మోగిన నగారా.. పొలిటికల్ ‘హీట్’ పుట్టిస్తున్న హుజురాబాద్

by  |
Huzurabad-by-election
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఎట్టకేలకు హుజురాబాద్ బై పోల్స్ నగారా మోగింది. దేశ వ్యాప్తంగా జరగనున్న ఉప ఎన్నికల షెడ్యూల్‌లో హుజురాబాద్‌కు స్థానం కల్పించకపోవడంతో ఆలస్యం అవుతుందని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా కేంద్ర ఎన్నికల సంఘం.. హుజురాబాద్‌లోనూ ఎన్నికలు నిర్వహించనున్నామని ప్రకటించడంతో ఎలక్షన్ హీట్ మరింత వేడెక్కనుంది. ఇప్పటికే హుజురాబాద్ ఎన్నికల రణరంగాన్ని తలపిస్తుండగా తాజాగా షెడ్యూల్ కూడా విడుదల కావడంతో ప్రచారం మరింత ఊపందుకోనుంది.

బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్..

ఈటల ఎపిసోడ్ తరువాత హుజురాబాద్ కేంద్రీకృతంగా సాగుతున్న ప్రచార హోరు అంతా ఇంతా కాదు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు నువ్వా నేనా అన్న రీతిలో క్యాంపెయిన్ చేస్తున్నాయి. షెడ్యూల్ విడుదల అయ్యే నాటికల్లా పట్టు సాధించాలన్న ఆలోచనతో ముందుకు సాగాయి. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్న ఈటల రాజేందర్ తన పట్టు సడలకుండా ఉండేందుకు పాదయాత్ర చేపట్టగా, కులాల వారీగా సమీకరణాలు చేశారు. గ్రామ స్థాయిలో తన కేడర్‌ను బలోపేతం చేసుకునే ప్రయత్నం చేశారు. ఊరూ వాడా తిరుగుతున్న ఈటల ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదపడం ఆరంభించారు.

అయితే, ఈటల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ టీఆర్ఎస్ పార్టీ కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది. సంక్షేమ పథకాల అమలుకు కేరాఫ్ అడ్రస్‌గా హుజురాబాద్‌ను మార్చుకుంది. ముగ్గురు మంత్రులతో పాటు పలువురు ముఖ్య నాయకులను కూడా మోహరించింది. హుజురాబాద్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో మంత్రి హరీష్ రావు కీలక భూమిక పోషిస్తున్నారు. ఇప్పటికే ఈటల అనుచరులను తిరిగి టీఆర్ఎస్ వైపు తిప్పుకోవడంలో మంత్రులు సక్సెస్ అయ్యారు. అయితే, ఈటల ప్రభావాన్ని వీరు ఎంతమేర తగ్గించగలిగారోనన్నది మాత్రం వేచి చూడాల్సిందే.

వెయిట్ అండ్ సీ..

ఇక మరో ప్రత్యర్థి పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ.. అభ్యర్థిని ప్రకటించడంలో మీనామేషాలు లెక్కిస్తుందనే చెప్పాలి. ముందుగా ఇక్కడి నుండి మాజీ మంత్రి కొండా సురేఖ పేరును పరిశీలించినప్పుడు స్థానికత అంశం తెరపైకి రావడంతో రాష్ట్ర నాయకత్వం వెనుకంజ వేసింది. దీంతో ఆశావాహులు దరఖాస్తు చేసుకోవాలని సూచించడంతో 18 మంది ముందుకు వచ్చారు. వారందరి జాబితా కూడా పీసీసీకి చేరినా.. నేటికీ అభ్యర్థి ఎంపికపై స్పష్టత రాలేదు. షెడ్యూల్ కూడా విడుదల కావడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపిక విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ కాంగ్రెస్ వర్గాల్లో నెలకొంది.

చీలితే ఎలా..

రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఓడించాలన్న లక్ష్యంతో ఉన్న ఇతర రాజకీయ పార్టీలు ఏక తాటిపై నిలబడకపోతే ఓట్లు చీలిపోయే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సైద్దాంతిక విబేధాలు ఉన్న ప్రతిపక్ష పార్టీలు అన్నీ.. ఏక తాటిపై నడుస్తాయా లేదా అన్నదే ప్రధాన చర్చ.

బిగ్ బ్రేకింగ్.. హుజూరాబాద్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్


Next Story

Most Viewed