పాండమిక్‌లో నిబంధనలకు బ్రేకిచ్చి.. పోలీసుకు ముద్దిచ్చి!

306

దిశ, వెబ్‌డెస్క్ : రూల్స్ బ్రేక్ చేయడం.. అడ్డంగా దొరికిపోతే సారీ చెప్పడం జనాలకు ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. నిబంధనలు ఉల్లంఘించే వారికి కారణాలు అనేకం ఉండొచ్చు. అలాగనీ చూసినట్టు వదిలేస్తే వారిని చూసి మరికొందరు తయారయ్యే అవకాశం లేకపోలేదు. అందుకోసం ప్రభుత్వ యంత్రాంగం విధించే నిబంధనలు సరిగా అమలు అవుతున్నాయా లేదా అని పర్యవేక్షించాల్సిన బాధ్యత ఆయా డిపార్ట్‌మెంట్ అధికారులపై ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటే ఇంకొకరు అలా చేసేందుకు సాహసించరు. లేనియెడల వ్యవస్థలపై, చట్టాలపై ప్రజలకు నమ్మకం, భయం అనేది లేకుండా పోతుంది. దీంతో ప్రభుత్వం, పాలకులు, అధికారులు అపహస్యం అవ్వాల్సి వస్తుంది.

పాండమిక్ సమయంలో సరిగ్గా ఇలాంటి పరిస్థితులనే మన దేశంలో చూశాం. లాక్‌డౌన్ అమల్లోకి వచ్చాక అందరూ ఇళ్లల్లోనే ఉండాలని.. అవసరమైనపుడు మాత్రమే బయటకు రావాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశిస్తే ఏ ఒక్కరూ వినిపించుకున్న పాపాన పోలేదు. ఒకరు నిత్యావసరాలు, మెడికల్, పెట్రోల్ ఇలా వివిధ కారణాలతో బయటకు వచ్చేశారు. మరికొందరైతే రాత్రుళ్లు కర్ఫ్యూ సమయంలో కూడా వాహనాలపై తిరుగుతూ పట్టుబడిన ఘటనలు అనేకం ఉన్నాయి. అయితే, పోలీసులు మాత్రం సరైన రీజన్ ఉన్న వారికే అనుమతినిచ్చి, మిగతా వారికి ఎలాంటి శిక్ష విధించారో అందరికీ తెలిసిందే. కాగా, సరిగ్గా ఇలాంటి ఘటనే పెరువియన్ దేశ రాజధాని లిమాలోని మిరాఫ్లోర్స్ జిల్లాలో సంభవించింది. ఆ సమయంలో అక్కడి పోలీసు అధికారి వ్యవహరించిన తీరును చూసి నెటిజన్స్ మండిపడుతున్నారు. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను వీక్షించిన ఉన్నతాధికారులు వెంటనే అతన్ని విధుల నుంచి తప్పించారంటే అది ఎంత పెద్ద మిస్టేక్ అర్థం చేసుకోవచ్చు.

ఇటీవల పెరూలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో అక్కడి ప్రభుత్వం మళ్లీ లాక్‌డౌన్ విధించింది. రాత్రుళ్లు ఎవరూ బయటకు రాకూడదని ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. ఈ క్రమంలోనే ఓ యువతి అర్థరాత్రి బయటకు వచ్చింది. అది గమనించిన ఓ పోలీసు అధికారి ఆమెను ఆపాడు. తొలుత జరిమానా కట్టాలని ఆదేశించగా.. అందుకు ప్రతిఫలంగా ముద్దిస్తానని, జరిమానా రద్దు చేయాలని కోరింది. దీంతో అతను ఆ యువతిని ముద్దాడి వదిలేశాడు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డు కావడంతో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. అది తెలిసి మిరాఫ్లోర్స్ జిల్లా మేయర్ అతన్ని సస్పెండ్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పెరూలో కరోనా సోకి ఇప్పటికీ 40 వేలకు పైగా ప్రజలు మృత్యువాత పడ్డారు. కరోనా సమయంలో బయటకు వచ్చిన యువతిపై చర్యలు తీసుకోకుండా, మాస్క్ తీసి మరి ఆమెను ముద్దాడటాన్ని అక్కడి అధికారులతో సహా నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..