ సరిగా లేదు. గొర్రెలు, బర్రెల పంపిణీ నిలిచిపోయింది. ఇలా రైతులకు ఏ ఒక్కటీ పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదు. పైగా ఈ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల తరహాలో సీఎం కేసీఆర్‌ను చూసి వేసే ఓట్లు కాదు. స్థానిక రాజకీయాలు, నేతలతో పాటు స్థానిక అంశాలు ప్రభావం చూపనున్నాయి. ఈ పరిస్థితుల్లో సహకార ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకోవడానికి కొత్తగా ఎలాంటి హామీలు ఇవ్వాలన్న అంశంపై తర్జన భర్జన పడుతూ.. గెలిచేందుకు సాధ్యాసాధ్యాలను విశ్లేషిస్తూ గులాబీ ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నట్టు ఆ పార్టీ వర్గాలే తెలుపుతున్నాయి.






