జాగ్రత్త పడినా.. సంతోష్ మర్డర్ కేసు నిందితులు ఎలా దొరికారంటే..?

by  |
జాగ్రత్త పడినా.. సంతోష్ మర్డర్ కేసు నిందితులు ఎలా దొరికారంటే..?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : టెక్నాలజీ సాయంతో తాము ఎక్కుడున్నా పోలీసులు పట్టుకుంటారన్న భయంతో వారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చివరకు చిక్కక తప్పలేదు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వెంకటేశ్వర్లపల్లి హత్య కేసు నిందితులు సంతోష్ హత్యకు వేసిన స్కెచ్ తర్వాత పోలీసులకు చిక్కకుండా పరారీ అయినప్పటికీ చివరకు ఖాకీల చేతికి చిక్కారు. ఈ నెల 13 తెల్లవారు జామున సంతోష్ హత్య అనంతరం జూపిటర్ బైక్ పై వెళ్లిన నిందితులు తమను పోలీసులు వెంటాడుతారని ముందే ఊహించి జగిత్యాల జిల్లా కొండగట్టు సమీపంలో తమ సెల్ ఫోన్లను ఆఫ్ చేసి వెళ్లిపోయారు. అయితే, తెలివిగా తప్పించుకున్నా పోలీసులు మాత్రం టెక్నాలజీ సాయంతో వారిని పట్టుకోవడం గమనార్హం. ఇంతకీ సంతోష్ హత్యకేసు నిందితులను పోలీసులు ఎలా పట్టుకున్నారో తెలియాలంటే రీడ్ దీస్ స్టోరీ…

వర్కౌటైనా వాచింగ్..

సంతోష్ హత్య కేసు నిందితులను పట్టుకునేందుకు టెక్నాలజీ సాయంతో వారు ఏఏ టవర్ లొకేషన్లలో తిరగుతున్నారో తెలుసుకునేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారనే చెప్పాలి. కొండగట్టు సమీపంలో నిందితులు తమ ఫోన్లను ఆఫ్ చేయడంతో వారిని పట్టుకోవడం ఎలా అని ఆలోచించారు. అన్ని కోణాల్లో ఆరా తీస్తున్న క్రమంలో వారికి వచ్చిన ఓ ఐడియానే మర్డర్ మిస్టరీ చిక్కుముడిని విప్పినట్టు సమాచారం. నిందితులు ఖచ్చితంగా జమ్మికుంట ప్రాంతంలో పోలీసులు ఏం చేస్తున్నారు..? ఇక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయి. అని తెలుసుకునేందుకు ఏదో రకంగా ఈ ప్రాంతానికి చెందిన వారితో కమ్యూనికేట్ అవుతారని పోలీసులకు వచ్చిన అనుమానం నిజమైంది.

దీంతో అనుమానితుల నెంబర్లపై నిఘా వేసిన పోలీసులు వారికి వస్తున్న కాల్స్ డేటాను బేస్ చేసుకుని నిందితుల కోసం వేటాడి సఫలం అయ్యారు. కొండగట్టు సమీపంలో మొబైల్స్ ఆఫ్ చేసిన తరువాత వారు సుమారు 20 మందిని ఫోన్లు అడిగి జమ్మికుంటలో ఏం జరుగుతుందో తెలుసుకున్నారు. దీంతో వారిని ట్రాక్ చేసేందుకు పోలీసులకు సులువైందనే చెప్పాలి. కాల్స్ డేటా లిస్టును ఆధారం చేసుకుని ఫోన్లు ఇచ్చిన వారి నుండి వివరాలను సేకరించారు. మొదట నిజామాబాద్ బస్‌స్టేషన్‌లో బైక్ పార్క్ చేసిన విషయాన్ని గుర్తించారు. ఆ తరువాత వీరు వేర్వేరు రాష్ట్రాల్లో తిరుగుతూ తప్పించుకున్నారు. ఓ సారి కర్ణాటకలోని బెంగుళూరులో పోలీసులకు దొరికినట్టే దొరికి మిస్సయ్యారు. పట్టువదలని విక్రమార్కుళ్లలా పోలీసులు నిందితుల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలించి ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.

డ్రగ్స్ వింగ్‌కు సవాల్..

మెడికల్ షాపుల్లో జరుగుతున్న విక్రయాల తీరును సంతోష్ హత్య కేసు తేటతెల్లం చేసింది. మందుల దుకాణాల్లో క్వాలిఫైడ్ డాక్టర్లు రాసిన ప్రిస్కిప్షన్ లేకుండా విక్రయాలు జరపవద్దన్న నిబంధన ఉన్నా పట్టించుకునే వారే లేకుండా పోయారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సంతోష్ హత్య కోసం నిందితులు ఏకంగా నిద్రమాత్రలు కొనుగోలు చేయడం గమనార్హం. హన్మకొండలోని మెడికల్ షాపులో మత్తునిచ్చేందుకు వాడే ట్యాబ్లెట్లను కొన్నామని సంతోష్ మర్డర్ కేసు నిందితులు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు.

అంటే సాధారణ రోగాలకు అవసరమైన మందులే కాకుండా ప్రమాదకరమైన మత్తు ట్యాబెట్లను కూడా డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా విక్రయాలు చేస్తున్నారని స్పష్టం అవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా మెడికల్ షాపుల్లో విక్రయాలు జరుపుతున్న విషయంపై డ్రగ్స్ వింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. స్వేచ్ఛగా విక్రయించే పద్దతిని కట్టడి చేయనట్టయితే ఇలాంటి నేరాలు మరిన్ని జరిగే అవకాశం కూడా లేకపోలేదు. పోలీసులు కూడా నిందితుల వాంగ్మూలాన్ని ఆధారం చేసుకుని నిద్ర మాత్రలు విక్రయించిన మెడికల్ షాపుపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటే మరోసారి నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు జరిపే అవకాశం ఉండదన్న అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.


Next Story

Most Viewed