విద్యార్థులకు అవగాహన.. పోలీసు కళాబృందంతో ఆట పాట

by  |
విద్యార్థులకు అవగాహన.. పోలీసు కళాబృందంతో ఆట పాట
X

దిశ, మహబూబ్ నగర్ : మహబుబ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిల్లలమర్రి వద్ద తెలంగాణ ప్రభుత్వ గురుకుల మహిళా డిగ్రీ కాలేజీలో సురక్ష పోలీసు కళా బృందం సామాజిక అవగాహన కార్యక్రమం చేపట్టారు. బాలబాలికలు చదువుపై దృష్టి సారించి క్రమశిక్షణతో కృషి చేయడం వలన ఉత్తమ భవిష్యత్తు లభిస్తుందని, మన పెద్దలు చెప్పినట్టుగా కష్టం చేసిన వారెన్నడూ చెడిపోరని కళా బృందం సభ్యులు మాటలు, పాటల ద్వారా వివరించారు.

మన దేశంలోని యువత స్వయంకృషితో అత్యున్నత స్థాయికి ఎదుగుతున్న విషయం చూస్తూనే ఉన్నామని, అటువంటివారి స్పూర్తితో విద్య వైపుగా మన గ్రామీణ యువత దృష్టి సారించి, తల్లిదండ్రులకు, పుట్టిన ఊరుకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సూచించారు. చిన్న వయసులో ప్రేమ అంటూ చెడు ఆలోచనలు, అలవాట్ల వలన మనమెప్పటికీ ఎదగలేమని, ఒక ఉత్తమమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు వెళ్లాలని పోలీసు కళాబృందం సభ్యులు ఆటపాటల ద్వారా సూచించారు.

పిల్లలను ఉత్తమ మార్గం వైపు నడిపించేందుకు తల్లిదండ్రులు, కుటుంబ పెద్దలు సమయం కేటాయించడం, శ్రద్ధ తీసుకోవడం అవసరమని తెలిపారు. యువత సామాజిక మాధ్యమాలు, మొబైల్ ఫోన్లు, మద్యం వంటి వ్యసనాలకు దూరంగా ఉండి.. కష్టపడి పని చేయడంలోనే శక్తిసామర్థ్యాలనూ, గౌరవాన్ని పొందాలని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతున్న సైబర్ మోసాల గురించి తెలుసుకోవడం, మన కుటుంబ సభ్యులకు, బంధువులు, స్నేహితులకు వివరించాలని అన్నారు.

అదేవిధంగా రోడ్డు ప్రమాదాల వలన జరుగుతున్న తీవ్రమైన నష్టాలు, కుటుంబం మొత్తం అంతులేని విషాదంలో మునిగిపోతున్న దుర్ఘటనలు మన కండ్ల ముందు ఉన్నాయని, అందుకే పిల్లలు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపవద్దని, పెద్దలు కూడా మద్యం సేవించి, హెల్మెట్ లేకుండా, దురుసుగా, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వంటివి చేయడం కుటుంబాలను రోడ్ల పాలు చేయడమేనని కళా బృందం సభ్యులు వివరించారు.

ఇకపోతే ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ నుంచి కూడా పూర్తిస్థాయిలో ప్రమాదం తొలగిపోలేదని అన్నారు. అందుకే ప్రతీ ఒక్కరూ మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడంతో పాటుగా చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని ప్రజలకు తెలియజేశారు. కొవిడ్ జాగ్రత్తల పట్ల నిర్లక్ష్యంగా ఉండే వారిపై కేసులు నమోదు చేయడం, జరిమానా విధించడం తప్పదని హెచ్చరించారు. జిల్లా ప్రజలు ముఖ్యంగా యువత, బాలబాలికలు గొప్పగా ఎదగాలని జిల్లా ఎస్పీ ఆర్. వెంకటేశ్వర్లు తమ సందేశాన్ని మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో వినిపించారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఐటీ సెల్ ఇన్చార్జ్ సీతయ్య (సీఐ), ప్రిన్సిపల్ జయప్రద, వైస్ ప్రిన్సిపల్ వాసవి, పీ.డీ కవితతో పాటు కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.



Next Story