యూపీ పోల్స్‌కు బీజేపీ కసరత్తు.. పీఎం సన్నిహితుడు ఏకే శర్మకు కీలక పాత్ర

by  |
యూపీ పోల్స్‌కు బీజేపీ కసరత్తు.. పీఎం సన్నిహితుడు ఏకే శర్మకు కీలక పాత్ర
X

లక్నో: వచ్చే ఏడాదిలో జరగనున్న ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించింది. సీఎం యోగి ఆదిత్యానాథ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ సారథ్యంలో ఎన్నికలు పోరాడనున్నట్టు పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. కరోనా సెకండ్ వేవ్ నియంత్రణలో విఫలమయ్యారని సీఎం యోగిపై పార్టీలోనే అంతర్గతంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. స్థానిక ఎన్నికల్లోనూ బీజేపీ బలంగా ఉన్న ప్రాంతాల్లో ఘోర పరాజయాలను మూటగట్టుకోవాల్సి వచ్చింది. దీంతో రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఉండొచ్చనీ గుసగుసలు వినిపించాయి. కానీ, తాజాగా ఆ వాదనలను పార్టీవర్గాలు కొట్టిపారేశాయి.

ఎన్నికలకు సంసిద్ధమవ్వడానికి కరోనా నియంత్రణ కోసమూ పలుమార్పులను పార్టీ అధిష్టానం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీకి సన్నిహితుడుగా భావిస్తున్న మాజీ ఐఏఎస్ అధికారి ఏకే శర్మకు రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పాత్రకు ఎంపిక చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి, దాని చుట్టుపక్కల జిల్లాల్లో కరోనా నియంత్రణ చర్యల్లో తలమునకలై ఉన్నారు. స్థానిక ఎన్నికల్లో ప్రదర్శనను అసెంబ్లీ ఎన్నికలకు సరిపోల్చలేమని, కానీ, 2024 సార్వత్రిక ఎన్నికలకు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కీలక సంకేతాలనిస్తాయని ఆరెస్సెస్ వర్గాలు భావిస్తున్నాయి. అందుకోసమే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధత కోసం పార్టీ బృందాలను ఇప్పటికే యూపీకి పంపింది.


Next Story