వేకువ వచ్చేంత వరకు…..

187
photo credits: google commons

ఎవ్వరేమనుకున్నా సరే
ఎట్లనుకున్నా సరే
నేను నేనే నాకు నేనే
నేను మరెవ్వరో కాదు.

నేను ఈ ప్రపంచాన్ని
చూస్తున్నప్పటినుంచి
వింటున్నా కంటున్నా.

కాళోజీ కవితలు
సుద్దాల గీతాలు
సోమన్న ద్విపదలు
పోతన్న పద్యాలు
నా మనసంతా అలుముకుని
అగులుబుగులు చేస్తూ
జలపాతాలై దూకుతూ
నురుగలు కక్కుతూ
పరుగులు పెడ్తున్నై.

కాళోజీ మాట
భగత్ సింగ్ బాట
చేగువేర చేత
మండేలా మార్గం
సర్దార్ పాపన్న సాహసం
కొమురంభీం తెగువ
అంబేద్కర్ ఆశయం
అశేష జనావళి అలవికానీ
ధీరత్వాలు నన్ను
ఉరికిస్తూ
ఉక్కిరిబిక్కిరిచేసేస్తూ
ఊపిరాడని ఉద్వేగం
తెప్పిస్తున్నై.

మహనీయుల
ఆదర్శాల స్పూర్తితో
ఎవ్వరేమన్నా
ఎదురేమొచ్చినా సరే
ఎన్నోఆటంకాల
కంటకాల్ని తొలగిస్తూ
దాటేస్తూ నా బాటలోనే
నేను సాగిపోతా…

అలుపు వచ్చినా సరే
ఆగకుండా సాగిపోతా…
చీకటి తొలగి వేకువ
వచ్చేంత వరకు…

(సెప్టెంబర్ 9, కాళోజి జయంతి సందర్భంగా)

—నల్లెల్ల రాజయ్య, వరంగల్, సెల్ నం:9989 415571