పెద్దపల్లిలో మోహన్ బాబుపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు.. ఎందుకో తెలుసా.?

by  |

దిశ, ధర్మారం : తెలంగాణవ్యాప్తంగా ఉన్న యాదవుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి జిల్లా యాదవ సంఘం నాయకులు ధర్మారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఇటీవల జరిగిన ‘మా’ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు విజయం సాధించిన సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ‘మా’ సభ్యులు క్రమశిక్షణను, ఘర్షణలను, అల్లర్లను గొర్రెలు మేపుకునేవారు సైతం సెల్ ఫోన్లలో వీక్షిస్తున్నారన్నారని అన్నారు. సీనియర్ నటుడు, రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి ఇలా గొర్రెల కాపరులను, యాదవుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఒక గౌరవప్రదమైన వ్యక్తి సమాజాన్ని, అందులో ఉన్న కులాలను చీల్చినట్లుగా మాట్లాడటం విచారకరమన్నారు. జాతీయతను దెబ్బతీసినట్లు మాట్లాడినందుకు మోహన్ బాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇకపై ఎవరైనా యాదవుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడితే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

Next Story