భక్తి ముసుగులో దొంగ బాబా రాసలీలలు.. మహిళల నగ్న వీడియోలను తీసి

by  |
భక్తి ముసుగులో దొంగ బాబా రాసలీలలు.. మహిళల నగ్న వీడియోలను తీసి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రజల మూఢనమ్మకాలను దొంగ బాబాలు క్యాష్ చేసుకుంటున్నారు. మా దగ్గర అతీత శక్తులు ఉన్నాయని, మాకు డబ్బులు ఇస్తే వాటిని రెండు, మూడు రేట్లు చేసి ఇస్తామని మాయమాటలు చెప్పి అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. ఇక వీటితో ఆగకుండా మహిళలను శక్తుల పేరుతో లొంగబర్చుకోని, వారిని శారీరకంగా అనుభవించి, ఆ దృశ్యాలను వీడియోలో బంధించి.. వాటిని చూపించి బెదిరించి మరీ డబ్బులు గుంజుతున్నారు దొంగ బాబాలు. తాజాగా భక్తి ముసుగులో డబ్బులను కొల్లగొట్టి, మహిళలను లైంగిక వేధింపులకు గురిచేస్తున్న ఓ దొంగ బాబా గుట్టు రట్టు చేశారు నల్గొండ పోలీసులు.

వివరాలలోకి వెళితే.. కృష్ణాజిల్లా నందిగామకు చెందిన విశ్వచైతన్య(37) అనే వ్యక్తి నాలుగేళ్ల క్రితం నల్లగొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలం అజ్మాపురంలో 10 ఎకరాల స్థలం కొని అందులో శ్రీసాయి సర్వస్వం మాన్సీ ఛారిటబుల్‌ ట్రస్టును ఏర్పాటు చేశాడు. తనకు అతీత శక్తులు ఉన్నాయని ప్రజలను నమ్మించి విశ్వచైతన్య స్వామిగా మారిపోయాడు. మూలికలు, తాయెత్తులు ఇస్తూ, దెయ్యాలను వదలగొడతాను అంటూ వచ్చిన వారివద్దనుంచి భారీగానే డబ్బు లాగేవాడు. ఇక వీటితో స్వామి ఆగలేదు. తన దగ్గరకు వచ్చిన మహిళా భక్తులపై కన్నేశాడు. వచ్చిన వారికి మూలికలు ఇస్తానని లోపలకి తీసుకెళ్లి వారిని మాటలో పెట్టి లైంగిక వేధింపులకు గురిచేసేవాడు. కొంతమంది మహిళలతో శారీరక సంబంధం పెట్టుకొని వారిని ఆస్థాన భక్తులుగా మార్చుకున్నాడు. ఇక ఈ నేపథ్యంలో ఇటీవల ఒక మహిళను లైంగికంగా వేధించడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో దొంగ బాబా రాసలీలలు వెలుగుచూశాయి.

భక్తి ముసుగులో నేరాలకు పాల్పడుతున్న అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితో పాటు మరో ముగ్గురు శిష్యులను కూడా అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.26లక్షలు, అరకిలో బంగారు ఆభరణాలు, రూ.1.5 కోట్ల ఎఫ్‌డీలు, 17 ఎకరాల భూమి తాలూకు పత్రాలు, 7 ల్యాప్‌టాప్‌లు, 4 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ దొంగ బాబాకు విదేశాలలో కూడా భక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. విశ్వచైతన్య మొబైల్‌లో అన్నీ మహిళల నగ్న వీడియోలు, వాట్సాప్‌లో అసభ్యకరమైన చాటింగ్‌లను పోలీసులు గుర్తించారు.

Next Story

Most Viewed