వరంగల్‌లో పొలిటికల్ హీట్

by  |
వరంగల్‌లో పొలిటికల్ హీట్
X

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్: వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు త్వ‌ర‌లో జ‌రగనున్న నేప‌థ్యంలో రాజ‌కీయ వేడి పెరుగుతోంది. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌, కొత్త ఉత్సాహంతో ముందుకు క‌దులుతున్న బీజేపీ మ‌ధ్య మాట‌ల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది. స‌వాళ్లు, ప్ర‌తిస‌వాళ్ల‌తో ఉనికిని చాటుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. వ‌రంగ‌ల్ అభివృద్ధికి గ‌త ఏడున్న‌రేళ్ల కాలంలో టీఆర్‌ఎస్ ప్ర‌భుత్వం చేసింది శూన్య‌మ‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన అభివృద్ధి అంతా కేంద్రం నిధుల‌తోనేనంటూ బీజేపీ నాయ‌కులు ప్ర‌చారం చేసుకుంటున్నారు. వ‌రంగ‌ల్ అభివృద్ధికి రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌లేంటో వివ‌రిస్తూ శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేస్తోంది.

అధికార పార్టీయే టార్గెట్..

నగర అభివృద్ధికి రాష్ట్ర ప్ర‌భుత్వం ఏం చేయ‌లేదని పేర్కొంటూ.. టీఆర్‌ఎస్ నాయ‌కుల‌పై బీజేపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. భ‌విష్య‌త్‌ అంతా త‌మ‌దేన‌నే భావ‌న‌ను టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ద్వితీయ‌ శ్రేణుల్లో క‌లిగిస్తున్నారు. అలాగే, ఏళ్లుగా పార్టీని ప‌ట్టుకుని వేలాడుతూ.. ఆర్థికంగా న‌ష్టం చ‌విచూసిన స‌రైన ప్రాధాన్యం ద‌క్క‌ని నేత‌ల‌ను గుర్తిస్తున్నారు. ముందు ప‌ల‌క‌రింపులు.. త‌ర్వాత చ‌ర్చ‌లు.. రాష్ట్ర స్థాయి నేత‌ల‌తో హామీలు వంటి రాజ‌కీయ కండువా ప్ర‌క్రియ‌ను బీజేపీ దిగ్విజ‌యంగా సాగిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇటీవ‌ల బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌లో 37వ డివిజ‌న్ కార్పొరేట‌ర్ కోర‌బోయిన సాంబ‌య్య, టీఆర్‌ఎస్‌లో ఉద్య‌మ‌కాలం నుంచి ప‌నిచేస్తున్న‌ జిల్లా గ్రంథాల‌య సంస్థ డైరెక్ట‌ర్ స‌ముద్రాల మ‌ధు, కాంగ్రెస్ సీనియ‌ర్ లీడ‌ర్ కొండాముర‌ళికి ద‌గ్గ‌రి నేత అయిన గంటా ర‌వి క‌మ‌ల ద‌ళంలో చేరిపోయారు. ఈ సంద‌ర్భంగా దాదాపు 25 మంది ప్ర‌ముఖులు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నుంచి బీజేపీ తీర్థం పుచ్చుకోవ‌డం గ‌మ‌నార్హం.

స‌వాళ్ల‌కు స్పందిస్తున్న టీఆర్‌ఎస్‌..

బీజేపీ నేత‌ల సవాళ్ల‌కు టీఆర్ ఎస్ నేత‌లు ప్ర‌తిస‌వాళ్ల‌ను విసురుతున్నారు. బీజేపీ నేత‌లు విసిరిన స‌వాళ్లకు స్పందిస్తుండ‌టమే కాక తమ‌ వైపు త‌ప్పులేద‌ని నిరూపించుకునే ప్ర‌య‌త్నం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. ప్ర‌జాక్షేత్రంలో నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవాల‌ని భావిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇందుకు రైల్వే వ్యాగ‌న్ వ‌ర్క్‌షాపున‌కు సంబంధించిన భూ అంశమే నిద‌ర్శ‌నంగా మారింది. పీఓహెచ్‌, వ్యాగన్‌ వర్క్‌షాపు నిర్మాణానికి సంబంధించి రైల్వేశాఖ రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని 150 ఎక‌రాల భూమిని కోర‌గా ఇప్ప‌టి వ‌ర‌కు అంద‌జేయలేద‌ని బీజేపీ అగ్ర‌నేత‌లు ఆరోపించారు. మ‌రుస‌టి రోజే టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు న‌న్న‌పునేని న‌రేంద‌ర్‌, ప‌శ్చిమ విన‌య్‌భాస్క‌ర్‌, అరూరి ర‌మేశ్, మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు, ఎంపీ ద‌యాక‌ర్ స్పందించారు. మంత్రి ఎర్ర‌బెల్లి నేతృత్వంలో స్వ‌యంగా క‌లెక్ట‌రేట్‌లో సికింద్రాబాద్‌ రైల్వే అదనపు డివిజన్‌ రైల్వే మేనేజర్‌ సుబ్రహ్మణ్యానికి 150 ఎక‌రాల భూ సేక‌ర‌ణ ప‌త్రాల‌ను అప్ప‌గించ‌డం విశేషం.

చ‌లో భ‌ద్రకాళి ఆల‌యంతో స్పీడ్ పెంచిన బీజేపీ..

రైల్వే వ్యాగ‌న్ ప‌రిశ్ర‌మ భూ కేటాయింపుల‌పై టీఆర్‌ఎస్ ప్ర‌జాప్ర‌తినిధులు ధీటుగా స్పందించ‌డంతో బీజేపీ స్మార్ట్ సిటీ లొసుగుపై దృష్టి పెట్టింది. వ‌రంగ‌ల్ నగరానికి కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ పథకం కింద ఇచ్చిన నిధులపై భద్రకాళి అమ్మవారి సాక్షిగా టీఆర్ఎస్ నాయకులు చర్చకు సిద్ధమా..? 48 గంట‌ల్లో దీనికి టీఆర్‌ఎస్ నాయ‌కులు భ‌ద్రాకాళి ఆల‌యం వ‌ద్ద‌కు రావాల‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ స‌వాల్ విసిరిన విష‌యం తెలిసిందే.

భద్రకాళీ ఆలయానికి చేరుకున్న బీజేపీ నేతలు

బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి రావు పద్మ భద్రకాళీ అమ్మవారి గుడికి వస్తున్నానని సవాల్ విసిరారు. అందులో భాగంగా గురువారం సాయంత్రం భ‌ద్ర‌కాళీ ఆల‌యానికి చేరుకున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం రూ. 196 కోట్లు కేటాయిస్తే రాష్ట్ర ప్ర‌భుత్వం త‌న వంతుగా రూ.196 కోట్లు కేటాయించ‌లేదో చెప్పాల‌ని డిమాండ్ చేస్తూ, ద‌మ్ముంటే టీఆర్‌ఎస్ నేత‌లు భ‌ద్రకాళి ఆల‌యానికి వ‌చ్చి స‌మాధానం చెప్పాలని బీజేపీ జిల్లా అధ్య‌క్షురాలు రావుప‌ద్మ స‌వాల్ విసిరారు. వ‌రంగ‌ల్ అభివృద్ధి అంశాల‌ను ఎజెండాగా చేసుకుని రెండు పార్టీల నేత‌లు రాజ‌కీయ చ‌ర్చ‌కంటే ర‌చ్చ‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేలా ప్ర‌ణాళిక‌ను రూపొందించుకోవడం గ‌మ‌నార్హం.


Next Story

Most Viewed