పోలీసుల బదిలీల్లో పొలిటికల్ లీడర్ల హస్తం?

by  |
పోలీసుల బదిలీల్లో పొలిటికల్ లీడర్ల హస్తం?
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: పోలీస్ శాఖలో అనుకున్న పోస్టింగ్ కావాలంటే రాజకీయ నాయకుల అండదండలు ఉండాలని, వారితోనే అనుకున్న ప్లేస్ లో పోస్టింగ్ దక్కించుకోవచ్చనే భావనలో ఉన్నారు కొందరు పోలీస్ శాఖ సిబ్బంది. అందుకే ఇప్పుడు నిజామాబాద్ రేంజ్ పరిధిలో త్వరలో జరిగే బదిలీల్లో కీలక పోస్టింగ్ల కోసం ఎస్ఐలు స్థానిక ప్రజా ప్రతినిధులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు అనే చర్చ మొదలైంది. గురువారం జరిగిన బదిలీలు, పోస్టింగ్లలో లోకల్ ప్రజా ప్రతినిధులు చెప్పిన వారినే బదిలీ చేశారని, రెండో జాబితాలో చాలామంది పోస్టింగ్‌లు మారడం ఖాయమని పోలీస్ శాఖలో చర్చించుకుంటున్నారు.

నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, జహీరాబాద్ జిల్లాలో జరిగిన బదిలీలతో పాటు కీలక పోలీస్ స్టేషన్లలో లాంగ్ స్టాండింగ్ ఉన్న వారిని రెండో జాబితాలో మార్చుతారని విశ్వసనీయ సమాచారం. నిజామాబాద్ రేంజ్ పరిధిలో ముఖ్యంగా కాసులు కురిపించే పోలీస్ స్టేషన్లు, ఒత్తిడి లేని పోలీస్ స్టేషన్లలో పోస్టింగ్ల కోసం తీవ్రమైన పోటీ ఉంది. కాసుల రుచి మరిగిన వారు పోస్టింగ్ కు రూ. 3లక్షలు ఇవ్వడానికి సిద్ధపడుతున్నట్లు పోలీస్ శాఖే కోడై కూస్తోంది.

చర్చనీయాంశంగా బదిలీల వ్యవహారం..

పోలీస్ శాఖలో నిజామాబాద్ రేంజ్ పరిధిలో జరిగిన బదిలీల వ్యవహరం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ రేంజ్ పరిధిలో(పూర్వ నిజామాబాద్, మెదక్ జిల్లా) సంక్రాంతి పండగ రోజు 11 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ నిజామాబాద్ రేంజ్ ఐజీ శివ శంకర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. తరువాత మరో ఆరుగురికి స్థాన చలనం కలిగిస్తూ ఆర్డర్ పాస్ చేశారు. ఇటీవల అదనపు డీజీపీ పర్యటన తరువాత బదిలీలు ఉంటాయని పోలీస్ శాఖలో చర్చ నడుస్తుండగా ట్రాన్ఫర్స్ జరుగడం విశేషం.

కానీ అదనపు డీజీపీ పర్యటనకు ముందే ఒక డీఎస్పీ, ముగ్గురు సీఐలు, ఇద్దరు ఎస్ఐలు, ఒక కానిస్టేబుల్ అవినీతి నిరోధక శాఖకు చిక్కడం.. అక్రమ వ్యవహారాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఉన్నపళంగా బదిలీలు జరుగడం వెనుక నేతల ఒత్తిడి ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. నిజామాబాద్ సీపీ వ్యక్తిగత సెలవులో వెళ్లిన గంటల వ్యవధిలోనే ఆ కమిషనరేట్ పరిధిలో 11 మందికి స్థాన చలనం కలిగింది. రేంజ్ పరిధిలో మొత్తం 36 మందికి అనుకున్నా ఎస్ఐలకు తమ తెలియకుండా పోస్టింగ్ లు ఇవ్వొద్దని కొందరు నేతలు ఒత్తిడి చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. రేంజ్ పరిధిలో పోస్టింగ్ల వ్యవహారం అంతా లోకల్ ఎమ్మెల్యేల ఇష్టానుసారమే జరుగుతుండటంతో కొందరిపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ.. వారికి రాజకీయ నేతలే అండగా ఉన్నారనే విమర్శలు ఉన్నాయి.



Next Story