రాష్ట్రానికి పీఎంజీఎస్‌వై నిధులు రూ. 1084 కోట్లు విడుదల

65

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రధానమంత్రి గ్రామీణ సడక్​ యోజన (పీఎంజీఎస్​వై) కింద రాష్ట్రానికి రూ. 1084.51 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మొత్తం 194 రోడ్లు, 95 వంతెనల నిర్మాణానికి ఈ నిధులు వినియోగించనున్నారు. 1217.05 కిలోమీటర్ల పరిధిలో 194 రోడ్లు ఉండగా… 6132 మీటర్ల పరిధిలో 95 బ్రిడ్జిలను నిర్మించాల్సి ఉంది. రోడ్ల నిర్మాణానికి రూ. 800.98 కోట్లు, వంతెనల కోసం రూ. 283.53 కోట్లను కేటాయించారు. దీనిలో రూ. 1020.61 కోట్లు నిర్మాణ పనుల కోసం ఉండగా… రూ. 63.90 కోట్లను ఐదేండ్ల పాటు నిర్వహణ కోసం వెచ్చించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

పీఎంజీఎస్​వైలో కేంద్రం వాటా 59.27 శాతం కాగా.. రాష్ట్రం వాటా 40.73 శాతంగా ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పీఎంజీఎస్​వై మూడో విడుతలో భాగంగా రాష్ట్రానికి ఈ నిధులు విడుదల చేసినట్లు వెల్లడించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం పీఎంజీఎస్​వై కింద రోడ్ల నిర్మాణానికి రూ.445.06 కోట్లు, బ్రిడ్జీల కోసం రూ.161.83 కోట్లు మొత్తం 606.88 కోట్లు విడుదల చేయగా, రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రోడ్ల నిర్మాణానికి రూ.305.95 కోట్లు, వంతెనల కోసం రూ.107.88 కోట్లు చొప్పున విడుదల చేసింది. ఐదేండ్ల పాటు రోడ్ల నిర్వహణకు రూ.50.08 కోట్లు, బ్రిడ్జీల నిర్వహణకు 13.82 కోట్లను కేటాయించినట్లు పంచాయతీరాజ్​ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్​ సెక్రెటరీ సందీప్​కుమార్​ సుల్తానియా జారీ చేసిన జీవోలో వివరించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..